calender_icon.png 16 October, 2024 | 2:25 PM

ట్రూడో స్వీయ నాశనం

16-10-2024 03:57:44 AM

ఖలిస్థానీల కోసం భారత్‌తో కయ్యం.. త్వరలో కెనడా ఎన్నికలు

సిక్కుల ఓట్లకోసం పడరాని పాట్లు.. పడిపోయిన ట్రూడో గ్రాఫ్

20 శాతం మద్దతు కూడా లేని నేత

భారత్‌పై ఆరోపణలతో మద్దతు పొందే ఎత్తు

తాజాగా తెరపైకి బిష్ణోయ్ గ్యాంగ్

* హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యకేసులో భారత్‌కు బలమైన ఆధారాలు అందించామన్న కెనడా అధికారుల వాదనలో నిజం లేదు. అస్పష్టమైన ఆధారాలు ఇవ్వటం, వాటిని తిరస్కరిస్తే భారత్‌పై ఆరోపణలు చేయటం కెనడాకు అలవాటుగా మారింది. భారత ఏజెంట్లు నేర ముఠాలను ఉపయోగించుకొని కెనడా పౌరులను చంపుతున్నారన్న ఆ దేశ పోలీసుల వాదనను బలపరిచే ఎలాంటి ఆధారాలను మాకు ఇవ్వలేదు. ట్రూడో ప్రభుత్వ వాదన అసంబద్ధం.

భారత విదేశాంగశాఖ

* భారత ప్రభుత్వ ఏజెంట్లు మా దేశంలో ప్రజా భద్రతకు ప్రమాదం తలపెట్టారు. రహస్య ఆపరేషన్లు చేస్తూ దక్షిణాసియాకు చెందిన కెనడా పౌరులను టార్గెట్ చేశారు. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ విభాగం వద్ద ఇందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలున్నాయి. ఈ చర్యలు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను ప్రభావితం చేస్తాయి.

 కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ‘ఎన్నికల’ తిప్పలు భారత్ కెనడా మధ్య సంబంధాలను రోజురోజుకూ దిగజారుస్తున్నాయి. భారత ప్రభుత్వ ఏజెంట్లే తమ దేశంలో అరాచకం సృష్టించి, ప్రజా భద్రతకు ప్రమాదం కలిగిస్తున్నారని ఆయన సోమవారం చేసిన ప్రకటన తీవ్ర వివాదానికి దారి తీసింది.

గత ఏడాది హత్య కు గురైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్‌ను ఆయన దేశభక్తుడని పొగడటం దగ్గర నుంచి నిజ్జర్ హత్యలో భారత దౌత్యవేత్తల హస్తం ఉందని ఆరోపణలు చేసే వరకు ట్రూడో దుందుడుకు, మతిలేని చర్యలతో రెండు దేశాల మధ్య లేని వివాదాన్ని రాజేశారు.

అయితే, ట్రూడో పక్కా ప్రణాళికతోనే ఇలాం టి ప్రకటనలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కెనడా ప్రజ ల్లో ట్రూడో పై అభిమానం పూర్తిగా తగ్గిపోయిందని, త్వర లో జరిగే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం లేదని అర్థమయ్యే భారత్‌పై ఆరోపణలు చేసి ప్రజల సానుభూతి పొందాలని చూస్తున్నట్లు చెప్తున్నారు.

తెరపైకి బిష్ణోయ్ గ్యాంగ్

నిజ్జర్ హత్యకేసులో కెనడాలోని భారత రాయబారుల హస్తం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించిన మరుసటి రోజే ఆ దేశ పోలీసులు మరో అడుగు ముందుకేసి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగుతో భారత ఏజెంట్లు తమ దేశంలో సిక్కు నాయకులను చంపుతున్నారని ఆరోపించారు. భారత్‌పై ఆంక్షలు విధిస్తామని ఆ దేశ విదేశాంగమంత్రి పరోక్షంగా హెచ్చరించారు.

