శ్వేతసౌధ విజేతగా కొత్త చరిత్ర
- అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ట్రంప్
- సర్వేలను తలకిందులు చేస్తూ అనూహ్య విజయం
- స్వింగ్ రాష్ట్రాల్లోనూ ట్రంపే కింగ్
- 5 రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్
- జనవరి 20న ప్రమాణం
* అమెరికాకు స్వర్ణయుగం రాబోతున్నది
డొనాల్డ్ ట్రంప్
అనూహ్యం.. ముక్కున వేలేసుకున్నవారు కొందరు.. మురిపెంగా నవ్వినవారు కొందరు.. డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. నువ్వా.. నేనా అన్నట్లు సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ అద్భుత విజయం సాధించారు. పోల్ సర్వేలను తలకిందులు చేస్తూ ఊహించని విధంగా ఎన్నికల్లో ఆధిక్యం సాధించి రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు.
మొత్తం ౫౩౮ ఎలక్టోరల్ ఓట్లలో.. విస్కాన్సిన్ గెలుపుతో మ్యాజిక్ ఫిగర్ 270ను దాటిన ట్రంప్, ఇప్పటివరకు 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహ్యారిస్‌కు 224 ఓట్లు దక్కాయి. 26 రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ గెలుపొందగా 19 రాష్ట్రాల్లో డెమోక్రాట్లు విజయం సాధించారు. ఇంకా అరిజోనా, అలెస్కా, నెవడా, మైన్ రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది.
మైన్ మినహా మిగితా రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. వీటిలో కూడా ట్రంప్ గెలిస్తే 310కి పైగా ఎలక్టోరల్ ఓట్లు సాధించే అవకాశముంది. అమెరికా ఎన్నికల్లో కీలకంగా భావించే ఏడు స్వింగ్ రాష్ట్రాల్లోనూ ట్రంప్ సత్తా చాటారు. పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్, జార్జియాలో గెలువగా మిగిలిన మూడు రాష్ట్రాలు.. మిషిగన్, అరిజోనా, నెవడాల్లోనూ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు.
ఈ విజయంతో ట్రంప్ అరుదైన రికార్డును సృష్టించారు. 132 ఏళ్ల తర్వాత అధ్యక్షుడిగా పనిచేసి ఓడిపోయి మళ్లీ గెలిచిన అభ్యర్థిగా చరిత్రకెక్కారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, అక్రమ వలసలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు ట్రంప్‌కు ఈ ఎన్నికల్లో కలిసివచ్చిన అంశాలుగా ఉన్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం ట్రంప్ గెలుపుతో దూరమవుతుందనే భావన అమెరికా ఓటర్లలో స్పష్టంగా కనిపిం చింది.
అమెరికా సంప్రదాయం ప్రకారం జనవరి 20న వైట్‌హౌస్ బాధ్యతలను ట్రంప్ స్వీకరిస్తారు. అధికార మార్పిడికి దాదాపు రెండు నెలల సమయం పట్టనుంది. విజయం ఖరారైన తర్వాత తొలిసారి మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. అమెరికా రాజకీయ చరిత్రలో ఇది గొప్ప విజయమని, దేశంలో సువర్ణయుగం రాబోతుందని ఉద్ఘాటించారు. సెనేట్‌లోని రిపబ్లికన్ల హవా కనిపించింది.
ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు ఆధిక్యంలో ఉన్నారు. ఆరుగురు ఇండో అమెరికన్లు ప్రతినిధుల సభకు ఎంపికయ్యారు. ట్రంప్‌నకు ప్రపంచ దేశాధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రాత్మక ఎన్నికల్లో విజయం సాధించిన తన మిత్రుడు ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు అంటూ ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు.
అమెరికాలో ట్రంప్ 2.0
అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో విజయభేరి
- 47వ ప్రెసిడెంట్‌గా మళ్లీ ట్రంప్‌కే పట్టం
- స్వింగ్ స్టేట్లలో రిపబ్లికన్ల హవా
- సర్వేలను తలకిందులు చేస్తూ
- అనూహ్య విజయం
- మ్యాజిక్ ఫిగర్ దాటి 292 స్థానాలు కైవసం
- 224 వద్దే ఆగిపోయిన కమల
- పలు రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్
వాషింగ్టన్, నవంబర్ 6: అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయభేరి మోగించారు. సర్వేలకు అతీతంగా, అనూహ్యంగా స్పష్టమైన ఆధిక్యంతో రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండోసారి అధిరోహించనున్నారు.
అమెరికా సంప్రదాయం ప్రకారం జనవరి 20న 47వ ప్రెసిడెంట్‌గా ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తారు. అమెరికా ఎన్నికల్లో ఎంతో కీలకమైన స్వింగ్ స్టేట్స్ అన్నింటిలో ట్రంప్ హవా కొనసాగింది. ముఖ్యమైన పెన్సిల్వేనియా, జార్జియాలో రిపబ్లికన్లు విజయకేతనం ఎగురవేశారు.
