12-03-2025 12:56:23 AM
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): రాష్ర్టంలో పెండింగ్‌లో ఉన్న ప లు జాతీయ రహదారులు, రీజినల్ రింగ్ రోడ్డు, విజయవాడ హైవే 6 లేన్ పనులు, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ సహా మామునూరు ఎయిర్‌పోర్టు పనులు త్వరగా చేప ట్టాలని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమావేశమయ్యారు.
మంగళవారం ఢిల్లీలో కీలకమైన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కేంద్రమం త్రులను కలిసి ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట రాష్ట్రానికి చెందిన ఎంపీలు, అధికారులు ఉన్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణం, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ (ఎన్ హెచ్- 765), పర్వత్‌మాల పథకం కింద 5 రోప్‌వే ప్రాజెక్టుల మంజూ రు, సీఆర్‌ఐఎఫ్-సేతుబంధు పథకం కింద 12 ప్రాజెక్టుల మంజూరు, ఎన్‌హెచ్- 65 లోని హైదరాబాద్-- విజయవాడ విభాగం 6 లేనింగ్ పనులు, ఎన్‌హెచ్-163లోని హైదరాబాద్-- మన్నెగూడ విభాగం 4 లేనింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయడం వంటి 5 ప్రధాన అంశాలతో కూడిన అభ్యర్థనలను నితిన్ గడ్కరీకి అందించారు.
రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తొందరగా లభించేలా చూడాలని గడ్కరీని కోరారు. రెండు నెలల్లో రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పూర్వపనులు పూర్తిచేసి పనులు ప్రారంభించేలా చూస్తామని ఆయన హామీఇచ్చారు.
ఉత్తర భాగా నికి సంబంధించి పీపీపీఏసీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అప్రైజల్ కమిటీ), క్యాబినెట్ ఆమోదంపై గడ్కరీని కోరారు. ఆర్థిక త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం, అటవీ అనుమ తులను వేగవంతం చేయాలని అభ్యర్థించారు. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం యొక్క అలై న్‌మెంట్‌ను ఫైనలైజ్ ప్రకటన చేస్తూ.. ఆమో దం తెలపాలని కోమటిరెడ్డి కోరారు.
శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ త్వరగా చేపట్టండి..
హైదరాబాద్-శ్రీశైలం హైవే 187 కి.మీ. రహదారిలో 62 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు అంగీకరించాలని విజ్ఞ ప్తి చేశారు. ఎలివేటెడ్ కారిడార్ మార్గంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ గుండా వెళ్తుండటంతో.. అటవీ అనుమతుల విషయంలో చొరవ చూపాలన్నారు. శ్రీశైలం ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసం కేంద్రప్రభుత్వమే హైదరాబాద్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌ను ప్రతిపాదించిన విషయా న్ని గడ్కరీకి గుర్తుచేశారు.
ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ ప్రగతిలో ఆలస్యం జరగకుండా అనుమతులు మంజూరు చేయాలన్నారు. హైదరాబాద్- నాగర్‌కర్నూలు- కొల్లాపూర్- నంద్యాల మార్గంలో సోమశిల కేబుల్ బ్రిడ్జి టెండర్లు త్వరగా పిలుస్తామని ఈ సందర్భంగా గడ్కరీ తెలిపారు.
పర్వత్‌మాల ప్రాజెక్టులు ఇవ్వండి..
పర్వత్‌మాల పథకం కింద 5 రోప్‌వే ప్రాజెక్టులు మంజూరు చేయాలని కోమటిరెడ్డి విజ్ఞప్తిచేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనర సింహస్వామి ఆలయానికి 2 కి.మీ., భువనగిరి కోటకు 1 కి.మీ., నల్గొండ పట్టణంలోని హనుమాన్‌కొండ 2 కి.మీ, మంథనిలోని రామగిరి కోట 2కి.మీ, నాగార్జునసాగర్ ఆనకట్ట మీదుగా 5 కి.మీ. నాగార్జునకొండను కలుపుతూ రోప్‌వేలను నిర్మించాలన్నారు. సీఆర్‌ఐఎఫ్- -సేతుబంధన్ కింద రూ.887.45 కోట్ల 12 రహదారి పనులను మంజూరు చేయాలని సీఎం రేవంత్ లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు.
మామునూరును త్వరగా చేపట్టండి..
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడితో మంత్రి కోమటిరెడ్డి
మామునూరు ఎయిర్‌పోర్టు మంజూరుపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడికి మంత్రి కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రూ.205 కోట్లను మంజూరు చేసి భూసేకరణ చేస్తున్న విషయం, రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారని ఆయనకు తెలిపారు. మామునూరు ఎయిర్ పోర్టుకు 15 రోజుల్లో భూసేకరణ పూర్తవుతుందన్నారు.
ఇందుకు స్పందించిన కేంద్రమంత్రి... రెండున్నరేళ్లలో మామునూరు ఎయిర్‌పోర్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించిన ఐఎండీ సర్వేపూర్తి చేసి ఫిజిబిలిటీ స్టడీ చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టులకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ సర్వే చేయనుందని తెలిపారు.
మంత్రితో పాటు ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాంరెడ్డి, నాగర్‌కర్నూలు ఎంపీ మల్లు రవి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నల్గొండ ఎంపీ కుందూర్ రఘువీర్‌రెడ్డితో పాటు ఆర్‌అండ్‌బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన ఉన్నారు.