calender_icon.png 3 April, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచే ట్రంప్ సుంకాల బాదుడు

02-04-2025 12:09:06 AM

  1. భారత్ సుంకాలు తగ్గిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ట్రంప్
  2. ఏప్రిల్ 2 లిబరేషన్ డే అన్న ట్రంప్

వాషింగ్టన్, ఏప్రిల్ 1: పరస్పర సుంకాల అమలు వేళ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశ వాణిజ్య సహచరులకు వినమ్రతతో కూడిన సందేశం పంపారు. నేటి నుంచి భారత్ మీద కూడా పరస్పర సుంకాలు అమలు కానున్నాయి. పరస్పర సుంకాల అమలుకు మొత్తం అంతా సిద్ధం అయింది.

న్యూఢిల్లీ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై 100 శాతం సుంకాలను వసూలు చేస్తోందని వైట్ హౌస్ ఆరోపించింది. దాంతో భారత్‌కు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేయడం అసాధ్యంగా మారుతోందని ఒక ప్రకటనలో పేర్కొంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరస్పర సుంకాలు అంటూ అన్ని దేశాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

ఏప్రిల్ 2ను ‘లిబరేషన్ డే’గా కూడా ప్రకటించారు. ట్రంప్ మాట్లాడుతూ ‘మేము ఎంతో మంచిగా ఉంటాం. అది మీరు బుధవారం చూడబోతున్నారు’ అని పేర్కొన్నారు. చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలతో అమెరికా వ్యవహరించిన విధంగా భారత్‌తో వ్యవహరించే అవకాశం లేదని గత వారం అధికారులు ప్రకటించారు. 

మమ్మల్ని పీల్చేస్తున్నారు... 

ఈ సుంకాలపై వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. ‘కొన్ని దేశాలు అనేక రోజులుగా సుంకాల పేరు చెప్పి మమ్మల్ని పీల్చిపిప్పి చేస్తున్నాయి. అమెరికా డెయిరీ ఉత్పత్తులపై యురోపియన్ యూనియన్ 50 శాతం సుంకాలు, ఇక్కడి బియ్యంపై జపాన్ 700 శాతం సుంకాలు, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100 శాతం సుంకాలు, బటర్, చీజ్ ఉత్పత్తులపై కెనడా 300 శాతం సుంకాలు వసూలు చేస్తున్నాయి.

ఈ సుంకాల దెబ్బకు ఆయా ఉత్పత్తులను ఆ దేశాలకు పంపిచడం అసాధ్యంగా మారింది. దీని వల్ల ఇక్కడి వారి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. అందుకే ఆయా దేశాలపై ప్రతీ కార సుంకాలు విధించేందుకు ఇదే సమ యం అని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. 

సుంకాలు తగ్గొచ్చు.. 

డెడ్‌లైన్‌కు ముందే భారత్ సుంకాలు తగ్గించొచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. సుంకాల గురించి ఆయన మాట్లాడుతూ.. ‘అమెరికాతో అన్యాయంగా ప్రవర్తించిన ఎన్నో దేశాలు తమ సుంకాలను తగ్గించుకుంటున్నాయి. భారత్ కూడా సుంకాలను తగ్గిస్తుందని నేను విన్నాను’ అని పేర్కొన్నారు.