- సాగర్ జలవిద్యుత్ కేంద్రంలో పనిచేయని 2వ నంబర్ టర్బైన్
- జపాన్ నుంచి వచ్చిన సాంకేతిక నిపుణులు
నల్లగొండ, అక్టోబర్ 18 (విజయక్రాంతి) : నాగార్జున సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రం రెండో నంబర్ టర్బైన్ మరమ్మతు ప్రారంభమైంది. శుక్రవారం జపాన్ నుంచి సాంకేతిక నిపుణులు వచ్చినట్టు తెలిసింది. రెండో నంబర్ రోటర్ స్పైడర్ గతేడాది నవంబర్‌లో మరమ్మతుకు గురైంది.
జెన్‌కో అధికారులు పట్టించుకోకపోవడంతో జల విద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో మొత్తం 8 టర్బైన్లు ఉన్నాయి. ఒకటో నంబర్ టర్బైన్ బీహెచ్‌ఈఎల్ (భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌ది) కాగా మిగిలిన 7 జపాన్ నుంచి తీసుకొచ్చి ఏర్పాటు చేశారు.
ఒకటో నంబర్ టర్బైన్ సామర్థ్యం 110 మెగావాట్లు కాగా మిగిలినవి 100.8 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ ఎనిమిది యూనిట్లలో పూర్తిస్థాయిలో పని చేస్తే నిత్యం 800 మెగావాట్లు విద్యుదుత్పత్తి చేయొచ్చు. సాంకేతిక నిపుణులు జపాన్ నుంచి రావడం ఆలస్యం కావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు తెలిపారు. మరమ్మతుకు రెండు నెలలకుపైగా సమయం పట్టే అవకాశముంది.