calender_icon.png 12 January, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలనచిత్రాల సృజనశీలి

25-12-2024 12:13:57 AM

భారతీయ సమాంతర సినిమా కు ఒక సాధికారిక రూ పం శ్యాం బెనెగల్. బెంగాల్‌లో మొదలయిన సమాంతర సినిమాని అసలు వాస్తవిక సినిమా ని పరిచయం చేసిన వారాయన. దో బిఘా జమీన్ లాంటి కొన్ని ప్రయత్నాలు జరిగినా సమాంతర సినిమాల ధోరణిని, పరంపరని చివరంటా కొనసాగించిన వ్యక్తి శ్యాంబెనెగల్. తన 90 వ జన్మదినం జరుపుకున్న పదిరోజులకే సెలవంటూ వెళ్లిపోయిన బెనెగల్ ఒక లెజెండ్ మాత్రమే కాదు హిందీ సినిమాల్లో  అసలయిన వాస్తవిక దృక్పథం తో ముందుకు సాగి విజయాలు సాధించిన దర్శకుడు.

అప్పటిదాకా హిందీ సినిమా రంగంలో హీరోలంటే ఆరడుగుల వాడు, అందమయినవాడు, సినిమా అంటే పాటలు ఊటీ ,కాశ్మీర్ లు అన్న భావన నెలకొని ఉంది. సినిమా అంటే ప్రేమ, విరహం, వివాదం అంతేకాదు యాంగ్రీ యంగ్ మాన్ భావన వుండేది. అలాంటి సమయంలో హీరో అంటే జీవితం కంటే ఎక్కువ అన్న భావన సరికాదు, హీరోఅన్న భావన కంటే ఆ పాత్ర ముఖ్యం. ఆ పాత్రంటే రక్తమాంసాలున్న మనిషి పాత్ర అన్న భావంతో హిందీ సినిమా రంగాన్ని మేల్కొల్పిన దర్శకుడు శ్యాం బెనెగల్. 

కేవలం పాత్రలు మాత్రమే కాదు కథ, కథనాల విషయంలో కూడా హిందీ సినిమా రంగానికి సరికొత్త దారివేసి గమ్యం నిర్దేశించిన వ్యక్తి శ్యాం బెనెగల్. దాంతో అప్పటిదాకా ఒక గ్లామర్ తో వెలుగు వెలుగుతున్న ప్రధానస్రవంతి హిందీ సినిమాకు సమాంతరంగా అర్థవంతమయిన నవ్య సినిమాను పరిచయం చేసిన మనిషి శ్యాం బెనెగల్. అప్పటికే బెంగాల్ లో రిత్విక్ ఘటక్, సత్యజిత్ రే, మృణాల్ సేన్ లాంటి వాళ్ళు సరికొత్త సమాంతర భారతీయ సినిమా పతాకాన్ని దేశ విదేశాల్లో ఎగురవేశారు. మరోపక్క  బిమల్ రాయ్ లాంటి వాళ్లు కళాత్మక, మధ్యేవాద సినిమాను ఆవిష్కరించారు.

కళాత్మక చిత్రాలకు శ్రీకారం

ఈ నేపథ్యంలో సత్యజిత్ రే ప్రభావం తో ఒక కొత్త గొంతుక అడ్వర్టైజ్‌మెంట్ సి న్మా రంగం నుంచి ఎగిసి వచ్చింది. ఆ స్వ రం శ్యాం బెనెగల్ ది. ‘చరణ్ దాస్ చోర్’ లాంటి సినిమాలతో రంగ ప్రవేశం చేసిన బెనెగల్ తన మొట్టమొదటి ఫీచర్ ఫిలిం కోసం తానే రాసుకున్న కథ ఆధారంగా ‘అంకుర్’ మొదలు పెట్టారు. సత్యదేవ్ దు బే తో మాటలు రాయించారు. తెలంగాణలోని ఫ్యూడల్ వ్యవస్థ, దాని వికృత రూ పాన్ని అంకుర్ లో దృశ్యీకరించారాయన.

