calender_icon.png 25 January, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొడ్డి కొమురయ్యకు ఘన నివాళులు

05-07-2024 12:54:31 AM

  1. రాష్ట్రమంతటా వర్ధంతి కార్యక్రమాలు
  2. ట్యాంక్‌బండ్‌పై కొమురయ్య విగ్రహం
  3. ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రతిష్టాపనకు ప్రయత్నిస్తా
  4. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో/జనగామ, జూలై 4 (విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు బాసిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉద్ఘాటించారు. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ట్యాంక్‌బండ్‌పై కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. గురువారం రవీంద్రభారతిలో జరగిన దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనకు మంత్రి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి దొడ్డి కొమురయ్య పోరాటం ఇంధనంలా పనిచేసిందన్నారు.

నిజాం నిరంకుశత్వానికి, దేశ్‌ముఖ్‌ల వెట్టి, ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందారని కొనియాడారు. తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో మగ్గడం ఇష్టం లేక ఆయన విరోచిత పోరాటం చేశారని, ఆయన కీర్తి సజీవంగా ఉంటుందని చెప్పారు. ఆంధ్ర మహాసభ పిలుపు మేరకు యువకులంతా ఒక్కటై ఉద్యమిస్తే తట్టుకోలేక నిజాం సేనలు ఉద్యమకారులపై జరిపిన కాల్పుల్లో కొమురయ్య అసువులు బాసారని చెప్పారు. గత ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, కమిషనర్ బాలమాయాదేవి, చంద్రశేఖర్, అలోక్‌కుమార్, మల్లయ్యభట్టు, వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

ఉద్యమంలో తొలి అమరుడు

దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పా టు చేస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. జనగామలో కలెక్టరేట్ సమీపంలో విగ్రహ ఏర్పాటుకు రెండెకరాల స్థలాన్ని ఇస్తామని చెప్పారు. జనగామ పట్టణంలోని కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీర్ల ఐలయ్యతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. 19 ఏళ్ల వయసులో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన తొలి ఉద్యమ అమరుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు. నైజాం పాలనలో రజాకార్ల ఆగడాలపై ఎక్కుపెట్టిన బాణంలా దొడ్డి కొమురయ్య కొట్లాడారని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

దొడ్డి కొమురయ్యకు సీఎం, డిప్యూటీ సీఎం నివాళి

అసెంబ్లీ ఆవరణలో స్పీకర్, మండలి చైర్మన్ పుష్పాంజలి 

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి) : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాళి అర్పించారు. కొమురయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం, డిప్యూటీ సీఎం, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ తదితరులు నివాళి అర్పించారు. రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి దొడ్డి కొమురయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన పోరాట స్ఫూర్తిని కొనియాడారు. కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి నరసింహా చార్యులు, సీఎల్పీ కార్యదర్శి శ్రీకాంత్, చీఫ్ మార్షల్ కరుణాకర్,అసెంబ్లీ, మండలి ఉద్యోగులు పాల్గొన్నారు.