calender_icon.png 19 March, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రవాసీల్లో ట్రంప్ భయాలు

14-12-2024 12:00:00 AM

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయినట్లుగా  ప్రకటించిన రోజునుంచే అమెరికాలోని వలసదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. దానికి కారణం లేకపోలేదు. తాను అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటానని ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ వాగ్దానం చేశారు.  దీనికి అనుగుణంగానే బాధ్యతలు చేపట్టగానే అధికార ఆదేశాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అక్రమ వలసలపై కఠినంగానే వ్యవహరించారు.

అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు కూడా అలాంటి వారి జాబి తాను సిద్ధం చేస్తున్నారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారికి సం బంధించి యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్‌ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) ఇటీవల అధికారిక గణాంకాలను విడుదల చేసింది. మొత్తంగా 14.45 లక్షల మంది ఈ జాబితాలో ఉన్నారు. ఈ జాబితాలో హోండరస్,  గ్వాటెమాల తొలి రెండు స్థానాల్లో ఉండగా  మెక్సికో, ఎల్ సాల్వెడార్ దేశాల వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ జాబితాలో దాదాపు 18 వేల మంది భారతీయులు, 37 వేల మంది దాకా చైనీయులు కూడా ఉన్నట్లు ఐసీఈ  పేర్కొంది.

ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే వీరంతా తట్టా బుట్టా సర్దుకుని స్వదేశాలకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు అమెరికాలోని భారతీయులను భయపెడుతోంది. నిజానికి అమెరికాలో ప్రస్తుతం లక్షలాది మంది భారతీయులు అనధికారికంగా ఉంటున్నట్లు అంచనా. వీరిలో ఉద్యోగాల కోసం వెళ్లిన వారు కొందరయితే, అక్కడి విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన వారు మరికొందరు. గత కొన్నేళ్లుగా భారతీయుల్లో డాలర్ల కలలు ఎక్కువైనాయి. అందుకోసం చాలామంది అడ్డదారులు తొక్కుతున్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో అక్రమంగా అమెరికాలోకి అడుగుపెట్టిన భారతీయులనువెనక్కి పంపించేసినట్లు వార్తలూ వచ్చాయి.

సరయిన పత్రాలు లేకుండా అక్రమంగా అమె రికాలో అడుగుపెట్టిన వాళ్లందరినీ రాబోయే నాలుగేళ్లలో వెనక్కి పంపించి వేస్తామని, మిత్ర దేశాలకూ దీనిలో మినహాయింపు ఉండదని ట్రంప్ తాజాగా ప్రకటించారు. అయితే ట్రంప్ చెబుతున్నట్లుగా అమెరికానుంచి అక్రమ వలసదారులనందరినీ పంపించివేయడం అంత సులువు కాదని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలపై పోరాటం చేయడానికి వలసదారుల హక్కుల కోసం కృషి చేసే గ్రూపులు సిద్ధమవుతున్నాయి. చాలా నగరాలు వలసదారులకు ఇప్పటికీ స్వర్గధామాలుగా ఉన్నాయి.ఈ నగరాల్లోని వలసదారులను పంపించి వేయాలంటే కొత్తగా చట్టాలు చేయాల్సి వస్తుందని అంటున్నాయి.

ఇదంతా ఒక ఎత్తయితే అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో  భారత్, చైనాలాంటి ఆసియా దేశాలనుంచి వేలమంది ఉన్నత చదువులు చదివే వారున్నారు. ప్రస్తుతం అమెరికాలో క్రిస్మస్ సెలవులు మొదలు కావడంతో  వీరంతా మంది స్వదేశాలకు  చేరుకున్నారు. అయితే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా ఉండడం కోసం ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి తిరిగి వచ్చేయాలని ఆయా వర్సిటీలు విద్యార్థులకు మెస్సేజీలు పంపించాయి. దీంతో రాబోయే రోజుల్లో  అమెరికాకు వెళ్లే విమానాలన్నీ ఫుల్ అయిపోయాయి.

అక్రమ వలసదారులను దేశంనుంచి పంపించి వేస్తామని చెప్తున్న ట్రంప్ తమ దేశానికి రావాలనుకునే వారి కోసం ఇమిగ్రేషన్ ప్రాసెస్‌ను సులభతరం చేస్తానని చెప్పడం భారతీయులకు ఊరట కలిగిస్తోంది. అలాగే డ్రీమర్ ఇమిగ్రెంట్స్ (అమెరి కాలోని ఇతర దేశాల వారి పిల్లల) విషయంలో ఓ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంటామన్న ట్రంప్ వ్యాఖ్యలు లక్షలాదిమంది ప్రవాస భారతీయు లకు ఊరటనిస్తోంది. ఏది ఏమయినా కొత్త సంవత్సరంలో ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలు అమెరికాకు ఎగిరిపోవాలనుకునే వారి భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.