2036 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ.. పారిశ్రామిక రంగంలో భారీ వృద్ధి
ఆర్‌ఆర్‌ఆర్, ఫ్యూచర్ సిటీతో మ్యాజిక్.. సాగుకు ప్రభుత్వ సాయంతో ఊతం
రక్షణ రంగంలో టాప్.. 2036-37 నాటికి దేశ జీడీపీలో 10 శాతం వాటా
2036 నాటికి పది లక్షలు దాటనున్న తలసరి ఆదాయం
2024 డబ్ల్యూటీసీ తెలంగాణ గ్రోత్ నివేదిక
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం మరో పుష్కర కాలంలో గణనీయమైన ప్రగతిని సాధిస్తుందని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) అంచనా వేసింది. ౨౦౩౬ నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం అవతరిస్తుందని తెలిపింది. తెలంగాణ వృద్ధిరేటుపై 2024 ఏడాదికి సంబంధించిన నివేదికను శంషాబాద్‌లోని డబ్ల్యూటీసీ రూపొందించింది. 2004 నుంచి తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణ ఆర్థికంగా బలపడుతూ వస్తోందని పేర్కొంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీడీపీ 350 బిలియన్ డాలర్లు ఉండగా.. 2030 నాటికి అది రెట్టింపు అవతుందని అంచనా వేసింది. ఇదే కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏటా 1.5 శాతం పెరుగుతూ వస్తోందని.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల అది 2 శాతం కంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ వృద్ధి రేటు ఆధారంగానే తెలంగాణ 2036-37 నాటికి 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అంచనా వేసినట్టు వెల్లడించింది. 2024లో భారత జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం కాగా.. 2036 నాటికి ఇది 10 శాతం వరకు పెరగొచ్చని పేర్కొంది.
ఆర్‌ఆర్‌ఆర్, ఫ్యూచర్ సిటీ, మూసీతో మారనున్న రూపురేఖలు
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొన్ని కార్యక్రమాల వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని డబ్ల్యూటీసీ తెలిపింది. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్, ఫ్యూచర్‌సిటీతో రాష్ట్రం ఆర్థిక రంగం వేగంగా పుంజుకుంటుందని అంచనా వేసింది. కొత్త పరిశ్రమలను ఆకర్షించడానికి ఈ ఇవి దోహదపడుతాయని వెల్లడించింది. మూసీ రివర్ ఫ్రంట్ పునరాభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతాయని చెప్పింది. పెట్టుబడులు పెరగడం వల్ల తెలంగాణతో పాటు హైదరాబాద్ ఆర్థిక ముఖ చిత్రం మారుతుందని అంచనా వేసింది. కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, మెట్రో రైలు విస్తరణ, జాతీయ రహదారుల నిర్మాణం వంటి చర్యలు లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన ప్రగతిని సా ధించడానికి దోహదపడుతాయని చెప్పింది.
63 బిలియన్ డాలర్లకు ఐటీ రంగం
ఐటీ రంగంలో ప్రస్తుతం భారత్ ప్రపంచ శక్తిగా వెలుగొందుతోంది. దేశం ప్రపంచ లీడర్‌గా మారడానికి తెలంగాణ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని డబ్ల్యూటీసీ పేర్కొంది. 2023లో గ్లోబల్ ఐటీ సెక్టార్ మార్కెట్ విలువ 1,247 బిలియల్ డాలర్లు కాగా.. అందులో భారత్ వాటా 225 బిలియన్ డాలర్లు. అందులో తెలంగాణ వాటా 29 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. 2030 నాటికి ఐటీ సెక్టార్ మార్కెట్ విలువ 2,554 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఈ సంస్థ అంచనా వేసింది.
అందులో భారత్ వాటా 350 మిలియన్ డాలర్లు ఉండగా.. తెలంగాణ వాటా దాదాపు 63 బిలియన్ డాలర్లు ఉంటుందని జోస్య చెప్పింది. ఐటీ రంగంలో భారీ వృద్ధిని సాధించడానికి గల కారణాలను కూడా డబ్ల్యూటీసీ వెల్లడించింది. మానవ వనరులు, ఇతర మెట్రోపాలిటిన్ సీటీల కంటే తక్కువ జీవన వ్యయం, ఇన్నోవేషన్స్‌ను ప్రోత్సహించే టీ హబ్స్ లాంటి ఇంక్యుబేటర్లు ఐటీని పరుగులు పెట్టిస్తాయని పేర్కొంది.
గ్లోబల్ కంపెనీలకు గమ్యస్థానంగా తెలంగాణ
ఎంఎన్‌సీ కంపెనీల ఆవిష్కణలు, విస్తరణ కోసం గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్ల (జీసీసీ)ను ఏర్పాటు చేస్తాయి. తెలంగాణ జీసీసీలకు గమ్యస్థానంగా మారుతుందని నివేదిక పేర్కొంది. దేశంలో జీసీసీలకు ఇప్పటికే బెంగళూరు, పుణె, మంబైతోపాటు హైదరాబాద్ గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతోందని చెప్పింది.
