- 2020 ఫలితాలు మా జీవితాలను మర్చేశాయి
- వాళ్లు అమెరికాను విభజించారు
- సోషల్ మీడియలో మెలానియా పోస్ట్
వాషింగ్టన్, సెప్టెంబర్ 9: నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష అధ్యక్ష ఎన్నికల్లో గెలవడానికి రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీలు తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అయితే ట్రంప్ వెంట ప్రచార కార్యక్రమాల్లో ఆయన సతీమణి మెలానియా ట్రంప్ పాల్గొనకపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మెలానియా ట్రంప్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. “ 2020 ఎన్నికల ఫలితాలు మా జీవితాలను శాశ్వతంగా మార్చివేశాయి. ఆహారం, గ్యాసోలిన్, భద్రత, రాజకీయ, భౌగోళిక పరిస్థితులను ప్రభావితం చేశాయి. మునుపెన్నడూ లేనంతగా డెమోక్రాటిక్ నేతలు అమెరికాను విభజించారు.
దేశం ఎదుర్కొంటున్న సమస్యలపైనా నా భర్త ట్రంప్‌ను మాట్లాడనివ్వకుండా మౌనంగా ఉంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దీంతో దేశంలో వాక్ స్వాతంత్య్రం కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నది” అని మెలానియా పేర్కొన్నారు. కాగా ఎన్నికల్లో తన కుమారుడు బారన్ ట్రంప్(18) తనకు సీక్రెట్ వెపన్ అని, యువతను ఆకట్టుకోవడానికి ట్రంప్ కార్డ్ గా ఉపయోగపడతాడని డొనాల్డ్ పేర్కొన్నారు. బారన్ న్యూయార్క్ యూనివర్సిటీలో చేరడానికి సిద్ధమవుతుండడంతో అతడికి సంబంధి ంచిన విషయాలు చూసుకునేందుకు అతడికి మద్దుతుగా మెలానియా టైం కేటాయిస్తోందని ట్రంప్ తెలిపారు.
మంగళవారమే డిబేట్
ఎన్నికలు సమీపిస్తుండడంతో వైస్ ప్రెసిడెంట్, డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారంతో హోరెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10వ తేదీన రాత్రి 9 గంటలకు ఏబీసీ న్యూస్ వారి మధ్య డిబేట్ నిర్వహిస్తోంది. ఫిలడెల్ఫియాలోని నేషనల్ రాజ్యాంగ కేంద్రం లో ఈ డిబేట్ జరుగనుంది. అధ్యక్ష అభ్యర్థులుగా ప్రకటించిన తరువాత వారిద్దరూ మొదటిసారి ముఖాముఖి చర్చలో పాల్గొంటున్నారు. ఈ చర్చపై దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
కమల ప్రచారంలో నాచో నాచో (నాటునాటు)
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియా మూలాలున్న డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ ప్రచారంలో ఆసియా ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రిపుల్ ఆర్ సినిమాలోని ఓ పాటను ఆమె ప్రచారం బృందం వాడుకుంటున్నది. ఇండియాకు ఆస్కార్ తెచ్చిపెట్టిన ‘నాటు నాటు’ పాట స్ఫూర్తితో ఇండో లీడర్ అజయ్ భుటోరియా ‘నాచో నాచో’ పేరుతో హిందీ పాటను రిలీజ్ చేశారు. కమల ప్రచారం కార్యక్రమాల వీడియోలతో ఈ పాటను తయారు చేశారు. నాచో నాచో కేవలం పాట కాదు, ఇది ఒక ఉద్యమం. దక్షిణాసియా అమెరికన్ సంతతితో అనుసంధానం అవుతాం. కమలా హారిస్‌కు మద్దతుగా 44 లక్షల ఇండో అమెరికన్ ఓటర్లు, ౬౦ లక్షల దక్షిణాసియా ఓటర్లను కూడగట్టడమే మా లక్ష్యం అని అజయ్ తెలిపారు. ఈ ఎన్నికల్లో కమల గెలిస్తే మొదటి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టిస్తారు.