calender_icon.png 10 January, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని..పోలీసులు దొంగలయ్యారు!

10-01-2025 01:17:35 AM

అసోం, జనవరి 9: ప్రస్తుతం ప్రజలు ఏదైనా తెలియని ప్రాంతానికి వెళ్లాలంటే గూగుల్ మ్యాప్‌నే నమ్ముకుంటున్నారు. గూగుల్ మ్యాప్ ఎన్ని అవస్థలు తెస్తుందో సోషల్ మీడియాలో ఎన్నో ఫన్నీ మీమ్స్ కూడా వస్తుంటాయి. తాజాగా పోలీసులకూ గూగుల్ మ్యాప్ హ్యాండివ్వడంతో తీవ్ర పరాభవం చెందారు.

పోలీసులను దొంగలుగా భావించి చితకబాదిన ప్రజలు రాత్రంతా బందీలుగా ఉంచుకున్నారు. ఈ ఘటన అసోం రాష్ట్రంలో ఇటీవల జరిగింది. జోరాత్ జిల్లాకు చెందిన 16 మంది పోలీసుల బృందం ఓ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు బయలుదేరింది. అతడి చిరునామాకు వెళ్లేందుకు పోలీసులు గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్నారు.

అయితే దాన్ని గుడ్డిగా ఫాలో అవుకుంటూ వెళ్లిన పోలీసులకు ఆ మ్యాప్ అసోంలోని ఓ తేయాకు తోటను చూపించింది. కానీ అది నాగాలాండ్‌లోని మోకోక్‌చుంగ్ జిల్లాలోని ప్రాంతం. అక్కడికి వెళ్లిన పోలీసులు నిందితుడి కోసం ఆ ప్రాంతం లోపలికి వెళ్లారు. పోలీసుల దగ్గర ఉన్న అధునాతన ఆయుధాలను చూసి అక్కడి ప్రజలు వారిని దుండగులుగా పొరబడ్డారు.

వెంటనే చుట్టుముట్టి చితకబాదారు. ఆపై వారిని బంధించారు. ఈ దాడిలో ఒక పోలీస్‌కు గాయాలయ్యాయి. తమ బృందం పరిస్థితి తెలుసుకున్న జోరాత్ పోలీసులు వెంటనే మోకోక్‌చంగ్ ఎస్పీతో మాట్లాడారు. దీంతో ఆయన గ్రామస్తుల చేతుల్లో బందీలుగా ఉన్న పోలీసులను విడిపించేందుకు మరో బృందాన్ని పంపించారు.

గ్రామస్తులకు అసలు విషయం చెప్పగా పోలీసులను క్షమాపణ కోరారు. గాయపడిన పోలీస్ సహ ఐదుగురిని విడిచిపెట్టారు. మిగిలిన 11 మందిని రాత్రంతా బందీలుగా ఉంచుకుని ఉదయం విడిచిపెట్టారు.