కిరణ్ 10వ తరగతి చదువుతున్నాడు. చాలా చలాకీ గలవాడు. స్నేహితులంటే ఇష్టం. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతాడు. బాగా చదువుతాడు. చురుకుగా ఉంటాడు. కాబట్టి అందరూ కిరణ్ చుట్టే తిరుగుతుంటారు. ఎప్పుడూ పదిమంది చుట్టూ ఉంటారు. ఎవరైనా ఏదైనా అడిగితే ఇట్టే చేసి పెడతాడు. ఏ వస్తువైనా అడిగినా ఇచ్చేస్తాడు.
కిరణ్ మనస్తత్వం తెలిసిన క్లాసులో పిల్లలందరూ వాళ్ళకు కావల్సినవన్నీ అడిగి తీసేసుకుంటారు. అనూప్ కు ఆల్జీబ్రా రాలేదని అడిగితే రెండు మూడు గంటలు శ్రమ తీసుకొని అర్థమయ్యే అయేలా చెప్పాడు. మనీష్ రెండు రోజులు సెలవు పెట్టాడని, హోంవర్కు చేయవల్సి ఉన్నప్పటికీ తన నోట్సులు రాసుకోవడానికి ఇచ్చాడు. పరీక్షలోని రీఫిల్ అయిపోయిందని సురేష్ బేల మొహం పెట్టాడని తను తెచ్చుకున్న ఎక్స్ ట్రా పెన్ ఇచ్చి ఆదుకున్నాడు. రికార్డులో బొమ్మలు వేయటం రావట్లేదని కిరీటి బాధపడుతుంటే ఒక రోజులో శ్రమపడి వేసిచ్చాడు. స్నేహితులు అందరిని ఆదుకోవటం కిరణ్ మనస్తత్వం. దీన్ని చూసి కిరణ్ తల్లిదండ్రులు భయపడ్డారు.
ఇప్పుడు పదవ తరగతి పరీక్షలు వస్తున్నాయి కిరణ్ ఇలా అందరికీ సహాయం చేస్తూ పోతుంటే తనకు చదవటానికి సమయముండదు. కిరణ్ చురుకైనవాడే.
అయినప్పటికీ తాను కూడా చదువుకోవాలి కదా! ఉన్న సమయమంతా స్నేహితులని వాళ్ళకు ఖర్చపెట్టేస్తే పరిక్షల్లో మార్కులు ఎలా వస్తాయో ఏమో అని భయపడ్డారు. అదే విషయం కిరణ్ కు చెప్పారు. కాని కిరణ్ కు విషయం అర్థం కాలేదు. వాళ్ళంతా నా బెస్ట్ ఫ్రెండ్స్ అమ్మా. వాళ్ళకు హెల్ప్ చేయాలని మీరే కదా చెప్పారు అన్నాడు కిరణ్ .
‘అలా కాదు కిరణ్. అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఉండరు. ఇప్పటివరకు నువ్వే వాళ్ళకు హెల్ప్ చేస్తున్నావు కాబట్టి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ లానే ఉన్నారు. నీవు ఏదన్నా సహాయం అడిగి చూడు అప్పుడు నీకు ఎంత మంది సహాయం చేస్తారో గమనించు. అప్పుడు నీకు ఎవరు స్నేహితులో అర్థం అవుతుంది అన్నారు అమ్మానాన్నలు. దీనికొక ఉపాయం కూడా అలోచించి పెట్టారు.
తెల్లవారి కిరణ్ చేతికి పెద్ద కట్టు కట్టారు. సైకిల్ మీద నుంచి పడ్డానని ఎముక కొద్దిగా చిట్లిందని చెప్పారు. డాక్టరు స్కూలుకు పోవద్దన్నాడని చెప్పారు. క్లాసులో ఉన్న స్నేహితులు అందరూ వచ్చి చూసి వెళ్ళారు. కిరణ్ ను చూసి చాలా బాధపడ్డారు. తమ హోం వర్కులు ఎవరు రాస్తారు? తమ బొమ్మలు ఎవరు వేస్తారు? అడిగారు. ‘తమకు అర్థం కాని లెక్కలు ఎవరు చెప్తారు?‘ అని చాలా చింతించారు. అందరూ మాట్లాడుతున్నారు గానీ సంతోషంగా లేరు.
నాలుగు రోజుల తర్వాత కిరణ్ వాళ్ల స్నేహితులకు తన పుస్తకాలు ఇచ్చి, హోంవర్కులు రాయమని బొమ్మలు వేయమని అడిగాడు. కానీ అందుకు ఎవరూ సుముఖంగా లేరు. ఒకరేమో నాకు చెయ్యి నెప్పిగా ఉందని, మరొకరేమో మా నాన్న తిడతాడని ఇలా ఏవేవో కారణాలు చెప్పారు. క్లాసులో చెప్పిన పాఠాన్నైనా తనకు చెప్పమని అడిగాడు కిరణ్. నేను కూడా క్లాసులో టీచర్ చెప్పినప్పుడు సరిగా వినలేదు అంటూ స్నేహితుడు తప్పించుకున్నాడు. కిరణ్ చాలా ఆశ్చర్య పోయాడు. ఇలా ఉంటారా స్నేహితులంటే అనుకున్నాడు. కిరణ్ మొహం బాధతో నిండిపోయింది.
అమ్మానాన్నలు అప్పుడు చెప్పారు. ‘చూశావా కిరణ్, నువ్వు సహాయం చేస్తున్నంతసేపూ అందరూ స్నేహితుల్లా ఉన్నారు. నువ్వు సహాయం అడిగేసరికి ఒక్కరూ రాలేదు. ఇలాంటి వాళ్ళకు సహాయం చేస్తూ మన సమయాన్ని వృథా చేసుకోగూడదు. నిజమైన స్నేహితులకు మాత్రమే సహాయం చెయ్యాలి. నిజమైన స్నేహితులు ఎవరో తెలియాలంటే మనమూ వాళ్ళను సహాయమడిగి చూడాలి. అప్పుడే తెలుస్తుంది. నిజమైన స్నేహితులు ఎవరో కిరణ్ కు అర్థం అయింది. నిజమైన స్నేహితుల్ని గుర్తించడం నేర్చుకున్నాడు.