ఆదిలాబాద్,(విజయక్రాంతి): భారతదేశంలో స్త్రీ విద్యకు నాంది పలికి సమసమాజ నిర్మాణం కోసం కృషిచేసిన జ్ఞాన జ్యోతి సావిత్రిబాయి పూలే(Savitribai Phule) సేవలు చిరస్మరణీయమని అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్(Mali Mahasangam State President Sukumar) పెట్కులే అన్నారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆవరణలో ఉన్న ఫూలే దంపతుల విగ్రహాలకు సంఘ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే తన భర్త జ్యోతిబాపూలే సహకారంతో జనవరి ఒకటి 1848న పూణేలో భారత దేశ తొలి మహిళా పాఠశాలను ప్రారంభించారని ప్రవాహానికి వ్యతిరేకంగా ఎదురిది, ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకొని బాలికలకు విద్యను అందించాలని ఆమె కృషి ఫలితంగా నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణించగలుగుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా "మహిళా ఉపాధ్యాయ దినోత్సవం" గా ప్రకటించి జయంతిని అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.