21-02-2025 12:00:00 AM
రంగం ఏదైనా వారసులు రావడం అనేది సర్వసాధారణం. హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇలా సినీ ఇండస్ట్రీలో రాణించినవారు తమలాగే తమ పిల్లలు కూడా రాణించాలనుకుంటారు. అటువైపు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తుంటారు. అయితే చాలా మంది వారసులు నటులుగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు. మిగతా ఏ క్రాఫ్ట్‌లోనూ సినీప్రముఖుల వారసులు కనిపించటం చాలా అరుదు. అయితే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ కూడా తండ్రి బాటలోనే దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు.
ఈ విషయమై గతంలో త్రివిక్రమ్ భార్య సాయిసౌజన్య తన కొడుకు రిషి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. రిషీ డైరెక్షన్‌పై శ్రద్ధ చూపుతున్నాడని, ఫిల్మ్ మేకింగ్‌పై శిక్షణ తీసుకుంటున్నట్టు కూడా చాలా రోజుల క్రితమే ఆమె తెలిపారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రిషి మనోజ్ ఇండస్ట్రీకి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి దగ్గర శిక్షణ తీసుకుంటుండగా, త్వరలోనే సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్ టీమ్‌లో చేరతాడని సమాచారం. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.