calender_icon.png 12 January, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘తుంగతుర్తి’ కాంగ్రెస్‌లో చీలిక

16-09-2024 12:00:00 AM

  1.  ఎమ్మెల్యే సామేలుపై అసంతృప్తి జ్వాలలు
  2. వలసొచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని పాత కేడర్ ఆరోపణ
  3. ఎమ్మెల్యే తనయుల పెత్తనంపై అభ్యంతరం
  4. దామోదర్‌రెడ్డి వర్గీయుల పెదవి విరుపు

సూర్యాపేట, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. అంతర్గత విభేదాలతో పార్టీ కొట్టుమిట్టాడుతున్నది. విభేదాలు ముదిరి పార్టీ పతనమయ్యే పరిస్థితి వచ్చింది. అసెంబ్లీ ఎన్నిల సమయంలో పార్టీ అధిష్ఠానం మందుల సామేలుకు ఎమ్మెల్యే టికెట్  రావడం నాడు అంతటా చర్చనీయాంశమైంది.

అప్పటి వరకు బీఆర్‌ఎస్‌లో ఉండి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ వెంటనే టికెట్ సైతం ఇచ్చింది. ఎన్నికల్లో సామేలు 50 వేలపైచిలుకు ఓట్లతో గెలిచారు. ఇది దీర్ఘకాలికంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నేతలకు మింగుడు పడలేదు. ఎమ్మెల్యేతో పాటు ఆయన తనయులు కూడా పార్టీలో పెత్తనం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. 

దామోదర్‌రెడ్డికి మంచి పట్టు..

మాజీ మంత్రి, పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి నియోజకవర్గంపై మంచి పట్టు ఉన్నది. ఆయన ఈ నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన స్థానికుడు కావడం, కాంగ్రెస్ క్యాడర్‌ను కాపాడడంలో ఆయనది అందె వేసిన చేయి. కానీ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం మందుల సామేలుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కోమటిరెడ్డి సోదరులు టికెట్ వచ్చేలా చేశారనే ప్రచారం ఉంది. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు దామోదర్‌రెడ్డి కూడా ఎన్నికల సమయంలో సామేలుకు సహకరిం చా రని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. సామేల్ నుం చి ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా ఆ యన గెలుపు కోసం పనిచేశారంటున్నాయి.

పాత నాయకులంతా ఏకం..

కాంగ్రెస్‌లో తమకు పాధాన్యం లేదని, ఎమ్మెల్యే ఏ మాత్రం తమను  పట్టించుకోవడం లేదని భావించిన కొందరు నేతలు ఏకమవుతున్నారని సమాచారం. ముఖ్యంగా దామోదర్‌రెడ్డి వర్గీయులు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని సైతం ఆశ్రయించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే పోకడలతో సామాన్య కార్యకర్తలు సైతం ఇబ్బందులు పడుతున్నారని గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం.

వలసొచ్చిన వారికి ప్రాధాన్యం.. 

ఎమ్మెల్యే మందుల సామేలు తన వెంట వలస వచ్చినవాళ్లకే ప్రాధాన్యతనిస్తున్నారని పార్టీ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గాదరి కిషోర్‌కు  మద్దతుగా పని చేసిన కొందరు ఎన్నికల అనంతరం సామేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారంటున్నారు. వీరికే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారని పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని నేతలు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. మరోవైపు ఎమ్మెల్యేగా గెలువగానే సామేలు ఆయన ఇద్దరు కుమారులు పార్టీలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారని అసంతృప్త నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

దామోదర్‌రెడ్డి వర్గీయులను దూరం పెడుతున్నట్లు వారు చెప్తున్నారు. నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం మండలంలోని వంగమర్తి, తిరుమలగిరి మండలంలోని అనంతారం, నాగారం పేరబోయినగూడెం, శాలిగౌరారం మండలంలోని పలు గ్రామాల్లో ఇసుక పుష్కలంగా ఉంటుంది. అప్పటి ఎమ్మెల్యే కిషోర్ అడ్డోగోలుగా ఇసుక దందా నడిపిస్తూ అనేక మందిని ఇబ్బందులుకు గురిచేశారని, తనను మళ్లీ గెలిపిస్తే ఇసుక రవాణాను నిలిపివేసేలా చేస్తానన్న సామేలు, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అదే దందాలో దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దందాపై ఇప్పటికే అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం.