రష్యా అధ్యక్షుడు పుతిన్
మాస్కో, నవంబర్ 29: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌పై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. ఆయన తెలివైన రాజకీయ నాయకుడని పేర్కొన్నారు. అయితే, ఇటీవల ఆయనపై జరిగిన హత్యాయత్నాలు దిగ్భ్రాంతి కలిగించాయని, ప్రస్తుతం ట్రంప్ ప్రాణాలకు ఏ మాత్రం రక్షణ లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కజకిస్థాన్‌లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న రష్యా అధినేత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా ఎన్నికల ప్రచార ఘటనలను గుర్తుచేసుకున్నారు. ‘అమెరికా చరిత్రలోనే ఈసారి దురదృష్టకర ఘటనలు జరిగాయి. ఎన్నికల్లో ట్రంప్‌పై పోరాడేందుకు కొందరు అనాగరిక పద్ధతు లు అవలంబించారు.
రాజకీయ ప్రత్యర్థులు ఆయన కుటుంబాన్ని, పిల్లలను లక్ష్యంగా విమర్శలు గుప్పించడం బాధ కలిగించింది. ఒకటికంటే ఎక్కువసార్లు ట్రంప్‌పై హత్యాయత్నాలు జరగడం విచారకరం. నా ఆలోచన విధానం ప్రకారం.. ఇప్పుడు ట్రంప్ ఏ మాత్రం సురక్షితంగా లేరు. అయితే ఆయన తెలివైన వ్యక్తి. ముప్పును అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉంటారని విశ్వసిస్తున్నా’ అని పుతిన్ తెలిపారు.
ఏంజెలా మెర్కెల్‌కు పుతిన్ క్షమాపణలు
తన పెంపుడు కుక్కను చూసి భయపడ్డ జర్మనీ మాజీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాపణలు చెప్పారు. 2007 లో జరిగిన ఓ సమవేశానికి నాటి జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తోపాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరయ్యారు. తన పెంపుడు కుక్క లాబ్రడార్‌ను తీసుకుని ఈ సమావేశానికి పుతిన్ వెళ్లారు. ఈక్రమంలో మె ర్కెల్‌తో పుతిన్ భేటీ అయ్యారు.
అయి తే ఆ కుక్కను చూసి తాను తీవ్రంగా భయపడ్డానని, అక్కడ ఉన్నంతసేపు చాలా అసౌకర్యానికి గురయ్యానని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మె ర్కెల్ చెప్పారు. పుతిన్‌కు కుక్కలంటే చాలా ఇష్టమని, పలు సందర్భాల్లో కొందరు దేశాధ్యక్షులు ఆయనకు కుక్కలను బహుమతిగా ఇచ్చారని ఏంజెల్ గుర్తు చేశారు.
అయితే ఈ విషయం పుతిన్‌కు తెలియడంతో ఆయన స్పందిస్తూ మెర్కెల్‌కు క్షమాపణలు చెప్పారు. ఏంజెలాను భయపె ట్టడం తన ఉద్దేశం కాదని, ఆ సయమంలో అక్కడికి తన పెంపుడు కుక్క ను తీసుకువచ్చినందుకు ఆమె తనను క్షమించాలని కోరారు.