అందులో లక్ష్మి పాత్రకి వహీదా రెహమా న్, అపర్ణా సేన్ లాంటి వాళ్ళను అనుకుని చివరికి షబానా అజ్మీని ఎంపిక చేసుకున్నారు బెనెగల్. ఆ సినిమాలో చివరి దృ శ్యంలో తెలంగాణ పోరడు రాయి తీసుకు ని భూస్వామి ఇంటి కిటికీ అద్దాలను పగులగొట్టే సీన్ ఆ సినిమాకే కాదు మొత్తం భా రతీయ సినిమాకు కొత్త సింబల్ ని ఇచ్చిం ది. అట్లా మొదలయిన శ్యాం బెనెగల్ సినీ జీవితంలో 24 పూర్తి నిడివి ఫీచర్ ఫిలిమ్స్ తీసాడు.

వాటిల్లో అనేక సిన్మాలు క్లాసిక్స్, ఉదాత్తమయిన సినిమాలుగా నిలబడ్డా యి.  ‘రచయిత, చిత్రకారుడు, సంగీతకారుడు ఇట్లా అందరు కళాత్మక జీవుల్లాగే సినిమా దర్శకుడు కూడా మానవీయ దృష్టికోణాన్ని కలిగి వుండాలి. అంతేకాదు స్థానికంగా కనిపిస్తూనే అంతర్జాతీయ దృక్పథాన్ని కలిగి వుండాలి’ అంటాడు బెనెగల్. తాను అట్లా ఆలోచించడానికి, సినిమాలు తీయడానికి చివరంటా ప్రయత్నించాడు. విజయం సాధించాడు.

జీవనచిత్రాలే ఇతివృత్తాలుగా..

జీవితమే తన గురువు అన్న బెనెగల్ ద ర్శకుడిగా సత్యజిత్ రే తనపైన అత్యంత ప్ర భావాన్ని కలిగించాడు అన్నారు. ఇవ్వాల్టి రోజుల్లో సౌత్ సినిమా, టాలీవుడ్, కోలీవు డ్ అంటూ మాట్లాడ్డం సరయినది కాదు అన్న బెనెగల్ సత్యజిత్ రే, మృణాల్ సేన్, రిత్విక్ ఘటక్ లాంటి వాళ్లు బెంగాలీలో నూ, గిరీష్ కాసరవెల్లి లాంటివాళ్లు  కన్నడంలోనూ, అరవిందన్, అదూర్ లాంటి వాళ్లు మలయాళం లోనూ తీసారు, కళారూపమయిన సినిమాను భాషల వారీగా, ప్రాంతం వారీగా మాట్లాడం సరయినది కాదని కూడాఅభిప్రాయపడ్డారు.

శ్యాం బెనెగల్ ‘అంకుర్’, నిశాంత్’, ‘మంథన్’ లాంటి సినిమాలతో పాటు స్త్రీ పాత్రలు ముఖ్యాభినేతలుగా అనేక సినిమాలు తీసారు. వాటిల్లో ముఖ్యమయిన ది ‘భూమిక’. ప్రముఖ నటి హన్సా వాడేకర్ జీవిత కథ ఆధారంగా సినిమా చేసా రు. స్మితా పాటిల్ ముఖ్య పాత్రని పోషించారు. అందులో స్త్రీ అంతరంగాన్ని, అను భవాల పరంపరని అల్లిక చేసి దృశ్యకావ్యంగా మలిచారు బెనెగల్. గొప్ప నటి జీ విత చరిత్రని మరో ప్రతిభావంతమయిన నటి పోషించిన చిత్రంగా ‘భూమిక’ సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచి పోయింది.

