* పనామా కాలువలో అధిక టోల్ చార్జీలపై అసహనం
* కాలువను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక
వాషింగ్టన్, డిసెంబర్ 22: అమెరికాకు చెందిన ఓడల నుంచి సెంట్రల్ అమెరికాకు చెందిన పనామా అధిక టోప్ చార్జిలను వసూలు చేయడంపట్ల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్ చార్జిలు వసూలు చేయడాన్ని హాస్యాస్పదంగా అభివర్ణించారు. ఒకవేళ పనామా ప్రభుత్వం టోల్ ఫీజులను ఇలానే వసూలు చేస్తే.. పనామా కాలువను తిరిగి అమెరికా స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నందును పనామా కెనాల్‌ను తమ జాతీయ ఆస్తిగా పరిగణిస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
పనామా కాలువ గుండా వెళ్లే అమెరికా ఓడల నుంచి టోల్ ఫీజు పేరుతో గరిష్ఠంగా 300 డాలర్ల వరకూ వసూలు చేస్తున్నట్టు ఆయన ఆరోపించారు. పనామాకు అమెరికా అందించిన దాతృత్వాన్ని గుర్తుపెట్టుకుని మసులుకోకపోతే.. కాలువను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికాలోని పనామా రాయబార కార్యాలయం కానీ, పనామా కెనాల్ అథారిటీ కానీ స్పందించలేదు. కాగా అమెరికా 1914లో కాలువ నిర్మాణాన్ని పూర్తి చేసి, 1999 డిసెంబర్ వరకూ నిర్వహించింది. ఆ తర్వాత 1997లో ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాల్లో భాగంగా కాలువను పనామా ప్రభుత్వానికి అప్పగించింది.