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసును విచారిస్తున్న రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సీఎంపీ) విభాగం ఈ ప్రకటన చేసింది. తమ దేశంలో భారత ప్రభుత్వం నేరుగా మారణహోమానికి పాల్పడుతున్నదని తీవ్ర ఆరోపణలు చేసింది. నిజ్జర్ హత్య కేసులో కెనడాలో భారత దౌత్యవేత్త సంజ య్ వర్మను కూడా చేర్చిన విషయం తెలిసిం దే. ‘

భారత ప్రభుత్వ ఏజెంట్లు వారికి కావాల్సిన సమాచారం సేకరించేందుకు కెనడా లోని వివిధ సంస్థలతోపాటు ఇతర దేశాల్లోని వ్యక్తులను కూడా వాడుకొంటున్నారని ఆధారాలు కనిపిస్తున్నాయి. కొందరు వ్యకుతలు, వ్యాపార సంస్థలను బెదిరించి భారత ప్రభుత్వంకోసం పనిచేసేలా ఒత్తిడి తెచ్చారు.

ఇలా భారత ప్రభుత్వం కోసం సేకరించిన సమాచారాన్ని దక్షిణాసియాకు చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకొనేందుకు వాడుతున్నారు’ అని ఆర్‌సీఎంపీ ఆరోపించింది. కెనడాలోని సిక్కులనే భారత ఏజెంట్లు టార్గెట్ చేశారా? అన్న ప్రశ్నకు ఆర్‌సీఎంపీ అసిస్టెంట్ కమిషనర్ బ్రిగిట్టీ గౌవిన్ సూటిగా సమాధానమివ్వలేదు. ‘ఆర్‌సీఎంపీ ఉద్దేశంలో వాళ్లు (భారత ఏజెంట్లు) వ్యవస్థీకృత నేరగాళ్లను వాడుకొంటున్నారు.

ఈ నేరాలను బహిరంగంగా ఒక వ్యవస్థీకృత నేర ముఠా తనమీద వేసుకొంటున్నది. అదే బిష్ణోయ్ గ్రూప్. ఈ గ్రూప్‌తో భారత ప్రభు త్వ ఏజెంట్లకు సంబంధాలున్నాయని మేం నమ్ముతున్నాం’ అని పేర్కొన్నారు. సోమవా రం మీడియాతో మాట్లాడిన కెనడా ప్రధాని భారత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. నిజ్జర్ హత్య కేసు విచారణకు భారత ప్రభుత్వం సహకరించటంలేదని ఆరోపించారు. 

కెనడాకు ఇది అలవాటే..

ఆర్‌సీఎంపీ ప్రకటనపై భారత విదేశాంగశాఖ తీవ్రంగా స్పందించింది. పసలేని ఆధారాలు ఇవ్వటం, వాటిని తిరస్కరిస్తే ఆరోపణలు చేయటం కెనడాకు అలవాటుగా మారిందని మండిపడింది. కచ్చితమైన ఆధారాలుంటే తమకు అందించాలని మరోసారి డిమాండ్ చేసింది. నిజ్జర్ హత్యపై కెనడాలోని భారత హైకమిషనర్‌తో ఆ దేశ అధికారులు గత ఏడాది చర్చలు జరిపారని, ఇప్పుడు ఆయననే నేరస్తుడిగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది.

సిక్కు ఓట్ల కోసమే..

కెనడాలో సిక్కు ఓటర్లు 7.7 లక్షల మంది ఉన్నారు. సిక్కు నాయకుడు జగ్మీత్‌సింగ్ నేతృత్వం వహించే న్యూ డెమోక్రాటిక్ పార్టీ కూడా ఉన్నది. గత నెల వరకు ట్రూడో ప్రభుత్వానికి ఈ పార్టీ మద్దతిచ్చింది. జగ్మీత్‌సింగ్ ఖలిస్థానీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు.

