భారత్, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు గత కొంతకాలంగా ఎడమొగం, పెడమొగంగానే ఉంటున్నాయి. ముఖ్యంగా గత ఏడాది ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత దౌత్య అధికారుల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బహిరంగంగా ఆరోపించినప్పటినుంచీ ఇరుదేశాల మధ్య సంబంధాలు దిగజారుతూ వస్తూనే ఉన్నాయి.
ట్రూడో ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, ఆయన నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అప్పట్లోనే భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ ట్రూడో మాత్రం తన ఆరోపణలను మళ్లీ మళ్లీ లేవనెత్తుతూనే ఉన్నారు. తాజాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు దౌత్య అధికారుల బహిష్కరణ స్థాయికి చేరుకోవడం తెలిసిందే.
అయితే ఇంటెలిజన్స్ సమాచారం ఆధారంగానే ట్రూడో ఈ ఆరోపణలు చేస్తున్నారు తప్ప కెనడా ప్రభుత్వం వద్ద ఎలాంటి పక్కా సాక్ష్యాధారాలు లేవన్నది భారత్ తొలినుంచీ చేస్తున్న వాదన. భారత్ చేస్తున్న వాదనను బలపరిచే విధంగా ఇప్పుడు ట్రూడో వ్యాఖ్యలు చేయ డం గమనార్హం.
నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజంట్ల పాత్ర ఉందని తాను గతంలో ఆరోపణలు చేసినప్పుడు తన వద్ద నిఘా సమాచారం తప్పిస్తే పక్కా ఆధారాలేవీ లేవని ట్రూడో అంగీకరించారు. కెనడా ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో విదేశాల జోక్యంపై విచారణ నిర్వహిస్తున్న కమిటీ ముందు హాజరయిన ట్రూడో ఈ విషయాన్ని ధ్రువపర్చారు. అయితే ఈ సందర్భంగా ఆయన భారత్‌పై మరోసారి అభ్యంత రకరమైన ఆరోపణలు చేశారు.
భారత ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కార్‌తో విభేదించే కెనడా వారి వివరాలను తమ దేశంలోని భారత దౌత్యవేత్తలు సేకరించి ఉన్నతస్థాయిలోని వారికి, లారెన్స్ బిష్ణోయ్ వంటి నేరగాళ్ల ముఠాలకు చేరవేస్తున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాగా ట్రూడో తాజా వ్యాఖ్యలపై భారత్ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చింది.
నిజ్జర్ హత్య కేసు విషయంతో తాము ఎంతో కాలంగా చెప్తున్నదే ఇప్పుడు రుజువైందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. మన దౌత్యవేత్తలపై చేస్తున్న తీవ్ర ఆరోపణలకు మద్దతిచ్చేలా కెనడా మనకు ఎలాంటి ఆధారాలను ఎప్పుడూ ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య సంబంధాలు ఇంతగా దిగజారడానికి కెనడా ప్రధాని ట్రూడోనే పూర్తి బాధ్యుడని కూడా ఆయన స్పష్టం చేశారు.
అంతేకాదు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేయాలని, తమకు అప్పగించాలని భారత్ అనేకసార్లు కెనడాకు విజ్ఞప్తి చేసిందని, అయినా తమ ఆందోళనలను కెనడా పట్టించుకోలేదని, ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీనివెనక రాజకీయ ఉద్దేశం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. నేరస్థుల అప్పగింతకు సంబంధించి ఇప్పటివరకు 26 విజ్ఞప్తులు కెనడా వద్ద పెండింగ్‌లో ఉన్నాయని కూడా ఆయన వివరించారు.
ఇదంతా చూస్తే ట్రూడో కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. పంజాబ్ తర్వాత అత్యధికంగా సిక్కు లుండే దేశం కెనడానే. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ట్రూడో విజయం సాధించాలంటే వీరి మద్దతు చాలా మఖ్యం. అందుకే గతంలో భారత్ వచ్చినప్పుడు ట్రూడో అమృత్‌సర్‌లోని సిక్కుల పుణ్య క్షేత్రమైన స్వర్ణ దేవాలయాన్ని కూడా సందర్శించారు.
అలాగే తన మంత్రివర్గంలో నలుగురు సిక్కులకు చోటు కల్పించారు. మోదీ ప్రభుత్వంలోకంటే తన ప్రభుత్వంలోనే ఎక్కువ మంది సిక్కులున్నారని అప్పట్లో ట్రూడో చెప్పుకొన్నారు. ఇప్పటికే పూర్తి దిగజారిపోయిన తన ప్రతిష్టను పెంచుకుని ఎలాగైనా ఎన్నికల్లో గెలవడానికే ట్రూడో ఇదంతా చేస్తున్నారని ఆయన మాటలు, చర్యల వల్ల స్పష్టమవుతోంది.
కెనడాలో భారీ సంఖ్యలో ఉన్న భారతీయ ఓటర్లు రాబోయే ఎన్నికల్లో దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఈలోగా ఇరుదేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు చల్లారతాయా లేక మరింత పెరుగుతాయా? అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. మరోవైపు అక్కడ పైచదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన పెరుగుతోంది.