calender_icon.png 7 October, 2024 | 8:45 PM

కుమారి ఖండం నేపథ్యంలో త్రికాల

06-10-2024 12:00:00 AM

శ్రద్ధాదాస్, అజయ్, మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘త్రికాల’. రిత్విక్ సిద్ధార్థ్ సమర్పణలో మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు ‘స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ అనేది ట్యాగ్‌లైన్. మణి తెల్లగూటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాధికా శ్రీనివాస్ నిర్మాత. శ్రీసాయిదీప్ చాట్ల, వెంకట్మ్రేశ్ దాడి, ఓంకార్ పవన్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. అయితే, ప్రముఖ చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ.. ‘ఫాంటసీ, హారర్ జోనర్ మూవీగా కుమారి ఖండం (పురాతన తమిళ నాగరికత) నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని, నేటి కాలానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి సినిమాను తెరకెక్కిస్తున్నాం’ అని తెలిపారు.

సాహితి ఆవంచ, తనికెళ్ల భరణి, ఆమని, అర్జున్ అంబటి, షిఫ్ వెంకట్, జీవా, సూర్య, ఈటీవీ ప్రభాకర్ తదితరులు ముఖ్య తారాగణంగా ఉన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పవన్ చెన్నా; మ్యూజిక్: హర్షవర్ధన్ రామేశ్వర్; నేపథ్య సంగీతం: సాజిత్ హుమాయూన్; యాక్షన్: శంకర్, నందు, అంజి, డైమండ్ రత్నం.