calender_icon.png 27 October, 2024 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు

12-08-2024 01:01:50 AM

వృథాగా పోతున్న లక్షల క్యూసెక్కుల నీళ్లు

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి)/అలంపూర్: భారీ వరదల కార ణంగా నిండికుండలా మారిన తుంగభద్ర ప్రాజెక్టులో ఓ క్రస్ట్ గేటు కొట్టుకు పోయింది. డ్యామ్‌లోని 19వ గేటు ఊడిపోయి కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. ఫలితంగా ప్రాజెక్టులోని నీరం తా వృథాగా పోతున్నది. కర్ణాటకలోని హోస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఊడిపోయింది.

ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో డ్యామ్ గేట్లు మూసివేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో 19వ గేటు చైన్ తెగింది. తర్వాత గేటు ఊడి ప్రవాహంలో పడిపోయింది. ఫలితంగా ప్రాజెక్టులోని నీరం తా దిగువకు వెళ్లిపోతున్నది. వెంటనే తేరుకున్న అధికారులు నీటిని వదిలేసి గేటును బిగించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం అన్ని గేట్లను ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి లక్షకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారు. దీంతో దిగువన ఉన్న ఏపీ, కర్ణాటక, తెలంగాణ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలు నది వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

60 శాతం ఖాళీ చేసిన తర్వాతే మరమ్మతులు

తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 105.79 టీఎంసీలు కాగా శనివారం సాయంత్రం 105.39 టీఎంసీలుగా ఉంది. అంటే దాదాపు ప్రాజెక్టు పూర్తి నీటి మట్టంతో ఉంది. ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో గేట్లు మూసేందుకు ప్రయత్నించగా గేటు ఊడిపోయింది. అయితే రిజర్వాయర్‌లోని 60 శాతం నీటిని ఖాళీ చేసిన తర్వాతే గేటు బిగించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. అంటే దాదాపుగా 63 టీఎంసీల నీటిని వదిలేసిన తర్వాతే గేటు బిగించనున్నారని సమాచారం. 

వీలైనంత త్వరగా గేటు బిగిస్తాం: డీకే శివకుమార్

తుంగభద్ర డ్యాం గేటు ధ్వంసం కావడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విస్మయం వ్యక్తం చేశారు. కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సాగు, తాగునీటిని అందించే ఈ ప్రాజెక్టు గేటు ఊడిపోవడం వల్ల రైతాంగానికి ఇబ్బందులు ఏర్పడకుండా వెంటనే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన ప్రాజెక్టును సందర్శించారు. 17వ గేటు నుంచి 32వ గేటు వరకు నిర్వహణ బాధ్యత కర్ణాటక ప్రభుత్వం చూస్తోందని తెలిపారు. నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలిస్తోందని, కేంద్ర జల సంఘం కూడా నిపుణులను పంపిందని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువనకు వదలాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. వీలైనంత త్వరగా గేటు పునరుద్ధరిస్తామని తెలిపారు. మరోవైపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ ఘటనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంగళవారం  ప్రాజెక్టును సందర్శిస్తామని ఆయన తెలిపారు. 

అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు

తుంగభద్ర ప్రాజెక్టు గేటు ఊడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో ఆరా తీశారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని ఆదేశించారు. ప్రాజెక్టు దిగువన ఉన్న ఏపీ పరిధిలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని, నది వైపునకు వారిని వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ వెంటనే అధికారులతో మాట్లాడి గేటు త్వరగా బిగిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.