15-11-2024 12:00:00 AM
-డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి
అమెరికా 47వ అధ్యక్షునిగా ట్రంప్ విజయం అనేక కీలక ఆర్థిక వ్యవస్థలకు మార్పులను సూచిస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రపం చ జీడీపీలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్న, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి రావడం అంటే భారత్ సహా అనేక కీలక ఆర్థిక వ్యవస్థలకు అనేక మార్పులు ఎదురు కావచ్చని అంచ నా. అమెరికా భారతదేశానికి రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.
కానీ, ట్రంప్‌కు నిరాశ కలిగించే విధంగా, దాని మొదటి ఐదు వాణిజ్య భాగస్వాములలో భారతదేశం వాణిజ్య మిగులు కలిగిఉన్న ఏకైక దేశం. భారతదేశానికి మొత్తం దిగుమతు ల్లో అమెరికా వాటా 3 శాతం కంటే తక్కు వ. మరీ ముఖ్యంగా, భారతదేశానికి గత ఆర్థిక సంవత్సరంలో 103 బిలియన్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాగా అందు లో ప్రధాన వాటా అమెరికాదే. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ తిరిగి రావడంతో ఈ సంఖ్యలు ఇప్పుడు ముఖ్యమైనవిగా మారాయి.
ద్వైపాక్షిక వాణిజ్యంపై ట్రంప్ దృష్టి, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ద్వారా చర్చలు జరిపిన ఒప్పందాల ను అధిగమించడం గురించిన భయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి, 2018లో అల్యూమినియం , స్టీల్‌పై ఏకపక్షంగా దిగుమతి సుంకాలు విధించడం భారతదేశం సహా అనేక దేశాలపై ప్రభావం చూపింది. తన ఎన్నికల ప్రచార సమయంలో, డోనాల్డ్ ట్రంప్ భారత్‌ను వాణిజ్య సంబంధాల ప్రధాన దుర్వినియోగదారుగా అభివర్ణించారు. ఆయన తన మొదటి పదవీ కాలంలో చైనా, భారతదేశం రెండింటినీ లక్ష్యంగా చేసుకున్నారు.
‘ఫెడ్’ వడ్డీరేటు తగ్గింపు ప్రభావం
అమెరికా జాబ్ మార్కెట్ చల్లబడటం ప్రారంభించినందున గత సెప్టెంబర్ 18న ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్ల తగ్గించింది. యూఎస్ వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ప్రకారం, 2022లో 380 బిలియన్ల కంటే ఎక్కువ మిగులుతో దశాబ్దాలుగా అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న చైనాపై ఇది అతిపెద్ద ప్రభావం చూపుతుంది. కానీ చైనా ఇప్పటికే దాని ఎగుమతుల కోసం ఇతర మార్కె ట్లను చూస్తోంది.
అయితే యూరోపియన్ యూనియన్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు, భారతదేశంలో ఇనుము, ఉక్కు వంటి అనేక ఉత్పత్తులకు గట్టి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ట్రంప్ తిరిగి అమెరికా అధ్య క్షుడిగా రావడం జెనరిక్ ఔషధాల నుండి ఐటీ సేవల వరకు అనేకరకాల ఉత్పత్తులను ప్రభావితం చేయవచ్చు. అధిక నైపు ణ్యం కలిగిన ఉద్యోగి హెచ్ 1బీ వీసాలపై పరిమితులను తిరిగి విధించడం అనేది మరో ముఖ్యమైన ఆందోళన.
ట్రంప్ తన మొదటి పదవీకాలంలో అమలు చేసిన కార్యక్రమాలు, హెచ్ 1బీ వీసాలు కోరుతున్న భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ తిర స్కరణ రేట్లు అమెరికన్ల ఉద్యోగాలకు వరమైంది. ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు సుమా రు లక్షమంది అమెరికన్ ఉద్యోగులను నియమించుకునేలా చేసింది. ట్రంప్ చమురు, సహజ వాయువు డ్రిల్లింగ్‌ను పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు. దీని అర్థం యూఎస్ మరోసారి తన వాతావరణ లక్ష్యాల నుండి వెనక్కి తగ్గుతోంది.
