హైదరాబాద్,(విజయక్రాంతి): తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బిఆర్ నాయుడు, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావుని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా హరీష్ రావు బీఆర్ నాయుడుకి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మీడియా రంగంలో సుదీర్ఘకాలంగా విశేష సేవలు అందించి, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేసే భాగ్యం పొందడం అదృష్టమని అభిప్రాయపడ్డారు.
టీటీడీ చైర్మన్గా నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలలో స్వామి దర్శనం కోసం వస్తున్నందున, తెలంగాణ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తెలంగాణ భక్తులకు దర్శనం, వసతి వంటి సేవలను మెరుగుపరచడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయన్నారు.
అలాగే సిద్దిపేటలో కూడా టీటీడీ దేవాలయం నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నందున, నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని హరీష్ రావు గారు కోరారు. హరీష్ రావు విజ్ఞప్తికి నాయుడు స్పందిస్తూ, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవడం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి, టీటీడీ బోర్డులో చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిద్దిపేటతో పాటు కరీంనగర్ లో నిర్మాణంలో ఉన్న టీటీడీ దేవాలయ పనులను పూర్తి చేసేందుకు బోర్డులో చర్చిస్తామని నాయుడు తెలిపారు.