బెల్లంపల్లి, (విజయక్రాంతి): ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, మానవ హక్కుల కార్యకర్త దివంగత జి ఎన్ సాయిబాబాకు బెల్లంపల్లిలో మంగళవారం సాయంత్రం తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కన్వీనర్ టి. జైపాల్ సింగ్, ప్రజా కళా మండలి జిల్లా కన్వీనర్ ఆడేపు సమ్మయ్యలు ఘనంగా నివాళులర్పించారు. సాయిబాబాను సుదీర్ఘకాలం నిర్బంధించడంతోనే అనారోగ్యం పడ్డారని వారు ఆరోపించారు. 1997 లో వరంగల్ కేంద్రంగా ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్ష బహిరంగ సభను ప్రకటించడంలో సాయిబాబా ప్రత్యేకంగా కృషి చేశారన్నారు. 2014లో మహారాష్ట్ర పోలీసులు అక్రమ ఉపా కేసులు నమోదు చేసి 9ఏళ్లు అండ సెల్ లో నిర్బంధించారన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో నిరపరాధిగా బయటకు వచ్చిన ఆయన మానవ హక్కుల కార్యకర్తగా కొనసాగారని అన్నారు. సాయిబాబా మరణానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మానవ హక్కులను భరించి వేస్తున్న ఊప చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.