calender_icon.png 22 April, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ మొండితనం!

17-04-2025 12:00:00 AM

మొన్న కొలంబియా యూనివర్సిటీకి ఫెడరల్ నిధులను నిలిపివేసిన ట్రంప్, ఇప్పుడు ఆ జాబితాలో ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీని చేర్చారు. తన ఆదేశాలు ధిక్కరించిందనే అక్కసుతో ఒకే ఒక్క కలం పోటుతో 2.3 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులు, 60 మిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను స్తంభింపజేశారు. అమెరికాకంటే హార్వర్డ్ యూనివర్సిటీ చరిత్రే పాతది.

గ్రేట్ బ్రిటన్ నుంచి విముక్తి పొంది, అగ్రరాజ్యం స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి 140 ఏళ్లకు ముందే హార్వర్డ్ యూనివర్సిటీకి పునాదులు పడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100 దేశాల జీడీపీ కంటే ఈ యూనివర్సిటీ నిధులు ఎక్కువ. అలాగే, ఎనిమిది మంది ప్రెసిడెంట్‌లను ఈ యూనివర్సిటీ అమెరికాకు ఇచ్చింది. అధ్యక్షులుగా అమెరికాకు సేవ చేసిన జాన్ ఆడమ్స్, జాన్ క్విన్సీ ఆడమ్స్, రూథర్ ఫర్డ్ బి. హేస్, జాన్ ఎఫ్. కెన్నెడీ, ఫ్రాంక్లిన్ డెలానో రూజ్‌వెల్ట్, థియోడర్ రూజ్‌వెల్ట్, జార్జ్ డబ్ల్యూ. బుష్, బరాక్ ఒబామా హార్వర్డ్‌లో చదివినవారే.

యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌లో భారీ ఎత్తున మార్పులు సూచిస్తూ ట్రంప్ యంత్రాంగం ఏప్రిల్ 11న లేఖ రాసింది. యూదు వ్యతిరేకతను నిరోధించాలని, నియామక పద్ధతులు, ప్రవేశ విధానాల్లో మార్పులు చేయాలని, ఫేస్ మాస్కులను నిషేధించాలని ఆ లేఖద్వారా యూనివర్సిటీని కోరింది. అలాగే, కొన్ని విద్యార్థి క్లబ్‌ల గుర్తింపును రద్దు చేయడంతోపాటు యూదు వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల వివరాలను అందించాలని డిమాండ్ చేసింది.

లేదంటే యూనివర్సిటీకి అందే నిధులను నిలిపి వేస్తామని హెచ్చరింది. ఈ హెచ్చరికను యూనివర్సిటీ గడ్డిపోచలా తీసి పారే సింది. ‘యూనివర్సిటీ తన స్వతంత్రాన్ని, రాజ్యాంగ హక్కులను వదులుకోదు. ఎవరిని నియమించాలి, ఎవరికి ప్రవేశం కల్పించాలి, ఏయే రంగాల ను అధ్యయనం కోసం ఎంచుకోవాలి అనే విషయాలను ఏ ప్రభుత్వమూ నిర్దేశించకూడదు’ అని కుండబద్దలు కొట్టింది.

ఇది ట్రంప్‌నకు నచ్చలేదు. అందుకే, యూనివర్సిటీకి అందాల్సిన నిధులను ఫ్రీజ్ చేశారు. కొలంబియా యూనివర్సి టీ విషయంలోనూ ఇదే జరిగింది. గాజా ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అమెరికా మద్దతు తెలుపుతున్నది. అమెరికా అభీష్టానికి వ్యతిరేకంగా యూనిర్సిటీల్లో నిరసనలు జరి గాయి. పాలస్తీనకు మద్దతుగా విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఇదే అమెరికా అధ్యక్షుడికి పట్టరాని కోపం తెప్పించింది.

ఇలా యూదు వివక్షతను అరికట్టడంతో విధివిధానాల్లో పలు సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు ట్రంప్ ప్రభుత్వం లేఖలు రాసింది. అయితే, యూదు వివక్షను అరికట్టాలనే సాకుతో యూనివర్సిటీలపై అజమాయిషీ చెలాయించేందుకు ట్రంప్ కుట్ర పన్నుతున్నారనే వాదన బలంగా వినిపిస్తున్నది.

ఒకవైపు మాట వినని ఇతర యూనివర్సిటీలకూ నిధులు నిలిపేందుకు ట్రంప్ సిద్ధమవుతుండగా మరోవైపు స్టాన్ ఫర్డ్, కార్నెల్ వంటి కొన్ని యూనివర్సిటీలు హార్వర్డ్‌కు మద్దతు ఇస్తున్నా యి. మాజీ అధ్యక్షుడు ఒబామా కూడా హార్వర్డ్‌కు మద్దతు తెలిపారు.

కొద్ది రోజుల క్రితం ట్రంప్ డిమాండ్లకు తలొగ్గిన కొలంబియా వర్సిటీ ఇప్పుడు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నది. యూనివర్సిటీల్లో పరిశోధనలకు ఫెడరల్ నిధులు అత్యావశ్యకం. సొంత దేశంలో పెరుగుతున్న వ్యతిరేకతతో ట్రంప్ వెనక్కి తగ్గుతారో లేక మొండితనంతో ముందుకే వెళ్తారో చూడాలి.