తెలుగులో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో నటిస్తున్న జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం ‘ఉలఝ్’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. దేశభక్తి కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. ‘నా జీవితమంతా నటనకే అంకితం. మొదటి సినిమా నుంచి ఇప్పటిదాకా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్తున్నా. ఇండస్ట్రీ నన్ను ఎలా చూస్తుందనే విషయాన్ని నేను చెప్పలేను. పాటలు, డ్యాన్సులు, గ్లామర్‌తో కూడిన కమర్షియల్ సినిమాలు చేస్తూ పోవటమనేది నా కెరీర్‌లో చాలా సులభమైన ప్రయాణం అవుతుంది.
ఆ మార్గంలో విజయావకాశాలూ ఎక్కువే.. తక్కువ సమయంలోనే ప్రజాదరణ సొంతమవుతుంది కూడా. కానీ, నాకు సవాళ్లతో కూడిన పాత్రలు ఎంచుకోవటమే ఇష్టం. అందులో నా నటన చూసి అందరూ ఆశ్చర్యపోవాలని అనుకుంటా. ఈ నిర్ణయం కొన్ని ఏళ్ల క్రితమే తీసుకున్నా. అందులో భాగంగానే చిన్న సినిమాలను ఎంపిక చేసుకున్నా. ప్రతి సినిమాలో దర్శకుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడో దాన్ని ఇవ్వడానికి నూటికి నూరు శాతం ప్రయత్నిస్తా. హైరిస్క్ ఉన్న సినిమాలు ఇప్పటివరకు రెండు చేశాను. అందులో ‘ఉలఝ్’ చిత్రం ఒకటి. అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నా” అని తెలిపింది. సవాళ్లతో కూడిన పాత్రలకు ప్రాధాన్యమిస్తానని చెప్తున్న ఈ గ్లామరస్ హీరోయిన్ తాజా మాటలు తనతో కలిసి పనిచేయాలని ఆశ పడే మేకర్స్‌కూ ఓ సవాలే మరి!