నెహ్రూ కప్ వ్యవస్థాపకులు..
తోటమల్ల బాలయోగి, వాతాడి దుర్గా అశోక్..
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష(Gongadi Trisha) అద్వితీయమైన ప్రతిభతో ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్(Under-19 World Cup) భారత్ వశం అయిందని నెహ్రూకప్ జాతీయస్థాయి క్రికెట్ టోర్నమెంట్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి, వాతాడి దుర్గ అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన ఆల్ రౌండ్ ప్రతిభతో వరల్డ్ కప్ లో తనదైన శైలిలో బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో రాణించి ఒంటి చేత్తో త్రిష ఇండియాను గెలిపించిందని వ్యాఖ్యానించారు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని ఈ టోర్నమెంట్ లో త్రిష సాధించిందని, మొత్తంగా 300 పైగా పరుగులు, 7 వికెట్లు తీయటం గొప్పదైన విషయం అన్నారు. ప్రపంచ పటంలోనే భద్రాచలం ఖ్యాతి ఇనుమడింప చేసే విధంగా త్రిష క్రికెట్లో రాణించటం సంతోషంగా ఉందన్నారు.
గత 30 ఏళ్లుగా భద్రాచలం ఏజెన్సీలో నెహ్రూ కప్ క్రికెట్ పోటీలు(Nehru Cup Cricket Competitions) నిర్వహిస్తున్నామని, ఈ టోర్నమెంట్ త్రిష లాంటి యువతి, యువకులకు ప్రేరణగా నిలవటం, తద్వారా వారు క్రికెట్లో రాణించటం ఎంతో ఆనందాన్నిస్తోందన్నారు. త్రిష లాంటి క్రికెటర్ ను ఆదర్శంగా తీసుకొని యువతి, యువకులు క్రికెట్లో రాణించి ముందుకు సాగాలని తోటమల్ల బాలయోగి, వాతాడి దుర్గా అశోక్ ఆకాంక్షించారు. క్రికెట్లో విశేషంగా రాణిస్తున్న భద్రాచలం అమ్మాయి గొంగటి త్రిషకు తండ్రి జిమ్ రాంరెడ్డి, వారి సతీమణి చేసిన సేవలు ప్రశంసనీయమని ఈ సందర్భంగా వారిని అభినందించారు. గొంగడి త్రిష రానున్న రోజుల్లో భారత జట్టు కెప్టెన్ గా ఎదగాలని అందుకు కావలసిన శక్తి యుక్తులు భద్రాద్రి రాముడు ప్రసాదించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ సందర్భంగా గొంగడి త్రిషకు భద్రాచలం పట్టణ వాసులు పట్టణ ప్రముఖులు శ్రేయోభిలాషులు క్రికెట్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.