5 రాష్ట్రాల్లో కొనసాగుతన్న కౌంటింగ్
మంగళవారం అర్ధరాత్రి పోలింగ్ పూర్తి కాగానే కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాగా రిపబ్లికన్ పార్టీ మొదటి నుంచి ఆధిపత్యం సాధించింది. ఇప్పటివరకు విడుదలైన ఫలితాల్లో ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ 270ను దాటేశారు. 2౯౨ ఎలక్టోరల్ ఓట్లను కైవసం చేసుకున్నారు.
డెమోక్రటిక్ అభ్యర్థి కమలహ్యారిస్‌కు 224 స్థానాలు లభించాయి. అయితే ఇంకా ఎన్నికల ఫలితాలు పూర్తి స్థాయిలో విడుదల కాలేదు. పలు రాష్ట్రాల్లో కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. అలెస్కా, అరిజోనా, నెవడా, మైన్ ఫలితాలు ఇంకా రాలేదు. మైన్ మినహా మిగతా రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు.
పట్టుదలతో నిలిచి..
ఆది నుంచి ట్రంప్‌కు ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటిని లెక్క చేయకుండా విజయదుందుభి మోగించారు. గత ఎన్నికల్లో ఫలితాల తర్వాత ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దాడి చేయడం, తర్వాత అనేక కేసులను ట్రంప్ ఎదుర్కొన్నప్పటికీ ఆయన వెనుకడుగు వేయలేదు. డెమోక్రాట్ల కంటే ట్రంప్ మద్దతు తక్కువగా ఉన్నట్లు ఎన్నో సర్వేలు వెల్లడించాయి.
అయినా పట్టుదలతో ట్రంప్ బరిలో నిలిచారు. 2022లో మధ్యంతర ఎన్నికలు ముగిసిన వెంటనే అధ్యక్ష ఎన్నికల కోసం సిద్ధమయ్యారు. అప్పుడే అధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరుకోవడం, సరిహద్దు వివాదాలు, అక్రమల వలసలు పెరిగిపోవడం ట్రంప్‌కు కలిసి వచ్చాయని చెప్పవచ్చు. దీంతో ఆయన చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు. దీంతో ట్రంప్ 2.0 ప్రభుత్వంపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
1988 నుంచి ప్రయత్నాలు
అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం డొనాల్డ్ ట్రంప్ అంతకుముందు కూడా ఎన్నో సార్లు ప్రయత్నించారు. 1988, 2004, 2012లో ప్రయత్నించినా సఫలం కాలేదు. న్యూయార్క్ గవర్నర్ పదవి కోసమూ 2006, 2014లో దృష్టి పెట్టారు. కానీ రేసులో నిలవలేదు. 2015 జూన్ 16న అమెరికా అధ్యక్ష పదవి కోసం అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.
అమెరికన్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తాననే నినాదంతో ప్రచారం ప్రారంభించి 2016లో స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ చేతిలో ఓడిపోయారు. నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు.
ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ
రిపబ్లికన్ పార్టీ
గెలిచిన రాష్ట్రాలు: టెక్సాస్ (40), ఫ్లోరిడా (30), పెన్సిల్వేనియా (19), ఒహియో (17), జార్జియా (16), నార్త్ కరోలినా (16), మిషిగన్ (15), టెన్నెస్సీ (11), ఇండియానా (11), మిస్సోరి (10), సౌత్ కరోలినా (9), అలబామా (9), లూసియానా (8), కెంటక్కీ (8), ఓక్లహామా (7), ఆర్కన్సాస్ (6), అయోవా (6), మిస్సిసిపి (6), కాన్సాస్ (6), యుటా (6), వెస్ట్ వర్జీనియా (4), ఐడాహో (4), మోంటానా (4), వయోమింగ్ (3), నార్త్ డకోట (3), సౌత్ డకోట (3), నెబ్రాస్కా (2)
ఆధిక్యంలో ఉన్నవి: అరిజోనా(11), నెవడా (6), అలెక్సా (3)
డెమోక్రటిక్ పార్టీ
గెలిచినవి: కాలిఫోర్నియా (54), న్యూయార్క్ (28), ఇల్లినోయిస్ (19), న్యూజెర్సీ (14), వర్జీనియా (13), వాషింగ్టన్ (12), మసాచుసెట్స్ (11), కొలరాడో (10), మేరీల్యాండ్ (10), మిన్నెసొటా (10), ఒరెగాన్ (8), కనెక్టికట్ (7), న్యూమెక్సికో (5), రోడ్ ఐలాండ్ (4), హవాయి (4), న్యూహ్యాంప్‌షైర్ (4), వెర్మాంట్ (3), డెలవేర్ (3), డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా (3)
ఆధిక్యంలో ఉన్నవి: మైన్ (2)
అమెరికాకు సువర్ణయుగం
ఎన్నికల తర్వాత తొలి ప్రసంగంలో ట్రంప్
ఫ్లోరిడా, నవంబర్ 6: అమెరికాలో సువర్ణయుగం రాబోతుందని అధ్యక్ష ఎన్నికల్లో విజేత డొనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. అధ్యక్ష ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు గొప్పగా పోరాడారని ప్రశంసించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడంతో డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో తన మద్దతుదారులను ఉద్దేశించి తొలి ప్రసంగం చేశారు.
