calender_icon.png 5 April, 2025 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రాగన్ డాన్స్!

04-04-2025 12:00:00 AM

ప్రతీకార సుంకాలతో ఆసియా దేశాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్ద దెబ్బ కొట్టారు. చైనాపై 54 శాతం, వియత్నాంపై 46 శాతం, భారత్‌పై 27 శాతం దిగుమతి సుంకాలతో మతులు పోగొట్టారు. ఈ దిగుమతి సుంకాలవల్ల ఆసియాలో వాణిజ్య పరమైన మార్పులు తీవ్ర పరిణామాలకు దారి తీయచ్చుననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆసియా దేశాల వాణిజ్యం కుంటుపడి, కరెన్సీ విలువ హెచ్చుతగ్గులకు లోనై ఆర్థికంగా చాలా దేశాలు ఆర్థిక అస్థిరతకు లోను కావచ్చుననే భయాలు కూడా మొదలయ్యాయి. గురువారం ఉదయాన్నే ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లలో ఈ ఛాయలు ప్రస్ఫుటంగా కనిపించాయి.

చైనాను లక్ష్యంగా చేసుకొని దిగుమతి సుంకాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచినట్లు కనిపిస్తున్నా, ఆసియా దేశాలన్నింటినీ అమెరికా తన దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నదనేది ఇక్కడ సుస్పష్టం. ఆగ్నేయాసియాలోని చాలా దేశాల్లో కంపెనీలు తమ ఉత్పత్తులపై చైనా మీదనే ఆధార పడకుండా వియత్నాం, థాయిలాండ్, భారత్ వంటి దేశాలకూ వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు మిగతా దేశాలు కూడా ప్రతీకర సుంకాల పాట ఎత్తుకుంటే దేశాల మధ్య పూర్తి స్థాయి వాణిజ్య యుద్ధం జరగక మానదు. నిజానికి ఆసియా దేశాలపై ట్రంప్ ఊహించిన దానికంటే ఎక్కువగా దిగుమతి సుంకాలను విధించడం అందరినీ నిరాశకు గురి చేసింది.

ఈ పరిస్థితుల్లో భారత్, చైనా మధ్య స్నేహ, వాణిజ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు దోహద పడేది ట్రంప్ విధానాలే. భారత్  చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రెండు దేశాలమధ్య బంధం బలోపేతం కావాలని, అంతర్జాతీయ వ్యవహారాల్లో పరస్పర సహకారం ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆశిస్తున్నారు. ఈ మేరకు ఆయన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక సందేశం పంపారు.

‘డ్రాగన్ ఏనుగు’ కలిసి ఆసియాలో నృత్యం చేయాలనేది ఆయన ఆకాంక్ష. భారత్ పట్ల చైనా వైఖరిలో ఏదైనా మార్పు ఉంటుందా? ఉంటే గనుక అది అమెరికాతో తను సుంకాల విషయంలో చేయనున్న యుద్ధానికి భారత్ సహకారం తీసుకొనే దిశగానే ఉండవచ్చు. భారత్‌కు ఇప్పుడు చైనా పెట్టుబడుల అవసరం ఉంది. కీలక రంగాలు మినహాయిస్తే భారత్, చైనా పెట్టుబడులకు ఆహ్వానం పలుకక తప్పని పరిస్థితి ఉంది. మరి, చైనాతో ఇంకా పరిష్కారం కాని సరిహద్దు సమస్యలు ఉన్నాయి కదా.. గల్వాన్ ఘటనలు గుణపాఠాలు నేర్పాయి కదా అని ఇక్కడ ప్రశ్నించుకోవచ్చు.

కాని వాణిజ్యమే రెండు దేశాల మధ్య చర్చనీయాంశమైనప్పుడు, భద్రతా పరమైన అంశాన్ని విడిగా చూడాల్సిందేననే వాదన వినిపిస్తోంది. చైనాను నమ్మలేం, అనే భావన వీడి మరింత జాగరూకతగా ఆ దేశంతో వ్యవహరించవచ్చు. ట్రంప్ దిగుమతి సుంకాలను ఎదుర్కోవడం ఎలా అనేది కొన్నాళ్లుగా చైనాను పీడిస్తున్న ప్రశ్న. అందుకే, చైనా ఇటీవల దక్షిణ కొరియా, జపాన్‌లతో కలిసి సంయుక్తంగా ఒక ఫార్ములాను రూపొందించుకొనే పనిలో ఉంది. కలిసి వస్తున్న పరిస్థితుల్లో చైనానుంచి మరింత టెక్నాలజీని అంది పుచ్చుకొనేందుకు భారత్ ముందడుగు వేస్తే సత్ఫలితాలు వచ్చే అవకాశముంది.