calender_icon.png 20 March, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ దూకుడు

14-02-2025 12:00:00 AM

అధికారంలోకి వచ్చినప్పటినుంచీ అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయడంలాంటి అంతర్గత భద్రతా అంశాలకు ప్రాధాన్యత ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అగ్రరాజ్యం హోదాలో ఇతర దేశాల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తాను అధికారంలోకి వస్తే రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని చెప్తూ వచ్చిన ఆయన ఇప్పుడు ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు.

బుధవారం అటు రష్యా ప్రధాని పుతిన్, ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఆయన సుదీర్ఘంగా టెలిఫోన్ సంభాషణ జరిపారు. ఈ చర్చలు చాలా నిర్మాణాత్మకంగా జరిగాయని, త్వరలోనే పుతిన్‌తో  ముఖాముఖి చర్చలు జరపాలని నిర్ణయించినట్లు  చర్చల అనంతరం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టులో ట్రంప్ తెలిపారు.

తామిద్దరమూ కలిసి పని చేయాల్సిన సమయం వచ్చిందని కూడా ఆ చర్చల్లో అంగీకరించినట్లు పేర్కొన్నారు. ముందుగా రష్యా, ఉక్రెయిన్‌లో జరుగుతున్న లక్షలాది అమాయకుల మరణాలను ఆపడం ముఖ్యమని, ఆ తర్వాత భూభాగాల అప్పగింత, ఖైదీలమార్పిడి లాంటి కీలక అంశాలను పరిశీలించవచ్చని కూడా పేర్కొన్నారు.

కాగా పుతిన్‌తో ముఖాముఖి చర్చలు జరపాలని ట్రంప్ అనుకొంటున్నారని, బహుశా ఈ చర్చలు త్వరలోనే  సౌదీ అరేబియాలో జరగవచ్చని దౌత్యవర్గాలు అంటున్నాయి. అయితే శాంతి చర్చలు విజయవంతం కావాలంటే ఉక్రెయిన్ నాటో సభ్యత్వం కోసం, అలాగే రష్యా స్వాధీనం చేసుకున్న తమ భూభాగాల గురించి పట్టుబట్ట రాదనేది ట్రంప్ ప్రభుత్వ వైఖరిగా ఉంటుందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ స్పష్టం చేశారు.

ట్రంప్ శాంతి చర్చల ప్రతిపాదనపై జెలెన్‌స్కీ కొంతమేరకు సుముఖంగానే ఉన్నట్లు కనిస్తున్నా యూరోపియన్ కూటమి (ఈయూ) మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉంది. గురువారం నాటో ప్రధాన కార్యాలయంలో సమావేశమైన ఈయూ దేశాల రక్షణ మంత్రులు చర్చల్లో ఉక్రెయిన్, యూరప్‌లకు ప్రాతినిధ్యం లేకుండా ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టం చేశారు.

బ్రిటన్‌తో పాటుగా పోలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బలమైన యూరప్‌తోనే అమెరికా ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయనే విషయాన్ని అది మరిచిపోకూడదని ఆ నేతలు స్పష్టం చేశారు.  ఇంతటి కీలక  విషయంలో ఈయూ దేశాల అభిప్రాయాలను పరిగణనలోకి దీసుకోకపోవడం ఆయన దూకుడుకు అద్దం పడుతోంది.

 మరోవైపు గాజా విషయంలోనూ ట్రంప్  ఇదే దూకుడు కొనసాగిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ట్రంప్ తమ చెరలో ఉన్న బందీలందరినీ శనివారంలోగా విడుదల చేయాలంటూ హమాస్‌కు తాజా అల్టిమేటం జారీ చేశారు. అలా చేయకపోతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఇజ్రాయెల్‌కు సూచిస్తానని కూడా స్పష్టం చేశారు.

కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని హమాస్ ఆరోపిస్తూ బందీల విడుదలను ఆలస్యం చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్, ఇజ్రాయెల్‌లు తాజా హెచ్చరికలు చేశారు. అంతేకాదు గాజా స్వాధీనంపై ట్రంప్ ప్రణాళికను అమలు చేస్తామని కూడా పేర్కొన్నారు. గాజా ప్రాంతంలోని పాలస్తీనియన్లందరినీ వేరే ప్రాంతాలకు తరలిస్తామని, గాజాను ఇజ్రాయెల్ తమకు అప్పగిస్తే  ఆ ప్రాంతాన్ని పునర్నిర్మిస్తామని ట్రంప్ చెప్పడం తెలిసిందే.

అయితే ఇందుకోసం సైన్యాన్ని వినియోగించాల్సిన పని లేదని స్పష్టం చేశారు. అయితే ట్రంప్ ప్రతిపాదను అరబ్ దేశాలు ఇప్పటికే ఖండించాయి. బుధవారం జోర్డాన్ రాజుతో సమావేశంలోనూ ఆయన మరోసారి ఇదే విషయం చెప్పడం గమనార్హం.

ఈ రెండు అంశాల విషయంలోనూ ఆయా దేశాలకు మంచి చేస్తున్నట్లు పైకి కనిపిస్తున్నా, ట్రంప్ అసలు ఉద్దేశం అటు ఉక్రెయిన్ కానీ,ఇటు పాలస్తీనియన్లు కానీ మరోసారి తలెత్తకుండా పూర్తిగా అణచివేయడమేనని రాజకీయ పరిశీలకులు ఆయన దూకుడును ఎరిగిన రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.