calender_icon.png 21 January, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ పట్టాభిషేకం

21-01-2025 02:08:00 AM

అమెరికా ఫస్ట్..

అధ్యక్షుడిగా రెండోసారి..

వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్‌లో ప్రమాణస్వీకారం వివిధ దేశాల నేతలు, విదేశాంగ మంత్రి జైశంకర్, టెకీ సంస్థల సీఈవోలు హాజరు

నా ప్రియమిత్రుడు ట్రంప్‌కు శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

  1. ధరలు తగ్గిస్తామని ట్రంప్ హామీ
    1. సుంకాల పెంపు ఉంటుందని హెచ్చరిక

* అమెరికాలో స్వర్ణయుగం ఇప్పుడే మొదలైంది. ఈరోజు నుంచి మనదేశం పరిఢవిల్లుతుంది. ప్రపంచమంతా మరోసారి అమెరికాను గౌరవిస్తుంది. ట్రంప్ ప్రభుత్వానికి అమెరికా ఫస్ట్.. 250 ఏళ్ల అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడికి ఎదురుకాని సవాళ్లు నాకు ఎదురయ్యాయి. కొద్దినెలల క్రితం  నాపై హత్యాయత్నం జరిగింది. అమెరికాను సమున్నత స్థానా నికి తీసుకెళ్లేందుకు, అప్పుడు నన్ను దేవుడు కాపాడాడు. 

 డోనాల్డ్ ట్రంప్

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేసి పదవీబాధ్యతలు స్వీకరించారు. ఆయన చేత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారం చేయించారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్ రోటుండాలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి అతిరథమహారథులు హాజరయ్యారు.

అంతకుముందు ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా సరిహద్దు నుంచి ఎంతో మంది అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్నారని, ఆ సరిహద్దులో నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించారు.

అమెరికాలో ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుతామని.. దేశంలో అత్యధికంగా ఉన్న చమురు, గ్యాస్ నిల్వల్ని ఉపయో గించుకుంటామని, అమెరికాను మళ్లీ టాప్‌లో నిలుపుతాం అని ప్రకటించారు. నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీని కూడా ప్రకటించారు. సుంకాలను తగ్గించి వేరే దేశాలను సంపన్నులను చేసే బదులు.. వివిధ దేశాలపై అధిక పన్నులు విధించి అమెరికా పౌరులను సంపన్నులను చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు.

 ట్రంప్ అనే నేను..

  1. 2025 అమెరికాకు స్వేచ్ఛాయుత సంవత్సరం 
  2. వచ్చీ రావడంతోనే సరిహద్దులో ఎమర్జెన్సీ 
  3. ధరలు తగ్గిస్తామని హామీ
  4. సుంకాల పెంపు ఉంటుందని హెచ్చరిక 
  5. అమెరికాను గ్రేట్ చేయడమే ధ్యేయం

డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసి పదవీబాధ్యతలు స్వీకరించారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్ రోటుండాలో  ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి అతిరథమహరథులు హాజరయ్యారు. ఆయన చేత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారం చేయించారు.

అంతకు ముందు ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ చేత కూడా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయగానే.. ఫిరంగులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. ఆర్కెస్ట్రా బృందం తమ పాటలతో అలరించింది. 

అందరికీ ధన్యవాదాలు తెలిపిన అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ‘అమెరికాలో స్వర్ణయుగం మొదలైంది. ఈ రోజు నుంచి మన దేశం ప్రపంచంలో ఓ వెలుగు వెలుగుతుంది. 2025 అమెరికాకు స్వేచ్ఛాయుత సంవత్సరం. అంతా మన దేశాన్ని గౌరవిస్తారు. అమెరికాను మొదటి వరుసలో నిలిపేందుకు ప్రయత్నిస్తా. అమెరికాను మరలా గ్రేట్‌గా చేయడమే ట్రంప్ ముందున్న లక్ష్యం.

ఎన్నో సవాళ్లు మన ముందున్నాయి. ఆ సవాళ్లను అధిగమించేందుకు కృషి చేస్తా. ఎంతో మంది నేరగాళ్లు బ్రెజిల్ వంటి దేశాల నుంచి అక్రమంగా సరిహద్దులు దాటి వస్తున్నారు. ఇక నుంచి అలా అక్రమంగా ఎవరూ సరిహద్దులు దాటి రాకుండా సెక్యూరిటీని పెంచుతా. ఎవరూ అలా రాకుండా చర్యలు తీసుకుంటా. చాలా మంది ఏళ్లుగా సొంత ఇండ్లు లేవు. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా.. కానీ ఇది నిజం.

ప్రకృతి విపత్తులు అమెరికాను అతలాకుతలం చేశాయి. దుర్మార్గపు, అన్యాయపు, అసంబద్ధ విధానాలు మా ప్రభుత్వంలో ఉండవు. ఎలక్ట్రిక్ వాహ నాల ఉత్పత్తిని పెంపొందిస్తాం. ప్రజలు తమకు నచ్చిన వాహనాలకు కొనుగోలు చేసుకునే సౌల భ్యం కల్పిస్తాం. మా మొదటి ప్రాధాన్యత అమెరికాలో అందరూ గర్వపడేలా చేయడం. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చిన్న విపత్తును కూడా సమర్థంగా మేనేజ్ చేయలేకపోతుంది.