ట్రంప్, 2025 జనవరి 20న 47వ అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు . ‘మేం ఈసారి ఓడిపోతామని అస్సలు అనుకోవట్లేదు, అలాంటి ఆలోచన కూడా లేదు. తప్పకుండా గెలు స్తాం’ అంటూ మొన్న సెప్టెంబరులోనే ట్రంప్ ధీమాగా ప్రకటించారు. చెప్పినట్టుగానే అగ్రరాజ్య ఎన్నికల సమరంలో ఆయ న విజయనాదం చేశారు. నాలుగేళ్ల క్రితం జో బైడెన్ చేతిలో పరాజయం పాలై, ఓటమిని అంగీకరించడానికి ససేమిరా అన్న ట్రంప్- నేలకు కొట్టిన బంతిలా తిరిగొచ్చారిప్పుడు.
కొంత విరామానంతరం అమె రికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న రెండో వ్యక్తిగానే కాదు- 78ఏళ్ల వయసులో ఆ ఉన్నతాసనానికి ఎన్నికైన నేతగానూ ఆయన చరిత్ర సృష్టించారు. రిపబ్లికన్ పార్టీ కంచుకోటలను నిలబెట్టుకొంటూనే, స్వింగ్ రాష్ట్రాల్లో జైత్రయాత్ర చేసిన ట్రంప్- ఎలక్టోరల్ కాలేజీలో కమలా హారిస్‌పై విస్పష్ట మెజారిటీ సాధించారు. 2016లో ట్రంప్ చేతిలోనే హిల్లరీ క్లింటన్ ఓటమి, తాజాగా కమల పరాజయంతో అమెరికా అధ్యక్ష పదవి మహిళలకు నేటికీ సుదూర స్వప్నంగా మిగిలిపోయింది.
కమల పాలిట శాపాలైన బైడెన్ వైఫల్యాలు
కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు, ఎన్నికల గోదాలో డెమోక్రటిక్ పార్టీ చతికిలబడటానికి దారితీసిన పరిస్థితులెన్నో! జనజీవన స్థితిగతులపై అమెరికా గ్రామీణ ప్రాంతాల్లో, శ్రామిక వర్గాల్లో గూడుకట్టుకొన్న అసంతృప్తే 2016లో ట్రంప్‌ను మొదటిసారి గెలిపించింది. ’అమెరికాకే తొలి ప్రాధాన్యం’ అంటూ అధికార పగ్గా లు చేపట్టిన ఆయన ఏలుబడిలో ఆశించిన మేర ప్రజాసమస్యలు పరిష్కారం కాలేదు. కొవిడ్ ప్రజ్వలనం దరిమిలా లక్షల సంఖ్యలో అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు.
ఇంటి అద్దెలూ భారీగా పెరిగాయి. నిత్యావసరాలకు చేతిలో సొమ్ములేని స్థితిలో అనేకమంది ఆకలితో అలమటించారు. ప్రణాళికాబద్ధ వ్యయం ద్వారా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది, ఉపాధికల్పనకు పెద్దపీట వేస్తానన్న బైడెన్‌కు 2020 ఎన్నికల్లో అమెరికన్లు ఓటేశారు .కానీ, ద్రవ్యో ల్బణం ఎగబాకడం వంటివాటితో బైడెన్ సారథ్యంపై భిన్నవర్గాల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. అవి కమలకు శరాఘాతాలయ్యాయి.
