26-03-2025 10:45:49 PM
ఇప్పటికే పలుమార్లు వినతులు అందించిన మంత్రి తుమ్మల..
భవిష్యత్తులో జాతీయస్థాయి కార్యకలాపాలు..
విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సీఎం రేవంత్ హామీ..
సీఎం సానుకూల స్పందన పట్ల తుమ్మల హర్షం..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలోని మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాలను యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ గా అప్ గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో మంత్రి తుమ్మల కలిసి లేఖను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. సింగరేణి స్కూల్ ఆఫ్ మైన్స్ దేశంలోనే అత్యున్నత కళాశాల అని యూనివర్సిటీగా మారిస్తే అత్యంత ప్రయోజనం ఉంటుందన్నారు. దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలో కళాశాల ఉందని 800 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. మైనింగ్ కళాశాలను విశ్వవిద్యాలయంగా మారిస్తే వేలాదిమంది శాస్త్రవేత్తలను తయారు చేయవచ్చు అన్నారు.
నాగరికతతో పాటు పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడంలో సహజ వనరులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. విశ్వ విద్యాలయంగా రూపాంతరం చెందితే ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు రాష్ట్రానికి దేశానికి ఖ్యాతిని తెచ్చిపెడుతుందన్నారు. ఎర్త్ సైన్సెస్ కు చెందిన వివిధ కోర్సులను అమలు చేస్తే పలు అంశాలలో జాతీయస్థాయిలో కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉందన్నారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తు పర్యావరణహితం కోసం, శాస్త్రవేత్తలను తయారు చేయడం కోసం యూనివర్సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి తుమ్మలకు హామీ ఇచ్చారు. దీంతో మంత్రి తుమ్మల సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఉపాధి ఉద్యోగం...
మైనింగ్ కళాశాలను యూనివర్సిటీగా మారిస్తే వేలాదిమంది విద్యార్థులు శాస్త్రవేత్తలు గాను పలువురికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఎర్త్ సైన్సెస్ వర్సిటీతో జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్, ప్లానెట్రీ జియాలజీ, జియో మేరపాలజీ, స్ట్రక్చర్ జియాలజీ, ఖనిజ శాస్త్రం, పర్యావరణ భూగర్భ శాస్త్రం వంటి విభిన్న కోర్సులు అందుబాటులోకి వస్తాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రవేశాలు కల్పించే వీలు ఉంటుందని రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు చదువుతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. భవిష్యత్తులో జాతీయస్థాయిలో కార్యకలాపాలు విస్తరించే అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు అన్నారు.