calender_icon.png 9 October, 2024 | 10:03 AM

సత్యమే గెలిచింది

09-10-2024 01:15:27 AM

హర్యానా, కశ్మీర్ ప్రజలకు సెల్యూట్

హర్యానాలో హ్యాట్రిక్ ఒక చరిత్ర

కార్యకర్తల కష్టానికి ఇది ప్రతిఫలం

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: పవిత్రమైన భగవద్గీత పుట్టిన హర్యానాలో సత్యమే గెలిచిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. హర్యానా ఎన్నికల్లో ఓటర్లు అభివృద్ధి, సుపరిపాలనకు పట్టంగట్టారని పేర్కొన్నారు. మరింత బాధ్యతతో పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.

హర్యానా, జమ్ముకశ్మీర్ ఎ న్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దుశించి మంగళవారం ప్ర ధాని మాట్లాడారు. హర్యానాలో వరుసగా మూడుసార్లు గెలిచిన పార్టీ ఏదీ లేదని, తొలిసారి బీజేపీ చరిత్ర సృష్టించిందని తెలిపారు. జమ్ముకశ్మీర్‌లోనూ బీజేపీ మంచి ఫలితాలు సాధించిందని చెప్పారు.

పార్టీ గెలుపు కోసం కృషిచేసిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. ‘హర్యానా రాష్ట్రం 1966లో ఏర్పడింది. ఇప్పటివరకు 13 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందలో పది సార్లు ప్రజలు ప్రభుత్వాలను మార్చారు. మొదటిసారి ఒక పార్టీని వరుసగా మూడుసార్లు గెలిపించారు. హర్యానా ప్రజలు మమ్మల్ని గెలిపించటం మాత్రమే కాదు.. గతంలో కంటే ఎక్కువ సీట్లు, ఓట్లు ఇచ్చారు’ అని మోదీ తెలిపారు. 

మిత్రులనే మింగుతున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ తనతో జట్టుకట్టిన పార్టీలన్నింటికీ ఒటమే మిగులుస్తున్నదని ప్రధాని విమర్శించారు. ‘జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ వల్లనే ఓడిపోయే పరిస్థితి వచ్చిందని దాని మిత్రపక్షం గగ్గోలు పెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లోనూ అంతే. మిత్రపక్షాల వల్లనే ఆ పార్టీ (కాంగ్రెస్) ఎక్కువ సీట్లు గెలిచింది.

కొన్ని రాష్ట్రాల్లో దాని మిత్రపక్షాలన్నీ దెబ్బతిన్నాయి. సొంత మిత్రులనే ఆ పార్టీ మింగేస్తున్నది.. ధ్వంసం చేస్తున్నది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, అర్బన్ నక్సల్స్ కలిసి కోర్టుల్లో పదేపదే కేసులు వేసి వ్యవస్థలను అస్తవ్యస్తం చేశారు.

భారతీయులు ఎంతో గర్వంగా భావించే ప్రతి వ్యవస్థను నాశనం చేశారు’ అని మోదీ విమర్శించారు. జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుచేయబోతున్న ఎన్సీ కాంగ్రెస్ కూటమికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు హర్యానా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మోదీ ట్వీట్ చేశారు.