రెండేళ్ల ముందు నుంచే ఎన్నిక లకు ట్రంప్ సన్నద్ధమవుతుంటే- కమల హఠాత్తుగా రేసులోకి దిగారు. పన్నుల కోత నుంచి అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయడం వరకు అనేక అంశాలపై ట్రంప్ ప్రచార ఉధృతిలో ఆమె నిలబడలేకపోయారు. రిపబ్లికన్ పార్టీకి గట్టి మద్దతుదా రులైన శ్వేత జాతీయులే కాదు- హిస్పానియన్లు, ఆఫ్రో అమెరికన్లు సైతం ట్రంప్ నకు గణనీయంగా ఓట్లేసినట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
సంప్రదాయకంగా డెమోక్రాట్ల తరఫున నిలిచే వీరు- పెరిగిన జనజీ వన వ్యయాలు, ఇతరత్రా ఆటుపోట్ల మూలంగా ఈసారి రిపబ్లికన్ల వైపు మరలిపోయారు. వలసల కట్టడిలో కఠినంగా వ్యవహరిస్తానన్న ట్రంప్ వెనక ప్రవాస భారతీయులూ భారీ సంఖ్యలో నిలబడటం ఆశ్చర్యకరం! గాజాపై ఇజ్రాయెల్ దాడిలో పాలస్తీనా వాసులెందరో ప్రాణా లు కోల్పోవడం, టెల్‌అవీవ్‌కు బైడెన్ యంత్రాంగం వెన్నుదన్నుగా నిలబడటం అరబ్ అమెరికన్లలో వ్యతిరేకతను రాజేసింది. యుద్ధాలకు ముగింపు పలికి అమెరికా ఆర్థికారోగ్యాన్ని బాగుచేస్తానన్న ట్రంప్ మెడలో విజయ వరమాల పడింది.
రాజనీతిజ్ఞత ప్రదర్శించాలి
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర, పశ్చిమాసియా సంక్షోభంతో ప్రపంచ శాంతి దీపం కొడిగడుతున్న వేళ ఆయన అగ్రరాజ్యాధిపతి అవుతున్నారు. గత పోకడలకు భిన్నంగా మాటల్లో, చేతల్లో ట్రంప్ రాజనీతిజ్ఞతను చూపిస్తే- అది అమెరికా సౌభాగ్యా నికే కాదు, విశ్వశ్రేయస్సుకూ దోహదకారి అవుతుంది. అమెరికా ప్రపంచ పెద్దన్నగా కొనసాగాలంటే మిత్ర దేశాలతో పాటు భారీ మార్కెట్ వ్యవస్థను కలిగిన దేశాలతో మైత్రి సంబంధం ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది.
ట్రంప్ తన పరిపాలన విధా నంలో రాజనీతిజ్ఞత చూపెడుతూనే ప్రపం చ వాణిజ్య సామ్రాజ్యం తమ చెప్పు చేతు ల్లో ఉండే విధంగా ఎగుమతి దిగుమతి సుంకాలను వేసే ప్రమాదం లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న వాతావరణ కాలుష్యం కట్టడి చేయడానికి 2015లో జరిగిన ప్యారిస్ ఒప్పందం చేయ గా ట్రంప్ మొదటిసారి అధ్యక్ష హోదాలో ఈ సంఘం నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇందులో సభ్యత్వం పొందినప్పటికీ ్ల ట్రంప్ రెండవసారి గెలవడంతో వాతావరణ కాలుష్య కట్టడి సంఘంలో ఉంటారా, బయటికి వస్తారా అన్న విషయం కూడా వేచి చూడాలి.
ఆసియా పవర్ ఇండెక్స్‌లో జపాన్‌ను అధిగమించి, ఆసియాలో మూడవ అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ అవతరించింది. కోవిడ్ అనంతరం బలమైన ఆర్థిక వృద్ధి భారతదేశం తన ఆర్థిక సామర్థ్యాన్ని 4.2 పాయింట్లు పెంచు కోవడానికి దారితీసిందని ఈ నివేదిక సూచించింది. అన్ని ఇతర వనరుల కొలతలలో ముఖ్యంగా భవిష్యత్ వనరులలో దాని స్కోరు 8.2 పాయింట్లు పెరిగినప్పుడు భారతదేశం మంచి పనితీరు కనబరిచిందని నివేదిక హైలైట్ చేస్తుంది.
ఈ పెరుగుదల ఆసియాలోని అనేక ఇతర దేశాల మాదిరిగా కాకుండా, రాబోయే దశాబ్దాలలో భారతదేశపు యువ జనాభా డివిడెండ్‌ను అందించవచ్చని సూచించింది.