ప్రపంచ ప్రేక్షకులకు చేరువ

ఇక మరో మహిళా చిత్రం ‘మం డి’.వేశ్యల వ్యక్తిత్వాల్ని ఇరుసుగా చేసుకుని వారి జీవితాల్ని ఇతివృత్తంగా స్వీకరించి నిర్మించిన సినిమా మండి .అంతే కాదు బెనెగల్ వాస్తవిక దృష్టి షబానా, స్మితాల నటన ఆ సినిమాను మన హైదరబాదీలనే కాదు మొత్తం ప్రపంచ ప్రేక్షకుల్ని ఆలోచింప చేసింది. ఇక ఖాలిద్ మొహమ్మద్ రచన చేసిన మూడు సినిమాల ట్రయాలజీ ‘మమ్మో’. సర్దారి బేగం’. జుబేదా’. ఈ మూడూ ముస్లిం జీవితాల్లోని గతమూ, వర్తమానాల్ని హృద్యంగా ఆవిష్కరించాడు శ్యాం బెనెగల్.

ఇద్దరు మధ్యతరగతి మహిళల మధ్య వుండే ప్రేమ, అనుబంధం, ఆ ఇద్దరూ సొంత అక్కా చెల్లెళ్ళు అయినప్పుడు వాళ్ళు దేశాంతర సీమలని దాటి కలుసుకున్నప్పుడు ఉండే ఉద్విగ్న భావనని చూపించిన సినిమా మమ్మో’. ఇక తర్వాతి సినిమా ప్రేమనీ, స్నేహాన్నీ, దగ్గరితనాన్ని, ఆప్యాయతని, తనదే అయిన జీవితాన్ని ఆకాక్షించి అణచివేతకు నిరాదరణకు గురయిన ్రస్త్రీ జీవితావిష్కరణమే ‘జుబేదా’.  ఇక ‘సర్దారి బేగం’ కూడా అంతే. స్త్రీ జీవితాన్ని నిజాయితీగా తీసిన సినిమా.

అట్లా అనేక సినిమాలతో భారతీయ సి నిమాల్లో తనదయిన చెరిగిపోని సంతకా న్ని లిఖించిన శ్యాం బెనెగల్ టీవీలకు కూ డా సీరియల్స్ చేసారు. వాటిల్లో ముఖ్యమయినది ‘భారత్ ఎక్ ఖోజ్’. డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఉటంకించిన భారతీయ చరిత్రనుసాధికారికంగా 53 ఎపిసోడ్ల టీవీ సీరియల్‌గా రూపొందించాడు. భారతీయ రైల్వే నెట్‌వర్క్ ను వివరిస్తూ బెనెగల్ 15 ఎపిసోడ్ల ‘యాత్ర’ సీరియల్ తీసాడు. ఇక భారత రాజ్యాంగాన్ని, దాని రూపొంచడా న్ని వివరిస్తూ ‘మేకింగ్ ఆఫ్ కానిస్టిట్యూషన్’ తీసాడు.

మన స్కూళ్ళలో,్ల కాలేజీల్లో రాజ్యాంగం గురించికానీ, ప్రజాస్వామ్యా న్ని  గురించి కానీ బోధించే పద్ధతి లేదు. ఇక తెలుగులో సత్యం శంకరమంచి రాసిన అమరావతి  కథల్ని సీరియల్ గా రూపొందించారాయన. అంతే కాదు సత్యజిత్ రే, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి అనేక డా క్యుమెంటరీలు కూడా రూపొందించారు.

శ్యాం బెనెగల్ హైదరాబాద్ లో పెరిగిన వాడవడంతో పాటు అనుగ్రహం లాంటి సినిమా, అమరావతి కథలు లాంటి సీరియల్ తీసి తెలుగుతో తన అనుబంధాన్ని ప్రకటించుకున్నారు. భారతీయ సమాంతర సినిమా అనగానే ఘటక్, రే, సేన్ లతో పాటు బెనెగల్ కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతారు. ఆయన చేసిన నిరంతర కృషికి నమస్కరిస్తూ నివాళి.

-వారాల ఆనంద్