ఫార్మా హబ్‌గా
ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణ తన అధిపత్యాన్ని భవిష్యత్‌లోనూ చలాయిస్తుందని డబ్ల్యూటీసీ పేర్కొంది. కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీలు, ఐసీటీ వంటి విద్యాలయాలు ఫార్మా రంగానికి కావల్సిన అత్యుత్తమైన మానవ వనరులను కొన్ని దశాబ్దాలుగా అందిస్తున్నాయని, అందుకే హైదారాబాద్ ఫార్మా రంగంలో పరిశోధన, వ్యాక్సిన్ల అభివృద్ధికి నిలయంగా మారిందని తెలిపింది. హైదారాబాద్ శివార్లలో ఫార్మాసిటీ ఏర్పాటు వంటి కొన్ని నిర్ణయాలు భవిష్యత్‌లో ఈ రంగం మరింత బలోపేతానికి దోహదపడుతుందని చెప్పింది.
ప్రభుత్వ సాయంతో వ్యవసాయం పండగ
2022 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాల ఆదాయం 26 బిలియన్ డాలర్లుగా ఉందని డబ్ల్యూటీసీ వెల్లడించింది. ఆ కాలంలో రైతులు ఆదాయం రెట్టింపు అయినట్లు చెప్పింది. వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొంది. ఇది భవిష్యత్‌లోనూ కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించింది. అలాగే, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, నిరంతరం విద్యుత్, రోడ్ల సౌకర్యం, ఆహార పరీక్షకేంద్రాలు, రైతులకు శిక్షణ కేంద్రాలు, రైతులకు అందిస్తున్న సాయం వ్యవసాయం రంగం అభివృద్ధికి దోహదపడుతుందని వెల్లడించింది.
ఏరోస్పేస్, రక్షణలో శక్తమంతమైన ఎకో సిస్టమ్
ఏరోస్పేస్, రక్షణ రంగంలో దేశంలో శక్తిమంతమైన ఎకో సిస్టమ్ తెలంగాణలో ఉంద ని డబ్ల్యూటీసీ పేర్కొంది. 2020 ఎఫ్‌డీఐ ఫ్యూచర్ ఏరోస్పెస్ సిటీస్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలిచిన విషయాన్ని నివేదిక ఉటంకిం చింది. ప్రస్తుతం తెలంగాణలో 12కుపైగా డీఆర్‌డీవో ల్యాబ్‌లు, డిఫెన్స్ పీఎస్‌యూ సంస్థలతో పాటు 25కు పైగా ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి. డిఫెన్స్‌కు సంబంధించిన వెయ్యికంటే ఎక్కువ ఎంఎస్‌ఎంఈలతో తెలంగాణ బలమైన కేంద్రంగా మారిందని డబ్ల్యూ టీసీ అభిప్రాయపడింది. హైదరాబాద్‌లో డిఫెన్స్‌కు అనుకూలమైన వాతావరం ఉన్న నేపథ్యంలో ఈ రంగం ఇక్కడ మరింత వృద్ధి చెందడానికి దోహదపడుతుందని చెప్పింది.
ఈ రంగాలు ఉపాధికి ఊతం
ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ ఎంఆర్‌వో, డ్రోన్స్, స్పెస్, ఏఐT ఎంఎల్ మార్కెట్లు తెలంగాణ భవిష్యత్‌కు మరింత ఉన్నతంగా దోహదపడుతాయని డబ్ల్యూటీసీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయా మార్కెట్లలో తెలంగాణ సత్తా చాటుతోందని చెప్పింది. ప్రభుత్వ నిర్ణయాలతో ఈ రంగాలు గణనీయంగా వృద్ధిని సాధిస్తాయని పేర్కొంది. తద్వారా ఆర్థిక వృద్ధి రేటు కూడా గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది. ఈ రంగాల వల్ల ఉపాధి కూడా భారీగా పెరుగుతుందని వెల్లడించింది.
రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదపడే ఆరు అంశాలు
1. ఐటీ, అనుబంధ రంగాలు
2. గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు (జీసీసీ)
3. ఫార్మా రంగం
4. వ్యవసాయం, అనుబంధం రంగాలు
5. ఏరోస్పేస్, డిఫెన్స్
6. భవిష్యత్‌లో వృద్ధిని వేగవంతం చేసే అంశాలు
2036లో తలసరి ఆదాయంలో
తెలంగాణ (రూ.లో)
సంవత్సరం దేశం తెలంగాణ
2024 2,08,708 3,49,387
2036 3,75,087 10,65,798