18-03-2025 12:59:08 AM
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి) : ఈ వేసవిలోనే తుమ్మిడిహట్టి ప్రాజెక్టు పనులను మొదలుపెట్టబోతున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, తాను వచ్చే నెల మహారాష్ట్రకు వెళ్లి ఆ రాష్ట్ర సీఎంతో చర్చించను న్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఎత్తుపై నిర్ణయం తీసుకొని పనులను ప్రారంభిస్తామని చెప్పారు.
సోమవా రం శాసన మండలిలో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు, సన్నా ల బోనస్‌పై సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం, మధుసూదనాచారి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు డిజైన్‌ను మార్చే ఉద్దేశం తమకు లేదన్నారు. సన్నరకం ధాన్యం సేకరణకు రూ.1,199 కోట్లు బోనస్ చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 999కోట్లు చెల్లించామని, మిగతా మొత్తాన్ని వారంలో చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.
అలా గే, మేడిగడ్డ మాదిరిగా సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కూలిపోతాయని నిపుణులు చెప్పిన మాట నిజమేనా? అని కోదండరాం అడిగిన ప్రశ్నకు మంత్రి అది అవాస్తవమని సమాధానం చెప్పారు. తుమ్మడిహట్టి నిర్మించి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని సరఫరా చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.
రివైజ్డ్ డీపీఆర్ వల్లే ‘సీతారామ’ అంచనాలు పెంచాం
1.1లక్షల ఎన్‌ఎస్పీ ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు చేయట్లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల పనులు ఏ దశలో ఉన్నాయి? అంచనాలను పెంచారా? అని బీఆర్‌ఎస్ సభ్యుడు తాతా మధు, మరో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు.
ప్రాజెక్టు అంచనాలను రూ.13,057 కోట్ల నుంచి 19,456కోట్లకు పెంచిన మాట వాస్తవమే అన్నారు. సీతారామ పనులు ఇంకా పూర్తికాలేదన్నారు. ప్రాజెక్టు మెయిన్ కెనాల్ పొడవు 114 కిలోమీటర్లు కాగా.. అందులో 104 కిలోమీటర్ల కెనాల్, మూడు పంప్ హౌస్‌ల నిర్మాణం పూర్తయినట్లు చెప్పారు.