04-04-2025 01:31:09 AM
వాషింగ్టన్, ఏప్రిల్ 3: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల బాంబు పేల్చారు. అమెరికాకు ఎగుమతయ్యే ఉత్పత్తులపై దేశా లను బట్టి 10 శాతం నుంచి 49 శాతం వరకూ సుంకాలు ప్రకటించారు. కొలంబియా, చిలీ వంటి కొన్ని దేశాల ఉత్పత్తులపై 10 శాతం దిగుమతి సుంకాలను విధించిన ట్రంప్ కాంబోడియాపై అత్యధికంగా 49 శాతం టారిఫ్‌ను విధించారు.
ఈ క్రమంలోనే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఉత్పత్తులపై 27 శాతం సుంకా లు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 1.30 గంటలకు వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్ రోజ్‌గార్డెన్‌లో పలు దేశాలపై విధించే టారిఫ్‌లకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ అమెరికా ఉత్పత్తులపై కొన్ని దేశాలు అధిక సుంకాలు విధిస్తున్నాయన్నారు. అయితే పలు దేశాలు తమ ఉత్పత్తులపై విధించే సుంకాల్లో సగం మేర మాత్రమే తాము ఆయా దేశాలపై విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ తనకు గొప్ప మిత్రుడు అయినప్పటికీ అమెరికా విషయంలో సరిగా వ్యవహరించడంలేదని ఆరోపించారు.
అమెరికా ఉత్పత్తులపై భారత్ 52 శాతం మేర సుంకాలు విధిస్తున్నందున భారత ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు. చాలా సందర్భాల్లో వాణిజ్య పరంగా శత్రువు కంటే మిత్రుడు అధ్వాన్నంగా ఉంటాడని ట్రంప్ పేర్కొన్నారు. వాణిజ్య లోటులను ఇకపై కేవలం ఆర్థిక సమస్యలు మాత్రమే కాదన్న ఆయన వాటిని జాతీయ అత్యవసర పరిస్థితిగా అభివర్ణించారు.
అయితే వైట్‌హౌస్ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మాత్రం భారత్‌పై 27శాతం సుంకాలు విధిస్తున్నట్టు పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ ప్రతీకార సుంకాలు ఏప్రిల్ 9 అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నట్టు వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భారత్‌పై అమెరికా విధించిన సుంకాలపై భారత వాణిజ్యశాఖ స్పందించింది.
సుంకాల వల్ల తలెత్తే పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. పారిశ్రామిక వర్గాలతోపాటు అన్ని భాగస్వామ్యపక్షాల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నట్టు పేర్కొంది. అలాగే అమెరికా సుంకాల వల్ల కలిగే ప్రయోజనాలను కూడా అంచనా వేయనున్నట్టు తెలిపింది.