calender_icon.png 30 October, 2024 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్యమే సమున్నతం

02-08-2024 12:00:00 AM

వీయస్‌ఆర్ మూర్తి :

బాల్యావస్థను దాటి కౌమారంలోకి ప్రవేశించిన నచికేతసుడు ఒక ప్రక్క, సంయమీంద్రుడు, ధర్మచక్రవర్తి, మరణ రహస్యాన్ని యెరిగిన ప్రశాంత, ప్రసన్న గంభీరమూర్తి యమధర్మరాజు మరొక వంక, మాట్లాడుకుంటున్న అద్భుత సందర్భం..

సాధకుడు -బోధకుడు, అన్వేషి -ఆచార్య సత్తముడు, అర్థి -వరదాత కలుసుకుంటే ఏం జరుగుతుందో, జరగాలో తెలియచెప్పే కఠోపనిషత్ ఆరంభమే ఒక రసమయ కవితామృత ధార. అందుకే, శంకర భగవత్పాదులు ఈ ఉపనిషత్తుకు భాష్యం రాయాలని సంకల్పించుకున్నప్పుడు ముందుగా మృత్యుదేవతకు, ఆపైన నచికేతసుడికి ప్రణమిల్లుతారు.

అధ్యాత్మ శాస్త్రాన్ని ఔపోశనం చేసిన మహనీయమూర్తుల కలయిక బ్రహ్మవిద్యా రహస్యాన్ని అంటే జనన మరణ మూలాలను, జీవాత్మ పరమాత్మ సంగతులను, దయామయంగా విశ్లేషించే భాగ్యసీమను పరిచయం చేస్తుంది. ఆ సౌభాగ్యసీమ కఠోపనిషత్. సాధనకు, శోధనకు, బోధకు, అన్వేషణకు, రహస్యాన్ని బేధించటానికి రాజమార్గాన్ని తెరిచి, పరచే కఠోపనిషత్, మతమౌఢ్యాన్ని, వదిల్చి, మనిషి పూర్ణమానవుడిగా జీవించగల అధ్యాత్మ బోధను అధివాస్తవికంగా ఆవిష్కరిస్తుంది. సంకుచితత్వం నుండీ విశాల భావనా భూమిక వైపు నడిపిస్తుంది. చావు పుట్టుకల గుట్టును రట్టు చేసే రమణీయ బోధ ఇది.

సాధారణ ప్రవచనాలు భావావేశాన్ని రగిలించి స్వర్గసుఖాల గురించి, పరలోక ప్రభావాలను ప్రస్తావిస్తే ఈ ఉపనిషత్ ఉత్తమ మానవ జీవితాన్ని గడుపుతూ ఇక్కడ ఉండగానే జీవన్ముక్త స్థాయిని అందుకోవటం సాధ్యమేనని నిరూపణ చేస్తుంది.

ఏ అధ్యాత్మ సాధనకైనా శీలమే ఆధారం. ముందుగా తనపై తనకు ఆత్మవిశ్వాసం, ఆపై ఆత్మశక్తి ఉండాలి. ఈ రెండింటినీ సమన్వయం చేసుకున్నప్పుడు అది ఆత్మప్రజ్ఞగా మారుతుంది. అదొక అజేయ శక్తి, అనంత ఆనంద ప్రవాహం.

ఏ విద్యను అభ్యసించాలన్నా శ్రద్ధ అవసరం. అందులో విశ్వాసం, భౌతిక బలం, పట్టుదల, నిరంతర కృషి, అలుపెరగని ప్రయాణం, నైపుణ్యం వంటివి ఎన్నో ఇమిడి ఉన్నయ్. దీనికి ఆత్మశక్తి జత గూడితే అన్వేషణ సుసాధ్యం. నిర్వేదం, నిరాశ, అలసత్వం, అవిశ్వాసం, అనైతికత వంటి వ్యతిరిక్త విషయాలు మనిషిని మహనీయత వైపు నడిపించలేవు. కేవలం లౌకిక భౌతిక విషయాలు శాశ్వతమని నమ్మి ఆ మార్గంలో సాగించే ప్రయాణం ఒక నిరర్థక ప్రయాస.

ఈ నేపధ్యంలోనే నచికేతసుడు తన తండ్రి చేస్తున్న యాగ ప్రక్రియను, దాన విధానాన్ని గమనించి తండ్రితో సూటిగా 

“తండ్రీ! ఈ పాలివ్వని, శక్తిహీనమైన ఆవుల్ని ఎందుకు దానం చేస్తున్నావు? ఇది అనైతికం, అధర్మం కాదా?” అంటూ విడవకుండా ప్రశ్నిస్తూనే 

“నన్నెవరికి దానం చేస్తావు?” అని అడిగినప్పుడు, పరధ్యానంలో, అప్పటికే విసుగెత్తి ఉన్న తండ్రి, “మృత్యువుకు” అన్నాడు.

నచికేతసుడికి కావలసింది ఇదే. అమరము, అచ్యుతము, అప్రమేయము, అనంతము, అపరిణామము, నిత్యసత్య శాశ్వతమైన ఆత్మవిద్యా రహస్యం తెలియని కారణంగా, అజ్ఞానానికి లోనైన తన తండ్రి దానవ్రతం సాగిస్తున్నాడని, తండ్రికి సత్యపథాన్ని నిర్దేశించాలని అనుకున్నాడు నచికేతసుడు. తండ్రిపట్ల గల ప్రేమే ఆతనికి ఈ ప్రేరణను కలిగించింది. ఈ ధైర్యం, నిర్భయం తనలోని శ్రద్ధనుండి తనకు లభించినవే. 

ఇంతలోనే తండ్రికి పశ్చాత్తాపం కలిగింది. తన తొందరపాటు తనానికి దుఃఖం కలిగింది. ఏ తండ్రీ అనకూడని, అనరాని, అనలేని మాట అతణ్ణి యాతనకు గురి చేసింది. తాను అన్న మాటను ఉపసంహరించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, శ్రద్ధాళువు, సత్యవాది, సత్యార్థి, సత్యాన్వేషి అయిన నచికేతసుడు దానిని అంగీకరించక, వెనుకంజ వేయక, “మృత్యువు ఎదురైనా వెనక్కి వెళ్లవద్దు. సత్యం మృత్యువు కంటే ఉన్నతమైంది. అది చావు లేనిది. గతంలోంచి స్ఫూర్తిని పొందాలి. సత్యం ఆచరణాత్మకం కావాలి. సత్యం సమాజాన్ని నడిపించాలి. సమాజం సత్యాన్ని గౌరవించి దానిని ఆచరించాలి, ఆదరించాలి” అన్నాడు. నచికేతసుడు యమలోకానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అది తిరుగులేని నిర్ణయం.