ఈ ప్రభుత్వం మన అమెరికన్ పౌరులను రక్షించడంలో విఫలం అయింది. కానీ క్రూరమైన నేరగాళ్లకు మాత్రం రక్షణ కల్పిస్తోంది. ఇతర దేశాల జైళ్ల నుంచి మన దేశంలోకి అనేక మంది అక్రమంగా ప్రవేశిస్తున్నారు. అటువంటి వారికి మాత్రం ఈ ప్రభుత్వం రక్షణను కల్పిస్తుంది.  ఈ ప్రభుత్వం విదేశీ సరిహద్దుల కోసం ఎంతో వెచ్చించి.. సొంత అమెరికన్ల రక్షణకు మాత్రం నిధులు కేటాయించలేకపోయింది’ అని విమర్శించారు.   

చరిత్రలో ఏ అధ్యక్షుడికీ ఈ పరిస్థితి రాలే..

‘అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడికి ఎదురుకాని పరిస్థితి గత 8 సంవత్సరాలుగా నాకు ఎదురైంది. నా స్వేచ్ఛను హరించేందుకు చాలా మంది ప్రయత్నించారు. ఒకానొక సమయంలో నా ప్రాణాలు తీసేందుకు కూడా ప్రయత్నించారు. కొద్ది రోజుల క్రితం నా మీద తుపాకీతో జరిగిన హత్యాయత్నాన్ని అంతా చూశారు. నా ప్రాణాన్ని భగవంతుడు ఒక కార్యం నిర్వర్తించేందుకు రక్షించాడు. అమెరికాను మళ్లీ గ్రేట్‌గా మార్చడమే నా విధి. 

సరిహద్దులో నేషనల్ ఎమర్జెన్సీ

కొత్త అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ అమెరికా సరిహద్దుల్లో నేషనల్ ఎమర్జెన్సీని విధించారు. అధ్యక్షుడిగా తన తొలి స్పీచ్‌లోనే ఈ నిర్ణయం ప్రకటించారు. అమెరికా సరిహద్దు నుంచి ఎంతో మంది అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్నారన్న ట్రంప్.. ఆ సరిహద్దులో నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించారు.

కేవలం సరిహద్దులను మూసివేయడం మాత్రమే కాకుండా దేశంలోకి అక్రమంగా చొరబడిన వారిని వారి ప్రాంతాలకు పంపించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని ట్రంప్ తెలిపారు. అంతే కాకుండా 1798 నాటి ఏలియన్ ఎనిమీస్ యాక్ట్‌ను కూడా మరలా అమలు చేస్తాం అని, ఈ యాక్ట్ ద్వారా టెర్రరిస్టులు, నేరస్తులకు అడ్డుకట్ట వేస్తామని ట్రంప్ పేర్కొన్నారు.  

డ్రిల్ బేబీ డ్రిల్.. 

ద్రవ్యోల్బణం గురించి ప్రస్తావించిన ట్రంప్... ‘ద్రవ్యోల్బణం అనేది ఇంధన ఖర్చులను విపరీతంగా పెంచింది. మేము నిరంతరాయంగా చమురు బావులను తవ్వుతాం. డ్రిల్ బేబీ డ్రిల్. ధరలను తగ్గిస్తాం. దేశంలో ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుతాం. దేశంలో అత్యధికంగా ఉన్న చమురు, గ్యాస్ నిల్వల్ని ఉపయోగించుకుంటాం.

అమెరికాను మరలా టాప్‌లో నిలుపుతాం’ అని ప్రకటించారు. అంతే కాకుండా నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీని కూడా ప్రకటించారు. ‘ఈ ఆదేశాలను వెంటనే అమలు చేసేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకం చేస్తాను. అమెరికాను పూర్తిగా పునరుద్ధరించేందుకు చర్యలను మొదలుపెడుతున్నాం. 

ఇక పన్నుల మోతే.. 

సుంకాలను తగ్గించి వేరే దేశాలను సంపన్నులను చేసే బదులు.. వివిధ దేశాలపై అధిక పన్నులు విధించి అమెరికా పౌరులను సంపన్నులను చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికన్ కార్మికులు వారి కుటుంబాలను రక్షిస్తామని వెల్లడించారు. ఈ రోజు నుంచి అమెరికాలో ఆడ, మగ అనే రెండే జెండర్స్ ఉంటాయి.

కరోనా వ్యాక్సిన్ వేసుకోనందుకు ఆర్మీ నుంచి బహిష్కరణకు గురైన వారి మరలా విధుల్లో చేరేలా ఉత్తర్వులు జారీ చేస్తానని తెలిపారు. అమెరికాను మరోమారు ధనిక దేశంగా మార్చుతా. దేశంలో ఉత్పత్తిని పెంచుతా అని ట్రంప్ పేర్కొన్నారు. 

నా ప్రియ మిత్రుడికి శుభాకాంక్షలు: ప్రధాని నరేంద్రమోదీ

అతిరథ మహారథుల మధ్య అత్యంత అట్టహాసంగా అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ‘కంగ్రాట్స్ మై డియర్ ఫ్రెండ్’ అంటూ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల ప్రయోజనం చేకూరడానికి , ప్రపంచానికి మంచి భవిష్యత్తును రూపొందించేందుకు మరోసారి కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు.