calender_icon.png 23 October, 2024 | 7:51 AM

7 ట్రిలియన్ డాలర్లకు డిజిటల్ చెల్లింపులు

15-07-2024 12:05:00 AM

న్యూఢిల్లీ, జూలై 14: భారత్‌లో రిటైల్ డిజిటల్ చెల్లింపులు 2030 సంవత్సరానికల్లా రెట్టింపు అవుతాయని, 7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటాయని కీర్నే, అమెజాన్ పే సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో అంచనా వేశారు. ఆన్‌లైన్ కొనుగోళ్లకు డిజిటల్ చెల్లింపుల విధానం అమలవుతున్నందున, వినియోగదారులు శాశ్వతంగా ఆ విధానానికి అలవాటు పడిపోతారని అధ్యయనం పేర్కొన్నది. సర్వేలో పాల్గొన్న 90 శాతం మంది వినియోగదారులు ఆన్‌లైన్ కొనుగోళ్లు జరిపేటపుడు డిజిటల్ చెల్లింపులకే మొగ్గుచూపుతున్నట్టు తెలిపారు. తమ లావాదేవీల్లో 80 శాతం చెల్లింపులకు వివిధ డిజిటల్ చెల్లింపు విధానాల్ని అవలంబిస్తున్నట్టు పేర్కొన్నారు. మిల్లీనియల్స్, జెన్‌ఎక్స్ వినియోగదారులు అన్ని రకాల డిజిటల్ చెల్లింపు సాధనాల్ని ఉపయోగిస్తున్నారని, పురుషులైనా, మహిళలైనా వారి లావాదేవీల్లో 72 శాతం డిజిటల్ చెల్లింపులే చేస్తున్నట్టు అధ్యయనం లో తేలింది.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ చెల్లింపు పద్ధతులపై దేశవ్యాప్తంగా 120 నగరాల్లో  వివిధ ఆదాయ వర్గాలు, వివిధ వయస్సులవారితో కూడిన 6,000 మంది వినియోగదారులు, 1,000కుపైగా మార్చెంట్లతో సర్వే నిర్వహించినట్టు కీర్నే, అమెజాన్ పే పేర్కొన్నాయి. 2022లో 80 బిలియన్ డాలర్ల మేర ఉన్న భారత్ ఈకామర్స్ మార్కెట్ 2030 వరకూ 21 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్టు అధ్యయనం పేర్కొంది. గత ఐదేండ్లలో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరిగాయని, 2018 ఆర్థిక సంవత్సరంలో 300 బిలియన్ డాలర్లున్న ఈ చెల్లింపులు 2024 ఆర్థిక సంవత్సరానికి 3.6 ట్రిలియన్ డాలర్లకు చేరాయని, ఇవి 2030కల్లా రెట్టింపై 7 ట్రిలియన్ డాలర్ల స్థాయిని అందుకుంటాయని వివరించింది.