ఈ సందర్భంగా సతీమణి మెలానియా ట్రంప్, చిన్న కుమారుడు బారన్ ట్రంప్‌తో కలిసి వేదిక పైకి వచ్చారు. దేశంలో గొప్ప విజయం సాధించామని, గతంలో ఎన్నడూ చూడని గెలుపు దక్కిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇది అతిపెద్ద రాజకీయ విజయంగా అభివర్ణించారు. రిపబ్లికన్ పార్టీకి 315 సీట్లు వచ్చే అవకాశముందని చెప్పారు. పాపులర్ ఓట్లలోనూ రిపబ్లికన్లదే హవా కొనసాగుతోందని తెలిపారు.
మెలానియాకు కృతజ్ఞతలు
రిపబ్లికన్లను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు. ఇకపై ప్రతిక్షణం మీకోసం, మీ కుటుంబం కోసం పోరాటం చేస్తా. ఎన్నో అడ్డంకులను అధిగమించి గెలుపు సాధించాం. ఇందుకోసం కష్టపడినవారి, తోడ్పాటు అందించినవారికి తగిన ప్రతిఫలం ఉంటుంది. యుద్ధాలను ఆపేసి మళ్లీ అమెరికాను గొప్పగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన ప్రయత్నాలు చేస్తా.
సరిహద్దు సమస్యలను పరిష్కరించుకుందాం. వలసలు చట్టబద్ధంగానే ఉండాలి అని స్పష్టం చేశారు. సందర్భంగా ఆయన భార్య సతీమణి మెలానియాను కౌగిలించుకుని కృతజ్ఞతలు చెబుతూ.. ఆమె రాసిన పుస్తకం ప్రజాదరణ పొందిందని పేర్కొన్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ను ట్రంప్ పొగడ్తలతో ముంచేశారు.
ట్రంప్ అరుదైన రికార్డ్
ఉత్కంఠభరిత పోరులో విజ యం ద్వారా ట్రంప్ సరికొత్త చరిత్ర సృష్టించారు. మొదట అధ్యక్షుడిగా గెలిచి రెండోసారి ఓడిపోయిన అనంతరం మూడోసారి ఎన్నికై గత చరిత్ర ను తిరగరాశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 132 ఏండ్ల తరువాత గ్యాప్ తీసుకుని రెండోసారి అధ్యక్షుడైన వ్యక్తిగా రికార్డ్ బ్రేక్ చేశారు. 1884లో గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నియ్యారు.
ఆ తరువాత 1888లో రెండోసారి నిలబడి ఓటమి చెందారు. తిరిగి 1892లో మూడోసారి ఎన్నికల్లో నిలుచొని ఘన విజయాన్ని అందుకుని రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఇప్పటివరకు అటువంటి విజయాన్ని ఇంతవరకు ఎవరూ అందుకోలేదు. దాదాపు 132 ఏండ్ల తరవాత ట్రంప్ గెలుపొంది గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ రికార్డ్‌ను బ్రేక్ చేశారు.
రిపబ్లికన్ల చేతికి సెనెట్
అధ్యక్ష ఎన్నికలతో పాటు సెనెట్‌లో 34 స్థానాలకు కూడా ఎన్ని కలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్లు హవా చాటి ఆధిక్యం సాధించారు. ప్రస్తుతం ఆ పార్టీకి సెనెట్‌లో 51 మంది ఉన్నారు. మరో వైపు డెమాక్రట్లు 4౩ మంది ఉన్నా రు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం డెమాక్రట్లు ఒకసీటు కోల్పోయి సెనెట్‌లో తమ ఆధిక్యాన్ని కోల్పోయారు. మరో 7 స్థానాలకు ఇంకా ఫలితాలు వెలువడలేదు. సెనెట్‌లో 100 స్థానాలు ఉన్నాయి.
ప్రతినిధుల సభలోనూ..
హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోనే రిపబ్లికన్లు సత్తా చాటారు. 435 స్థానాలున్న ప్రతినిధుల సభలో ఇప్పటివరకు ఆ పార్టీ 183 సీట్లలో విజయం సాధించింది. ఇది గతంలో కంటే ఒకటి ఎక్కువ. మరోవైపు డెమోక్రట్లు 154 స్థానాలు గెలుపొందారు.
రిపబ్లికన్లకు ప్రభుత్వంపై పట్టు
సెనెట్, ప్రతినిధుల సభలో ఆధిక్యం సంపాదించడంతో రిపబ్లికన్లకు ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో పట్టు వచ్చే అవకాశం ఉంది.
మిత్రమా.. మీకు శుభాకాంక్షలు
అమెరికా-భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేద్దాం. ఇద్దరం కలిసి ఇరు దేశాల ప్రజల అభివృద్ధికి, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడానికి కృషి చేద్దాం.
ప్రధాని నరేంద్ర మోదీ