calender_icon.png 4 February, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్లపైట్రంప్ ఎఫెక్ట్. . నష్టాల్లో సూచీలు

04-02-2025 01:58:29 AM

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. దేశీయంగా వినియోగం పెంచేలా బడ్జెట్‌లో కొన్ని నిర్ణయాలు వెలువడినప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు సూచీలపై ఒత్తిడికి కారణమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ రాజేసిన వాణిజ్య యద్ధ భయాలే దీనికి కారణం. కెనడా, మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకం విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపింది.

దాదాపు ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు సైతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఉదయం 77,063.94 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 77,505.96) నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో దాదాపు 700 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీ చివరికి 319.22 పాయింట్ల నష్టంతో 77,186.74 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ సైతం 121.10 పాయింట్ల నష్టంతో 23,361.05 వద్ద ముగిసింది.

డాలరుతో రూపాయి మారకం 57 పైసలు క్షీణించి 87.19 శాతంగా ఉంది.  రూపాయి ఈ స్థాయికి పడిపోవడం ఇదే  తొలిసారి. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ షేర్లు నష్టాలు చవిచూశాయి. బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ చమురు 76.59 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2829 డాలర్ల వద్ద కొనసాగుతోంది.