06-04-2025 12:28:57 AM
ఈ నెల 7న అమెరికా అధ్యక్షుడితో నెతన్యాహు భేటీ
వాషింగ్టన్, ఏప్రిల్ 5: ప్రతీకార సంకాల విషయంలో భారత్ సహా వియత్నాం, ఇజ్రాయెల్ ప్రతినిధులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు సఫలం అయితే ఆయా దేశాలతో అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఒప్పందం కుదరనిపక్షంలో ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ దేశాలపై టారిఫ్‌లు అమలయ్యే అవకాశం ఉంది.
ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. ఈ క్రమంలో ట్రంప్ తన సొంత సామాజిక మాద్యమం ట్రూత్ సోషల్ పెట్టిన పోస్టు ఈ కథనాలను ధ్రువీకరించింది. వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ టూ లామ్‌తో తాను సంభాషించినట్టు ట్రంప్ తన పోస్ట్‌లో వెల్లడించారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోగలిగితే సుంకాలను తమ దేశం సున్నాకి తగ్గించాలనుందని, ఇది జరగాలని కోరుకుంటున్నట్టు లామ్ తనకు చెప్పినట్టు ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికాకు ఇజ్రాయెల్ ప్రధాని
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ నెల 7న అమెరికా వెళ్లి డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో భాగంగా నెతన్యాహు తమ దేశంపై విధించిన 17శాతం టారిఫ్‌లపై ట్రంప్‌తో చర్చించే అవకాశం ఉంది. హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం వంటి అంశం కూడా ఇరు నేతల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.