- సెన్సెక్స్ 900 పాయింట్లు జంప్
- 24,500 సమీపంలో నిఫ్టీ
- చైనా మినహా ప్రపంచ మార్కెట్ల ర్యాలీ
ముంబై, నవంబర్ 6: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినట్లు వార్తలు వెలువడటంతో బుధవారం ఐటీ షేర్లు పెద్ద ఎత్తున ర్యాలీ జరిపాయి.
ట్రంప్ విధానాలతో భార త ఐటీ కంపెనీల అమెరికా వ్యాపారం పెరుగుతుందన్న అంచనాలతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎల్‌టీఐఎం, విప్రో తదితర షేర్లన్నీ 3-5 శాతం మధ్య పెరిగాయి. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 1,093 పాయింట్లు పెరిగి 80,569 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది.
చివరకు 901 పాయింట్లు లాభపడి, 80,000 స్థాయి ఎగువన 80,378 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 270 పాయింట్లు పెరిగి కీలక మైన 24,484 పాయింట్ల వద్ద ముగిసింది. సూచీలు పెరగడం వరుసగా ఇది రెండో రోజు. మంగళవారం సెన్సెక్స్ 600 పాయింట్లకుపైగా, నిఫ్టీ 200 పాయింట్లకుపైగా ర్యాలీ జరిపిన సంగతి తెలిసిందే.
ఎన్నికల అనిశ్చితి తొలగడంతో రిలీఫ్ ర్యాలీ
ట్రంప్ భారీ మెజారిటీతో విజయం సాధించడం ద్వారా యూఎస్ ఎన్నికల అనిశ్చితి తొలగిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు జరిపిన రిలీఫ్ ర్యాలీలో భాగంగా భారత్ ఈక్విటీలు పెరిగాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. యూఎస్ కార్పొరేట్లు ఐటీ వ్యయాలను పెంచుతాయన్న అంచనాలతో సాఫ్ట్‌వేర్ సర్వీసుల కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయని వివరించారు.
ఆసియా మార్కెట్లలో టోక్యో భారీగా పెరగ్గా, యూరప్ సూచీలు గ్రీన్‌లో ముగిసాయి. అయితే చైనా ఉత్పత్తులు, సర్వీసులపై టారీఫ్‌లు పెంచుతామన్న ట్రంప్ ఎన్నికల వాగ్దా నం కారణంగా షాంఘై, హాంకాంగ్ మార్కె ట్లు క్షీణించాయి. మంగళవారం రాత్రి లాభాలతో ముగిసిన యూఎస్ స్టాక్ సూచీలు బుధవారం కొత్త రికార్డుస్థాయికి పెరిగాయి. డోజోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్, నాస్‌డాక్, ఎస్ అండ్ పీ ఇండెక్స్‌లు 2 శాతం మధ్య ర్యాలీ చేశాయి.
మరో రూ. 4,400 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు వెనక్కు..
దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్‌పీఐలు) నిధుల తరలింపు కొనసాగుతున్నది. బుధవారం విదేశీ ఫండ్స్ రూ. 4,445 కోట్ల నికర విక్రయాలు జరిపినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధ మిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా విదేశీ ఫండ్స్ స్టాక్ మార్కెట్ నుంచి అదేపనిగా వెన క్కు తీసుకుంటున్న సంగతి విదితమే.సోమవారం రూ.4,300 కోట్లు, మంగళవారం రూ. 2,569 కోట్ల మేర నికర విక్రయాలు జరపగా, నవంబర్ నెల తొలి మూడు ట్రేడింగ్ రోజుల్లో దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఫండ్స్ రూ.10,000 కోట్లకుపైగా ఉపసంహరించుకున్నాయి. అక్టోబర్ నెల మొత్తంలో రికార్డుస్థాయిలో రూ. 95,000 కోట్లకుపైగా విలువైన షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు విక్రయించారు.
రెండు రోజుల్లో రూ.10.47 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
వరుస రెండు రోజుల్లో జరిగిన మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ. 10.47 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్‌ఈలో మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ. 10,47,565 కోట్లు ఎగిసి రూ. 4,52,58,633 కోట్లకు (5.37 ట్రిలియన్ డాలర్లు) చేరింది. ట్రంప్ కొత్త ప్రభుత్వం హెచ్1బీ వీసా నిబంధనల్ని మార్చబోదన్న ఆశలతో ఐటీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయని మెహతా ఈక్విటీస్ విశ్లేషకుడు ప్రశాంత్ తాప్సే చెప్పారు.
టీసీఎస్, ఇన్ఫీ టాపర్స్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్‌లు 4 శాతం చొప్పున పెరిగాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, లార్సన్ అండ్ టుబ్రో, మారుతి సుజుకి, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు సైతం లాభాలతో ముగిసాయి.
మరోవైపు నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలు వెల్లడించిన టైటాన్ 2 శాతం మేర పడిపోయింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలీవర్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 1 శాతం వరకూ నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో ఐటీ ఇండెక్స్ అత్యధికంగా 4.04 శాతం పెరిగింది.
టెక్నాలజీ ఇండెక్స్ 3.37 శాతం, రియల్టీ ఇండెక్స్ 2.68 శాతం, ఇండస్ట్రియల్స్ 2.66 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 2.53 శాతం, యుటిలిటీస్ ఇండెక్స్ 2.44 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.28 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.96 శాతం చొప్పున లాభపడ్డాయి.