- రూ.20 ఫీజుతో ఉచితంగా వైద్యసేవలు
- అల్కపురిలో డాక్టర్ రంగనాయకులు క్లినిక్
ఎల్‌బీనగర్, జూన్ 30(విజయక్రాంతి): ‘వైద్యో నారాయణ హరి:’ అనే సూక్తికి నిదర్శనం డాక్టర్ రంగనాయకులు. పేదల వైద్యుడిగా తన విశ్రాంత జీవితాన్ని అంకితం చేస్తున్న ప్రాణదాత. ఎల్బీనగర్ ప్రాంతవాసులకు పది రూపాయల డాక్టర్‌గా సుపరి చితులు. ఎల్బీనగర్‌లోని అల్కపురిలో తన నివాసాన్ని వైద్యశాలగా మార్చారు. పిల్లల డాక్టర్‌గా పేరున్నా అన్నిరకాల వ్యాధులకు చికిత్స చేయగల సమర్థులు. రంగనాయకులు నాడిని చూస్తే మందులు లేకుండా వ్యాధి తగ్గుతుందని రోగుల విశ్వాసం. చిన్నపాటి క్లినిక్‌లో సైతం ఓపీ చూడడానికి రూ.500 తీసుకుంటున్న ఈ రోజుల్లో... కేవలం రూ.20లకు వైద్యం చేస్తున్నారు.
తీసుకునే రూ.20 కూడా తన వద్ద పనిచేసే వారికి వేతనం ఇవ్వడానికే తీసుకుంటున్నారు. డాక్టర్ రంగనాయకుల ఓపీ కోసం రోగులు రాత్రి 12 గంటల నుంచే అక్కడే పడిగాపులు కాస్తారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12గంటలకు తిరిగి సాయం త్రం 6 నుంచి 9 వరకు చికిత్స అందిస్తారు. ఉస్మానియా దవాఖానలో పిల్లల వైద్యుడిగా సేవలందించిన ఆయన రిటైర్‌మెంట్ తర్వాత ఇంటివద్దే క్లినిక్ నిర్వహిస్తూ వస్తున్నారు. కరోనా సమయంలోనూ ఆయన వైద్య సేవలు ఆపలేదు. అతనితో ఆయన సతీమణికి కరోనా సోకింది. కొవిడ్ బారినపడి భార్య చనిపోయినా తన ఇంటికి వచ్చే పేదలకు వైద్యసేవలు అందించారు.
అసలు ఈ డాక్టర్ రంగనాయకులు ఎవరో కాదు, విప్లవ రచయిత సంఘం వ్యవస్థాపకుడు వరవరరావుకు స్వయానా సోదరుడు. వరవరరావు తాను నమ్మిన బాటలో పేదలకు అండగా ఉంటే.. అన్న బాటలో రంగనాయకులు డాక్టర్ వృత్తితో సేవ చేస్తున్నారు. వామపక్షభావజాలం ఉన్న సోదరులు తమ జీవితాన్ని పేదలకు అంకితమిస్తున్నారు. ఏ ఆస్పత్రి అయినా ముందుగా డబ్బులు తీసుకుని ఓపీ చీటీలు ఇస్తారు.. కానీ, రంగనాయకులు క్లినిక్‌లో ఏర్పాటు చేసిన ఒక నోట్‌బుక్కులో రోగులే తమ పేర్లు, తేదీ నమోదు చేసుకోవడం వ్యాధిగ్రస్తుల పట్ల ఆయన ఆదరణకు నిదర్శనం.