30-03-2025 12:17:56 AM
భారత ప్రధానిని మరోమారు ఆకాశానికెత్తిన ట్రంప్..
ప్రాధాన్యం సంతరించుకున్న ట్రంప్ వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆకాశానికెత్తారు. ఆయన చాలా స్మార్ట్ మ్యాన్ అని కొనియాడారు. ట్రంప్ మాట్లాడుతూ.. ‘పీఎం మోదీ ఇటీవలే ఇక్కడికి వచ్చారు. మేము ఎల్లప్పుడూ మంచి స్నేహితులుగా ఉన్నాం. మా మీద అత్యధికంగా సుంకాలు విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. ఇది చాలా దారుణం. ఆయన (మోదీని ఉద్దేశించి) చాలా గొప్ప వ్యక్తి. నాకు మంచి స్నేహితుడు కూడా. మా మధ్య ఫలప్రదమైన చర్చలు జరిగాయి.
ఆ చర్చలు రెండు దేశాలకు ఉపయోగకరమని భావిస్తున్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలోకి దిగుమతయ్యే అన్ని రకాల వాహనాల మీద 25శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన తర్వాత ఈ స్టేట్‌మెంట్ రావడం గమనార్హం. ఏప్రిల్ రెండు నుంచి పరస్పర సుంకాలు అమలు చేసేందుకు అగ్రరాజ్యం సిద్ధమైంది. ట్రంప్ తీసుకున్న 25 శాతం వాహన సుంకాల వల్ల అమెరికాలో అమ్ముడయ్యే సగం వాహన కొనుగోళ్లు ప్రభావితం కానున్నాయి. అమెరికా కంపెనీలు కూడా విదేశాల్లో ఉన్న ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్నాయి.