06-03-2025 07:58:42 PM
డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి ప్రత్యేక పూజలు..
గజ్వేల్: మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ లో గురువారం త్రిశక్తి విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగింది. వేద పండితులు రాజశేఖర శర్మ నేతృత్వంలో శ్రీ మహంకాళమ్మ, శ్రీ పెద్దమ్మ, శ్రీ నల్ల పోచమ్మ విగ్రహాలను ప్రతిష్టించడంతో పాటు ప్రాణ ప్రతిష్ట, నేత్రోన్మిలనం, మహా నైవేద్యం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు భక్తులను కనువిందు చేశాయి. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేవీ దేవతల విగ్రహాల ప్రతిష్టతో గ్రామాల్లో భక్తి, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా భగవాన్ నామస్మరణతో మానసిక ప్రశాంతత దక్కుతుందని, తద్వారా ముక్తికి మార్గం లభిస్తుందని అన్నారు. గ్రామ దేవతల చల్లని చూపుతో ప్రజలు పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వూడెం సారిక శ్రీనివాస్ రెడ్డి, సత్యం, ప్రభాకర్, రాజలింగం, రమేష్ గౌడ్, రాములు గౌడ్, కన్నా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.