calender_icon.png 19 November, 2024 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ రికార్డు

07-11-2024 12:00:00 AM

ప్రపంచం యావత్తు ఆసక్తిగా ఎదురు చూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు.శ్వేత సౌధంలో అడుగుపెట్టడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ (270)ని దాటి 277 ఎలక్టోరల్ ఓట్లతో జయకేతనం ఎగురవేశారు. చివరి వార్తలందే సమయానికి ఆయన ఇంకా మూడు రాష్ట్రాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. దీంతో ఆయనకు మరో 30కి పైగా ఎలక్టోరల్ ఓట్లు లభించే అవకాశం ఉంది.

అధికారం చేజిక్కించుకోవడానికి కీలకమైన మొత్తం ఏడు ‘స్వింగ్ స్టేట్స్’ను ఊహించని విధంగా సొంతం చేసుకున్నారు. ప్రధాన ప్రత్యర్థి, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కేవలం 224 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో  అగ్రరాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యే అవకాశాన్ని చేజార్చుకున్నారు. గతంలో హిల్లరీ క్లింటన్  ట్రంప్‌కన్నా దాదాపు 30 లక్షలు ఎక్కువ పాపులర్ ఓట్లు దక్కించుకున్నా మెజారిటీ ఎలక్టోరల్ ఓట్లు దక్కించుకున్న ట్రంప్ తొలిసారి అధ్యక్షడిగా ఎన్నికయ్యారు.

అంతేకాదు, మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వరసగా రెండుసార్లు విజయం సాధించడం కొత్తేమీ కాదు కానీ ఒకసారి ఓటమిపొంది నాలుగేళ్ల విరామం తర్వాత మరోసారి అధ్యక్ష స్థానంపై కూర్చోవడం 131 ఏళ్ల తర్వాత ఇదే మొదటి సారి. అమెరికాలోని పత్రికలన్నీ వ్యతిరేకమని చెప్పినా ప్రజలు మాత్రంట్రంప్‌కే పట్టంగ ట్టారు. ఎన్నికలకు ముందు కోర్టు కేసులు ఇబ్బంది పెట్టినా ఏమాత్రం వెనకాడకుండా చివరివరకు పోరాటం సాగించి విజయం సాధించారు.

అంతేకా దు, సెనేట్‌తో పాటుగా ప్రతినిధుల సభలోనూ రిపబ్లికన్ పార్టీ మెజారిటీ సాధించడంతో కీలక బిల్లుల విషయంలో ట్రంప్‌కు రాబోయే నాలుగేళ్లు ఎలాంటి అడ్డంకీ ఎదురు కాదు.ఈ సారి అమెరికా ఎన్నికల్లో ముఖ్యంగా ద్రవ్యోల్బణం, ఉద్యోగాలు, వేతనాలు, అక్రమ చొరబాట్లువంటి అంశాలు తిరుగులేని విధంగా ప్రభావం చూపించాయి. ఇక ట్రంప్ ప్రచార సరళి సైతం ఆయన విజయంలో కీలకపాత్ర పోషించిందని చెప్పాలి.‘మేక్ ఎగైన్ అమెరికా గ్రేట్’ నినాదం ఓటర్లను బాగా ఆకర్షించింది.

అలాగే పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార సభలో తనపై కాల్పులు జరిగినప్పుడు రక్తమోడుతున్నా ‘ఫైట్..ఫైట్’ అంటూ ట్రంప్ చేసిన నినాదం యావత్తు అమెరికాను నివ్వెరపరిచింది. ఆయన చూపిన ధైర్యానికి ఫిదా అయింది. అంతేకాదు అక్రమ వలస లు, అబార్షన్లు లాంటి వివాదాస్పద అంశాలపైనా ట్రంప్ తన ఉద్దేశాలను, విధానాలను విస్పష్టంగా ప్రకటించారు. ఈ తెగువ కమలా హారిస్ ప్రచారంలో కనిపించలేదు. ఇజ్రాయెల్  పాలస్తీనా యుద్ధం విషయంలో  బైడెన్ స్రభుత్వం అనుసరించిన వైఖరి అమెరికా అరబ్‌లకు ఆగ్రహం తెప్పించింది.

అది కూడా ఆమె ఓటమికి ముఖ్య కారణమని చెప్పవచ్చు. అలాగే ఆర్థిక విధానాల విషయంలోనూ కమల దేశ ప్రజలను సంతృప్తిపరచలేక పోయా రు. అన్నిటికన్నా మించి బైడెన్ అధ్యక్ష బరిలోంచి ఆలస్యంగా తప్పుకోవడం, ప్రచార వ్యూహాన్ని రూపొందించుకోవడానికి తగిన సమయం లేకపోవడం, అప్పటికే ట్రంప్ ప్రచారంలో దూసుకువెళ్లడం కూడా ఆమె ఓటమికి ప్రధాన కారణం.ఇక ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు సత్తా చాటారు. ప్రతినిధుల సభకు ఆరుగురు ఎన్నికయ్యారు. గతంతో ఆ సంఖ్య అయిదుగా ఉండేది. 

మరోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడం భారత్‌కు అనుకూలించే అంశం అవుతుందని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే చైనా దిగుమతులపై భారీ ఎత్తున సుంకాలు విధిస్తానని ప్రచార సమయంలోనే ట్రంప్ చెప్పిన నేపథ్యంలో భారత్‌నుంచి అమెరికాకు ఎగుమతులు పెరుగుతాయని, ఇది దేశీయ తయారీ రంగానికి ఊతమిస్తుందని భావిస్తున్నారు.

కానీ అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయినా దేశ ప్రయోజనాలే ముఖ్యంగా పని చేస్తారనేది జగమెరిగిన సత్యం. అయితే ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్‌కున్న స్నేహబంధం కారణంగా భారత్‌కు మేలే ఉంటుందని మెజారిటీ అభిప్రాయం.