ఆమనగల్లు (విజయక్రాంతి): ప్రత్యేక తెలంగాణ సాకారంలో కేంద్ర మాజీమంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ దివంగత మహానేత సూదిని జైపాల్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని ఆమనగల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు కొనియాడారు. జైపాల్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్ లో గల స్ఫూర్తి స్థల్ వద్ద గుర్రం కేశవులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణలో సాధారణ పల్లె నుంచి ఢిల్లీ దాకా ఆయన ప్రస్థానంలో నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో, పార్లమెంటు ఉభయ సభల్లో బలమైన గళం వినిపించారని కేశవులు పేర్కొన్నారు, అలాంటి మహోన్నత వ్యక్తిని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నారు. ఆయన ఆశయాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకుపోవడంలో ప్రతి ఒక్కరూ పాటుపడాలని గుర్రం కేశవులు విజ్ఞప్తి చేశారు.