calender_icon.png 21 January, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండోసారి గద్దెనెక్కిన ట్రంప్

21-01-2025 02:12:57 AM

  1. అతి శీతల వాతావరణం వల్ల ఇండోర్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం
  2. ఉపాధ్యక్షుడిగా వాన్స్
  3. హాజరైన అనేక దేశాల అతిథులు

వాషింగ్టన్, జనవరి 20: అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. అతిశీతల వాతావరణం కారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆరుబయట కాకుండా నాలుగు గోడల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనేక దేశాల నుంచి అతిథులు హాజరయ్యారు.

ట్రంప్ అమెరికా అధ్యక్ష కుర్చీలో కూర్చోవడం ఇది రెండో సారి. 2016-2020 వరకు కూడా ఆయనే అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. కానీ 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన డెమోక్రటిక్ నేత జో బైడెన్ చేతిలో దారుణంగా ఓడిపోయి అధ్యక్ష పీఠానికి దూరమయ్యారు.

మరలా ఇప్పుడు ఆయన మరోమారు అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. 78 ఏండ్ల ట్రంప్ మీద ఎన్నో ఆరోపణలు, మరెన్నో కేసులు ఉన్నాయి. అయినా కానీ ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్లు మరోమారు ట్రంప్‌కే పట్టం కట్టారు. 

హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు

ఈ కార్యక్రమానికి అనేక దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంలో హాజరైన వివిధ దేశాల ప్రతినిధుల ముంగిట ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్‌తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అమెరికాకు 45వ అధ్యక్షుడిగా కూడా ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్ష పీఠం అధిరోహించిన ట్రంప్ నెలకొల్పిన రికార్డులు..

* అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన అత్యంత పెద్ద వయస్కుడైన నేతగా ట్రంప్ రికార్డులకెక్కారు. 2020 ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఓడిపోయిన ట్రంప్ ఈ సారి మాత్రం కమలాహరిస్‌ను 312-226 తేడాతో చిత్తు చేసి అధ్యక్ష పీఠం అధిరోహించారు.

* నేరం రుజువైన తర్వాత అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించిన మొదటి నేతగా ట్రంప్ నిలిచారు. హాష్ మనీ కేసులో కోర్టు ట్రంప్‌ను దోషిగా తేల్చింది.

* ఆరుబయట కాకుండా నాలుగు గోడల మధ్య ప్రమాణస్వీకారం చేయడం అమెరికా చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. 40 సంవత్సరాల కిందట రిపబ్లికన్ లీడర్ రొనాల్డ్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. అక్కడ ప్రస్తుతం --12 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

కార్యక్రమానికి హాజరైన అతిథులు

డొనాల్డ్ టంప్ ప్రమాణ స్వీకారానికి భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. తాజా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆయన సతీమణి జిల్ బైడెన్‌తోపాటు తాజా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దంపతులు ట్రంప్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. అలాగే మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ దంపతులు, జార్జి డబ్ల్యూ.బుష్ దంపతులు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. చట్టసల్లో గతంలో స్పీకర్లుగా పని చేసిన న్యూట్ గింగ్రిచ్, జాన్ బోహ్నర్, కెవిన్ మెక్‌కారీలు ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేశారు. వ్యాపార దిగ్గజం అనిల్ అంబానీ దంపతులు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అమెజాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జెఫ్ బెజోస్, మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్‌తోపాటు మరికొందరు ప్రముఖులు క్యాపిటల్ రోటండా హాల్‌లో అట్టహాసంగా సాగిన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. 

మూడో ప్రపంచ యుద్ధాన్ని నిలువరిస్తా

కొత్త అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందు చేపట్టిన ర్యాలీలో మాట్లాడారు. ‘అధ్యక్షుడిగా బైడెన్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు రివర్స్ చేస్తా. ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ క్రెడిట్ నాదే. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపించేందుకు ప్లాన్ చేస్తున్నా. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపుతా.

అమెరికా సరిహద్దులపై దాడుల్ని నియంత్రిస్తా. టిక్‌టాక్‌లో 50 శాతం అమెరికన్లు కలిగి ఉంటే దాన్ని అలాగే కొనసాగిస్తా. అమెరికన్లు చరిత్రలో చూడని పాలనను మొదటి రోజే అందిస్తా. అమెరికా చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా తొలి వారం, తొలి వంద రోజుల పాలనలో చేసి చూపిస్తా’ ‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్’ అని నినదించారు.

దేశాధినేతల అభినందనలు

డొనాల్డ్ ట్రంప్‌కు బ్రిటన్ కింగ్ చార్లెస్ అభినందనలు తెలుపుతూ వ్యక్తిగతంగా సందేశం పంపించారు. ఈ విషయాన్ని బకింగ్‌హమ్ ప్యాలేస్ ప్రకటించింది. అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మూడో ప్రపంచ యుద్ధంపై ట్రంప్ వైఖరిని స్వాగతిస్తున్నట్టు రష్యా భద్రతా మండలి సభ్యులతో జరిగిన సమావేశంలో పుతిన్ పేర్కొన్నట్టు తెలుస్తుంది.