- కెనడా, మెక్సికోపై 25%, చైనాపై 10% సుంకాలు పెంపు
- కెనడా ప్రధాని కౌంటర్ అటాక్
- అమెరికా దిగుమతులపై 25శాతం టాక్స్ పెంచుతూ ఆదేశాలు
వాషింగ్టన్, ఫిబ్రవరి 2: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంతపని చేశారు. కెనడా, మెక్సికో, చైనా దేశాలకు సంబంధించిన దిగుమతులపై సుంకాలు పెంచుతానని పదే పదే చెప్పిన ట్రంప్ ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. కెనడా, మెక్సికో దిగుమతులపై 25శాతం, చైనాపై 10శాతం సుంకాలు పెంచుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఫెంటనిల్‌తో సహా తమ దేశ పౌరులను చంపే చట్టవిరుద్ధమైన, ప్రాణాతంతకమైన మాదక ద్రవ్యాల ముప్పు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. అందరు అమెరికన్లకు భద్రత కల్పించాల్సిన భాద్యత తనపై ఉందన్నారు.
అక్రమవలసదారులు, మాదక ద్రవ్యాలు అమెరికా సరిహద్దుల్లోకి రాకుండా చేస్తానని ఎన్నికల ర్యాలీలో మాటిచ్చినట్టు ట్రంప్ గుర్తు చేశారు.
కెనడా కౌంటర్ అటాక్
దిగుమతులపై సుంకాలను పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు కెనడా కౌంటర్ ఇచ్చింది. 106 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై సుంకాలను 25శాతం పెంచుతున్నట్టు కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ప్రకటించారు. టారిఫ్‌ల పెంపును కెనడా కోరుకోలేదనీ.. అయినప్పటికీ అన్నింటికీ తాము సిద్ధంగా ఉన్నట్టు ట్రూడో పేర్కొన్నారు.
అమెరికా ఆదేశాలపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ పార్డో స్పందిస్తూ.. సుంకాలను విధించడం ద్వారా సమస్యలను పరిష్కరించలేమన్నారు. ఏ సమస్య అయినా మాట్లాడు కోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. మెక్సికో ప్రయోజనాల కోసం టారిఫ్, నాన్ టారిఫ్ చర్యలను అమలు చేయాల్సిందిగా ఆ దేశ ఆర్థిక కార్యదర్శిని ఆదేశించారు.
డబ్ల్యూటీవోలో తేల్చుకుంటాం
అమెరికా 10 శాతం సుంకాలు విధించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో అమెరికా నిర్ణయాన్ని సవాలు చేయనున్నట్టు చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ ఆదివారం ప్రకటించిం ది. తమ దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.