ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
సీపీఎస్ విధానం రద్దు చేయాలి
-టీఎసీయూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి.
మంచిర్యాల, (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వైద్య శాంతికుమారి అన్నారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) 50వ అవతరణ దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలోని టీఎస్ యూటీఎఫ్ కార్యాలయ ప్రాంగణంలో పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి విద్యా రంగానికి మరింత నిధులు పెంచి అన్ని పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐదు డీఏలు వెంటనే ప్రకటించాలని, పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి 30 శాతం ఫిట్మెంట్లో పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండారపు చక్రపాణి, గుర్రాల రాజావేణు, రాష్ట్ర కమిటీ -సభ్యులు గొల్ల రామన్న, జిల్లా ఉపాధ్యక్షుడు నర్సయ్య, లావణ్య, జిల్లా కోశాధికారి కిరణ్, జిల్లా కార్యదర్శులు చంద్రమౌళి, కిరణ్ కుమార్, బాపు, దేవదాస్, తిరుపతి, సంపత్, చక్రవర్తి, తులసీపతి, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.