calender_icon.png 7 March, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తా

07-03-2025 01:16:00 AM

ఒకరి మృతి.. 25 మందికి గాయాలు

జనగామ, మార్చి 6(విజయక్రాంతి): కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ ట్రాలీ ఆటో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడడంతో ఒకరు మృతిచెందగా.. 20 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపురం శివారులో గురువారం జరిగింది. వివరాల్లోకెలితే.. వరంగల్ జిల్లాలోని జీడిగడ్డతండా, ఉప్పరపల్లి తండా నుంచి నర్సంపేట మండలం ఇటుకాలపల్లికి కొన్ని రోజులుగా మిర్చి ఏరేందుకు కూలీలు వెళ్తున్నారు.

రోజులాగే గురువారం 50 మంది కూలీలు ఆ గ్రామాల నుంచి టాటా ఏస్ ట్రాలీ ఆటోలో ఇటుకాలపల్లికి బయల్దేరారు. ఈ క్రమంలో చెన్నారావుపేట మండలం కోనాపురం శివారులో ట్రాలీ ఆటో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జీడిగట్టుతండాకు చెందిన భూక్య జాటోనాయక్(65) మృతిచెందగా.. నలుగురి పరిస్థితి విషమంగా మారింది. మరో 25 మందికి గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిన నలుగురిని వరంగల్ ఎజీఎంకు పంపించారు. ఈ రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ట్రాలీలో పరిమితికి మించి కూలీలు వెళ్లడంతో పాటు, అతి వేగంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.