* విలీనమయ్యే ప్రసక్తే లేదన్న ట్రూడో
* చూస్తూ ఊరుకోమంటూ ఫ్రాన్స్ హెచ్చరిక
వాషింగ్టన్, జనవరి 8: మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన విస్తరణ వాదాన్ని బలంగా వినిపించారు. గత కొన్ని రోజులుగా పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ చెబుతున్నారు. అలాగే అమెరికాలో కెనడా 51వ రాష్ట్రంగా చేరాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా మీడియా సమావేశంలో మరోసారి ఆ వ్యాఖ్యలను ట్రంప్ పునరుద్ఘాటించారు. కెనడా, గ్రీన్ ల్యాండ్‌ను అమెరికాలో విలీనం చేయడంతోపాటు పనామా కెనాల్ తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటానన్నారు. అంతేకాకుండా గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానన్నారు.
జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న ట్రంప్.. మంగళవారం ఫ్లోరిడాలోని తన మార్ ఎ లాగో రిసార్టులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కెనడాను అమెరికాలో విలీనం చేయడానికి సైనిక చర్యను ఉపయోగిస్తారా అని విలేకర్లు ప్రశ్నించగా ట్రంప్ బదులిచ్చారు. కెనడాను అమెరికాలో కలపడానికి సైనిక చర్యను వాడనని చెప్పారు.
అయితే ఇందుకోసం ఆర్థిక శక్తిని ఆయుధంగా ఉపయోగిస్తాన్నారు. అమెరికా, కెనడా దేశాలు ఎంతో ప్రత్యేకమైనవని పేర్కొన్న ట్రంప్.. ఇరు దేశాల మధ్య కృత్రిమంగా గీసిన రేఖ ఉందన్నారు. అమెరికా జాతీయ భద్రతకు కెనడా విలీనం చాలా అవసరమని ట్రంప్ పేర్కొన్నారు. కెనడా రక్షణ కోసం ఇప్పటికే అమెరికా బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తుందని చెప్పారు. అయినా ఎటువంటి ప్రయోజనం లేదన్నారు.
మిలటరీ చర్యను వాడనని చెప్పలేను
పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకోవడంతోపాటు డెన్మార్క్ నుంచి గ్రీన్ ల్యాండ్‌ను తీసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే వీటిని స్వాధీనం చేసుకునే విషయంలో సైనిక శక్తిని కానీ ఆర్థిక శక్తిని కానీ వినియోగించనని హామీ ఇవ్వలేనన్నారు. ఆర్థిక రక్షణ కోసం వాటి అవసరం తమకు ఉందన్నారు.
పనామా కాలువను అమెరికా సెక్యూరిటీ కోసమే నిర్మించినట్టు వెల్లడించారు. అమెరికా రక్షణ విషయంలో గ్రీన్ ల్యాండ్ ముఖ్యమని ట్రంప్ పేర్కొన్నారు. గ్రీన్ ల్యాండ్ కొనుగోలును డెన్మార్క్ వ్యతిరేకిస్తే దానిపై అధిక సుంకాలు విధించాలని రిపబ్లిక్ పార్టీ నేతలు సూచిస్తున్నట్టు తెలిపారు.
గల్ఫ్ ఆఫ్ అమెరికాగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో
గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికా మార్చాలని తన క్యాబినెట్ కోరుకుంటుందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ క్రమంలోనే గల్ఫ్ ఆప్ మెక్సికో పేరును గల్ఫ్ ఆప్ అమెరికాగా మార్చబోతున్నట్టు తెలిపారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను అందమైన రింగ్‌గా అభివర్ణించిన ట్రంప్.. అది చాలా భూభాగాన్ని కలిగి ఉన్నట్టు చెప్పారు. గల్ఫ్ ఆఫ్ అమెరికా పేరు చాలా బాగుందని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు.
నాటో దేశాలు రక్షణ వ్యయాన్ని పెంచాలి
నాటో దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచాలని డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. నాటో దేశాలు తమ స్థూల దేశీయోత్పత్తిలో 5 శాతాన్ని రక్షణ కోసం ఖర్చు చేయాలన్నారు. ప్రస్తుతం ఆయా దేశాలు కేవలం 2శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. రక్షణ కోసం స్థూల దేశీయోత్పత్తిలో 5శాతం ఖర్చను నాటో దేశాలు భరించగలవని అన్నారు. కాగా, చాలా దేశాలు రక్షణ వ్యయంలో తమ న్యాయమైన వాటాను చెల్లించడం లేదని ట్రంప్ గతంలో తరచూ ఆరోపించారు.
చూస్తూ ఊరుకోం..
ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఐరోపా స మాఖ్య సరిహద్దులపై దాడి చేస్తే చూస్తూ ఊరుకొ నే ప్రసక్తే లేదని ఫ్రాన్స్ స్పష్టం చేసింది. ‘ఐరోపా సమాఖ్యపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోం. మాది బలమైన ఖండం. డెన్మార్క్‌లో దాదాపు 600ఏళ్ల నాటి నుంచి నుంచి భాగమై ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను, పనామా కాలువను అమెరికా ఆక్రమించుకుంటుందంటే నేను నమ్మను.
పరిస్థితులకు తగ్గట్టు మార్పులు చేసుకొనే వారు మాత్రమే తట్టుకోగలి గే యుగంలో ఉన్నామా అంటే అవుననే చెబుతా ను.ఈ విషయంలో ఐరోపా సమాఖ్య అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం కానీ బెదరాల్సిన అవసరం కానీ లేదు’ అని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జియోన్ నోయల్ బార్రోట్ రేడియో కా ర్యక్రమంలో మాట్లాడుతూ పేర్కొన్నారు.
అలాగే ట్రంప్ వ్యాఖ్యలపై డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్‌సెన్ మాట్లాడుతూ ‘గ్రీన్ ల్యాండ్ అమ్మకానికి లేదు’ అని అన్నారు. గ్రీన్ ల్యాండ్ ప్రధాని మ్యూట్ ఎగ్డే సైతం ఈ తరహా వ్యాఖ్యలే చేశారు.
తమకు ప్రజల మద్దతు ఉందని.. అలాగే గ్రీన్ ల్యాండ్ అమ్మకానికి లేదని.. భవిష్యత్తులో కూడా ఉండబోదని పేర్కొన్నారు. మరోవైపు పనామా కాలువ విషయంలో పనామా విదేశాంగ మంత్రి జేవియర్ మార్టినేజ్ మాట్లాడుతూ.. పనామా కాలువ పనామా ప్రభుత్వం నియంత్రణల్లో ఉందని, ఇది అలానే కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఆ ఆవకాశమే లేదు: ట్రూడో
అమెరికాలో కెనడా విలీనం అంశంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కొట్టిపారేశారు. అమెరికాలో కెనడా విలీనం అయ్యే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. ‘అమెరికాలో కెనడా విలీనం అయ్యే అవకాశం ఏమా త్రం లేదు.
రెండు దేశాలలోని కార్మికులు, ప్రజలు ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్యం, భద్రతా భాగస్వామ్యం ద్వారా లాభపడుతున్నారు’ అని ట్రూడో పేర్కొన్నారు.
మరోవైపు ట్రంప్ బెదిరింపులకు కెనడా తలొగ్గదని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ట్రంప్ పూర్తిగా అవగాహన లేమితో మాట్లాడారు. మా దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. మా దేశ ప్రజలు బలంగా ఉన్నారు. ఇలాంటి బెదిరింపులకు మేము అస్సలు తలొగ్గం’ అని స్పష్టం చేశారు.
ఎప్పట్నుంచో గ్రీన్ ల్యాండ్‌పై కన్ను
గ్రీన్‌ల్యాండ్ ప్రస్తుతం డెన్మార్క్‌లో స్వతంత్ర రీజియన్‌గా ఉంది. అక్కడ అమెరికాకు చెందిన భారీ అంతరిక్ష కేంద్రం ఉంది. ఉత్తర అమెరికా నుంచి ఐరోపాకు వెళ్లే షార్ట్‌కట్ మార్గం గ్రీన్‌ల్యాండ్ సమీపంలో ఉంది. ఈ ద్వీపంలో అత్యధిక స్థాయిలో ఖనిజ సంపద ఉంది.
గ్రీన్ ల్యాండ్‌ను తమ దేశంలో విలీనం చేసుకోవాలని అమెరికా 1860ల్లోనే ప్లాన్ చేసింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్స న్ అప్పట్లో ఆసక్తి చూపించారు. ట్రంప్ 2019లో గ్రీన్ ల్యాండ్ కొనుగోలు చేస్తానని ఆఫర్ ప్రకటించారు. కానీ డెన్మార్క్ అందుకు ఒప్పుకోలేదు. ప్రపంచంలోని 13శాతం చమురు.. 30శాతం గ్యాస్ నిల్వలు గ్రీన్ ల్యాండ్ ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం.
అలాగే ప్రపంచంలోనే పెట్రోలియం వనరులున్న 9వ అతిపెద్ద జలభాగం గా గల్ఫ్ ఆఫ్ మెక్సికో గుర్తింపు పొందింది. ఈ ప్రాంతాలను అమెరికా స్వాధీనం చేసుకుంటే ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. అలాగే కెనడాను అమెరికాలో కలుపుకోవడం ద్వారా అమెరికాకు భద్రత పరంగా మేలు జరుగుతుందని ట్రంప్ భావిస్తున్నారు.
చై నా, రష్యాల ఆటలను కట్టడి చేయొచ్చనే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్టు తెలుస్తోంది. పనామా కాలువ గుండా వెళ్లే అమెరికా ఓడలపై పనామా ప్రభుత్వం భారీ మొత్తంలో టోల్ ఫీజు వసూలు చేస్తుందని గత కొద్ది రోజులుగా ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామంటున్నారు.