ఈసారి సిక్కుల్లో దాదాపు 80 శాతం మంది కన్జర్వేటివ్ పార్టీకి ఓటేయాలని నిర్ణయించినట్లు రెండు నెలల క్రితం విడుదలైన ఓ సర్వేలో తేలింది. దీంతో ట్రూడో వెంటనే నిజ్జర్ కేసును తెరపైకి తెచ్చా రు.  అటు జగ్మీత్‌సింగ్ మద్దతు పొందటంతోపాటు సిక్కుల ఓట్లు రాబట్టుకోవచ్చని ఆయన అతి తెలివి ప్రదర్శిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. 

విఫల ప్రధాని

ట్రూడో పాలనలో ప్రజల జీవన వ్యయం అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయింది. నేరాలు అదుపు తప్పాయి. ప్రజలకు సరిపడా ఇండ్లు కూడా లేక ఇబ్బందులు పడు తున్నారు. వైద్య సదుపాయాల కొరత వేధిస్తున్నది. దీంతో ప్రజల్లో ట్రూడో ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అది ఇటీవలి ఎన్నికల్లో బహిర్గతమైంది. గత నెలలో జరిగిన మాంట్రియల్ ఎన్నికల్లో లిబరల్ పార్టీ ఓడిపోయింది.

ఈ స్థానం లిబరల్ పార్టీకి కంచుకోటలాంటిది. జూలై ప్రత్యేక ఎన్నికల్లో టొరంటోలోనూ ఓటమే ఎదురైంది. ఇక్కడ లిబరల్ పార్టీ 20 ఏండ్లుగా గెలుస్తూ వస్తున్నది. ట్రూడో పార్టీ వరుస ఓటములు తనకు ఎక్కడ చుట్టుకొంటాయోనని భయపడిన న్యూ డెమోక్రాటిక్ పార్టీ గత నెలలో ట్రూడో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. నిజానికి ఈ పార్టీని బుజ్జగించేందుకే ట్రూడో భారత్‌తో కయ్యానికి దిగారు.   

ఓటమి ఖాయమని తెలిసి

కెనడాలో జస్టిన్ ట్రూడో 2015 నుంచి అధికారంలో ఉన్నారు. ఆయన మొదటిసారి అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే ప్రజలకు ఆయనపై అభిమానం పోయింది. ట్రూడో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇటీవల ఆయన సొంత పార్టీ నేతలే ప్రధానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారంటే ట్రూడో పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థంచేసుకోవచ్చు.

వచ్చే ఏడాది అక్టోబర్‌లో కెనడా పార్లమెంటుకు ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం ఆయన నేతృత్వం లోని లిబరల్ పార్టీకి పూర్తి మెజారిటీ లేదు. సంకీర్ణ ప్రభుత్వాన్ని పడుతూ లేస్తూ నెట్టుకొస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత లిబరల్ పార్టీ బలం తగ్గిపోయి చిన్నపార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. 2020లో ట్రూడో ఒంటెత్తు పోకడలు నచ్చక ఆర్థికమంత్రి బిల్ రాజీనామా చేసి వెళ్లిపో యారు.

పూర్తి మెజారిటీ వస్తుందని ఆశించి 2021లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి మరింత దిగజారిపోయారు. మరోసారి మైనారిటీ ప్రభుత్వాన్నే ఏర్పాటుచేయాల్సి వచ్చింది. గత జూలైలో నిర్వహించిన ఎన్నికల్లో కూడా లిబరల్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.

ఇటీవల విడుదలైన ఇపాస్ సర్వేలో ట్రూడోకు 26 శాతం మంది మద్దతు మాత్రమే ఉన్నదని తేలింది. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ నేత పెర్రీ పోయిలీవ్రేకు ట్రోడోకంటే చాలా ఎక్కువగా 45 శాతం ప్రజల మద్దతు లభించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థం చేసుకొన్న ట్రూడో నిజ్జర్ హత్య కేసును తెరపైకి తెచ్చి లాభం పొందాలని ఎత్తులు వేస్తున్నారు.