28-01-2025 04:28:49 PM
కౌలాలంపూర్,(విజయక్రాంతి): మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్(Under-19 Women's T20 World Cup)లో భారత జట్టు ఆధిపత్యాన్ని సాధించింది. స్కాట్లాండ్‌తో జరిగిన సూపర్ సిక్స్ దశ మ్యాచ్‌లో, టీమ్ ఇండియా 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష(Telugu Cricketer Gongadi Trisha) ఆల్ రౌండ్ ప్రదర్శనతో అద్భుతమైన సెంచరీ సాధించి చరిత్ర సృష్టించింది. అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచింది. త్రిష బౌలింగ్ లోనూ కిలకమైన మూడు వికెట్లు పడగొట్టింది.
తెలంగాణలోని భద్రాచలం చెందిన గొంగడి త్రిష(Gongadi Trisha) కేవలం 53 బంతుల్లోనే సెంచరీ సాధించింది. ఆమె 59 బంతుల్లో 110 పరుగులు చేసి, 12 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా నిలిచింది. త్రిష టీమ్ ఇండియా తరఫున ఇన్నింగ్స్‌ను ప్రారంభించి, మ్యాచ్‌ను నిర్వచించే ప్రదర్శన ఇచ్చింది. త్రిష ఓపెనింగ్ పార్టనర్ కమలిని కూడా ప్రశంసనీయమైన ఇన్నింగ్స్ ఆడింది. 42 బంతుల్లో తొమ్మిది బౌండరీలతో సహా 51 పరుగులు చేసింది. భారత మహిళా జట్టు ఇప్పటికే టోర్నమెంట్‌లో సెమీఫైనల్లో చోటు దక్కించుకుంది. సూపర్ సిక్స్ దశలో స్కాట్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్ చివరిది. భారతదేశం నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, స్కాట్లాండ్ చాలా ఇబ్బంది పడింది. 10 ఓవర్లు ముగిసే సమయానికి, కేవలం 43 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ, చెరో మూడు వికెట్లు తీశారు.