- వేములవాడ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటుకు శ్రీకారం
- రూ.4.50 కోట్లతో పనులు ప్రారంభం
- నిధుల కొరతతో రెండేళ్లుగా నిలిచిన పనులు
- రోడ్లపైనే విక్రయిస్తున్న చేస్తున్న రైతులు, వ్యాపారులు
- కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్న వైనం
సిరిసిల్ల, నవంబర్ 17(విజయక్రాంతి): వ్యాపారులు, రైతులకు ఆధునికి హంగులతో కూరగాయల మార్కెట్ నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతున్నది. వేములవాడ పట్టణంలోని మార్కెట్ యార్డులో రూ.కోట్ల వ్యయంతో నిర్మాణానికి శ్రీకారం చుట్టినా.. నిధుల కొరతతో పనులు ముందుకు సాగడం లేదు.
ఇంటిగ్రేటెడ్ పనులు రెండేళ్లుగా అసంపూర్తిగా ఉండడంతో, రైతులు, వ్యాపారులు రోడ్లపైనే కూరగాయాలను విక్రయిస్తున్నారు. వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీలో 2022 మార్చి 5న రూ.4.50 కోట్లతో ‘ఇంటిగ్రేటెడ్’ పనులను ప్రారంభించగా స్లాబ్ వరకు వచ్చి నిలిచిపోయాయి. యార్డ్ నిర్మాణానికి అంచనాలకు మించి ఖర్చవుతుండడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడు.
గత ప్రభుత్వ హయాంలో అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు పంపినా ఫలితం లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పైనే రైతులు, వ్యాపారులు ఆశలు పెట్టుకున్నారు. పట్టణంలోని వంతెన నుంచి కోరుట్ల వైపు వెళ్లె రెండో బైపాస్ రోడ్డు పక్కన అసౌకర్యాల మధ్య రైతులు కూరగాయలను విక్రయిస్తున్నారు.
వేములవాడకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు నిత్యం వస్తుంటారు. ఇక్కడ కూరగాయలను విక్రయించేందుకు వేములవాడ రూరల్, అర్బన్ మండలాలతో పాటు బోయినపల్లి, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి మండలాల నుంచి రైతులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే ఈ ప్రాంతంలో కనీస వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు లేక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా రైతుల కష్టాలైతే వేరే చెప్పనక్కరలేదు. ప్రతి యేటా మున్సిపల్‌శాఖకు తైబజా ర్ పేరిట రూ.20లక్షల ఆదాయం సమకూరుతోంది. తైబజార్ పొందిన కాంట్రాక్టర్ కూర గాయలు విక్రయించే వారి నుంచి నిత్యం రూ.20ల నుంచి రూ.50 వరకు వసూల్ చేస్తున్నాడు కానీ.. అధికారులు మాత్రం సౌకర్యాల కల్పనలో చొరవ చూపడం లేదని వ్యాపారులు వాపోతున్నారు.
మొదట వచ్చిన వారికే అనువైన స్థలం దొరకడం, కొన్ని సందర్భాల్లో స్థలం కోసం కుస్తీలు పట్టుకున్న ఘటనలూ లేకపోలేదు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌యార్డ్ పనులు పూర్తి అయ్యే వరకు కూరగాయలు విక్రయించేందుకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు.